చాంబర్లకు ఎందుకు వెళుతున్నారు?
విలేకరులపై అక్కసు వెళ్లగక్కిన మేయర్ కోనేరు శ్రీధర్
విజయవాడ సెంట్రల్ : పేపరోళ్లు కార్పొరేషన్‌లో తిరగడానికి వీల్లేదు. అధికారుల చాంబర్లలో వారికి పనేంటి? అదేమైనా మీ హక్కు అనుకుంటున్నారా? మీడియా పాయింట్ పెడతాం. వార్తలు చెబుదామనుకున్నవాళ్లు అక్కడకే వస్తారు.. అంటూ మేయర్ కోనేరు శ్రీధర్ విలేకరులపై అక్కసు వెళ్లగక్కారు. తన చాంబర్‌లో బుధవారం ఆయన విలేకరులను ఉద్దేశించి మాట్లాడారు. ‘వార్తల కోసం తిరుగుతున్నామని..’ విలేకరులు చెప్పగా ‘అక్కర్లేదు.. త్వరలోనే మీకు మీడియా పాయింట్ పెడతాం. అక్కడే ఉండండి..’ అన్నారు. ‘పేపర్లు చదవద్దని మా మంత్రిగారు చెప్పారు. ఎవరేం రాసుకున్నా ఫరవాలేదు..’ అన్నారు.
ఇమేజ్ డామేజ్
ఇటీవలికాలంలో మేయర్ శ్రీధర్ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. డెప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) డి.వెంకటలక్ష్మితో చోటుచేసుకున్న వివాదం నేపథ్యంలో ఉద్యోగులు ఆయన్ను గట్టిగానే హెచ్చరించారు. ఆ తరువాత ఎంపీ కేశినేని కార్యాలయంలో జరిగిన పార్టీ అంతర్గత సమావేశంలోనూ పలువురు కార్పొరేటర్లు మేయర్ తీరును ఎండగట్టారు. పద్ధతి మార్చుకోవాల్సిందిగా పార్టీ పెద్దలు తమదైన శైలిలో హెచ్చరించారు. ఈ విషయాలు పత్రికల ద్వారా వెలుగులోకి రావడంతో మేయర్ ఇమేజ్ డామేజ్ అయింది. ఈ క్రమంలో పత్రికల్ని టార్గెట్ చేయాలన్న యోచనకు మేయర్ వచ్చినట్లు తెలుస్తోంది.
పెరుగుతున్న అంతరం
చీటికీ మాటికీ కోప్పడటం.. ప్రతి దానికీ అరవడంతో ఉద్యోగులు మేయర్‌పై విసుగెత్తిపోయారు. కమిషనర్ ద్వారా సమాచారం తెప్పించుకుని పాలన సాగించాల్సిన మేయర్ అన్నీ తానై వ్యవహరించడంతో అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సిల్ తీర్మానాలను తారుమారు చేయడం, స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కమిషనర్ తిరిగి మార్పు చేయడం వంటి పరిణామాలు మేయర్ పనితీరును ప్రశ్నిస్తున్నాయి. ‘ఆయన వైఖరి ఎప్పుడు, ఎలా ఉంటుందో తెలియక చస్తున్నాం..’ అంటూ సొంత పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
పేపరోళ్లు కార్పొరేషన్‌లో తిరగొద్దు
Published Thu, Dec 25 2014 1:58 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM
Advertisement
Advertisement