రామసుబ్బారెడ్డి వైఎస్సార్ జిల్లా కోడూరు వాసి. ఐదేళ్ల కిందట తాడిపత్రికి వచ్చి స్థిరపడిన కొంతకాలానికే పేకాటకు బానిసయ్యాడు. మిగిలిన ఆస్తులతో పాటు ఇల్లుసైతం అమ్మేసి అద్దె ఇంట్లోకి మారాడు. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. భార్య పేరుపై ఉన్న కొద్దిపాటి పొలం అమ్మడానికి సిద్ధమైతే ఆమె అంగీకరించలేదు. అప్పులోళ్ల ఒత్తిడికి తట్టుకోలేక భార్య, ఇద్దరు పిల్లలను గతేడాది హత్యచేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు తాడిపత్రి ప్రజల జీవితాలను జూదం ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో తెలుసుకోవడానికి.
సాక్షి, ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో అభివృద్ధి మాటెలా ఉన్నా జూద క్రీడకు తాడిపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ ఇక్కడ విచ్చలవిడిగా సాగుతున్నాయి. కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు నిత్యం తాడిపత్రికి వస్తుంటారు. రోజూ లక్షల్లో ఆటలు సాగుతుంటాయి. మున్సిపాలిటీ పాలకవర్గంలోని ఓ ప్రతినిధి ఇంట్లోనే జూదం సాగుతుంది. అనంతపురం జిల్లాలో జరిగే క్రికెట్ బెట్టింగ్ సైతం తాడిపత్రి కేంద్రంగానే నడుస్తోంది. తాడిపత్రిలో పేకాట, మట్కా నిర్వహిస్తున్నదెవరో? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే విషయం పోలీసులకు తెలిసినా ఎలాంటి చర్యలు ఉండవు. కాదంటే తాడిపత్రిలోని ఓ పెద్దమనిషి నుంచి ఫోన్లు వస్తాయి. దారికొస్తే నెలనెలా మామూళ్లు.. లేదంటే బదిలీ బహుమానంగా ఇస్తారు. దీంతోనే ఇక్కడ వ్యసనాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. వేల కుటుంబాలు వ్యసనాలకు బానిసలైపోయారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకునేవారు.. హత్యలకు గురయ్యేవారూ ఉన్నారు. ఆస్తులు పొగొట్టుకుని, పిల్లలను చదివించలేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులూ ఉన్నారు. ఈ వ్యసనాలపై పత్రికల్లో కథనాలు వస్తున్నా పోలీసుశాఖ పట్టనట్లు వ్యవహరిస్తోంది.
మట్కా అడ్డాగా తాడిపత్రి
తాడిపత్రి మట్కాకు అడ్డాగా మారింది. ముంబయి నుంచి నడిచే మట్కాతో పాటు తాడిపత్రిలోని కొందరు స్వతంత్రంగా కంపెనీలు ఏర్పాటు చేసి మట్కా నడుపుతున్నారు. వీరికి అధికారపార్టీ నేతల మద్దతు ఉండటంతో తాడిపత్రిలో మట్కారాయుళ్లు బలంగా స్థిరపడిపోయారు. గతంలో రతనాల్ మట్కా వారానికి ఐదురోజులు జరిగేది. ఇప్పుడు కళ్యాణ్, సత్తా మట్కాలు ఆరురోజులు జరుగుతున్నాయి. వీటికి నంబర్లు గుజరాత్, ముంబయి నుంచి వస్తాయి. ఇవి కాకుండా తాడిపత్రిలోని కొందరు ప్రైవేటు వ్యక్తులు మట్కా నడుపుతున్నారు. ఈ మట్కా ఆదివారం కూడా నడుస్తోంది. కళ్యాణ్, సత్తా మట్కాలు సాయంత్రం 5 గంటల వరకూ చీటీలకు డబ్బులు తీసుకుంటారు. రాత్రి 9.15కు ఓపెన్, రాత్రి 11.15కు క్లోజ్ నంబరు ప్రకటిస్తారు. ఆ వెంటనే బ్రాకెట్ నంబరు రిలీజ్ చేస్తారు. స్థానిక మట్కా నంబర్లు వీటికి గంట ముందే రిలీజ్ చేస్తారు.
మట్కాలో భారీగా మోసం
మట్కా రెగ్యులర్‌గా రాసేవారి పేర్లను మట్కారాయుళ్లు ల్యాప్‌టాప్‌లో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా పొందుపరిచారు. ప్రాంతాల వారీగా ఈ పేర్లు విడదీస్తారు. రోజువారీ ఎవరు ఏ నంబర్‌పై పందెం కాశారో ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌లో పొందుపరుస్తారు. దీంతో కేంద్రాల వారీగా ఏ నంబర్లపై ఎక్కువ మంది కాశారు? ఏ నంబర్లపై తక్కువ పందెం కట్టారు? అనేది నిర్వాహకులకు క్షణాల్లో స్పష్టత వస్తుంది. దీని ఆధారంగా తక్కువ మంది కట్టిన నంబర్లను ప్రకటిస్తున్నారు. దీంతో మట్కారాయుళ్లు భారీగా ఆర్జిస్తున్నారు. ఈ ఊబిలో కూరుకుపోయి వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. అయినా పోలీసులు నివారణ దిశగా చర్యలు తీసుకోవడం లేదు.
మూన్నాళ్ల ముచ్చటే
మట్కా, పేకాట, బెట్టింగ్‌పై ఆరోపణలు ఎదుర్కొంటున్న 26 మంది కానిస్టేబుళ్లపై అప్పటి ఎస్పీ రాజశేఖరబాబు వేటు వేశారు. కొందరు సీఐలను కూడా డీఐజీ ప్రభాకర్‌రావు వీఆర్‌కు పంపారు. ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు తీసుకున్న తర్వాత 76 మంది మట్కా రాయుళ్లను తాడిపత్రి దాటించారు. అయితే రెండు నెలలకే వారంతా తిరిగి తాడిపత్రిలో మకాం వేశారు. ఇప్పుడు ఎలాంటి జంకు లేకుండా ‘పెద్దలు’ జోక్యం చేసుకోవడంతో యథేచ్ఛగా పేకాట, మట్కా నడుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment