సీఎం వద్దే డబ్బుల్లేవు.. మనకేం ఇస్తారు!
హైదరాబాద్ : ‘రాష్ట్ర ఖజానా నిండుకుండ అయితే ముఖ్యమంత్రిని నిధులు అడగొచ్చు. సీఎం వద్దే డబ్బుల్లేవు. కార్పొరేషన్‌కు ఎక్కడ నుంచి తెచ్చి ఇస్తారు’ అని నగరపాలక సంస్థ మేయర్ కోనేరు శ్రీధర్ అన్నారు. ఆయన నిన్న విలేకర్లతో మాట్లాడారు. కార్పొరేషన్లో అధికారులు జీవోలను సక్రమంగా అమలు చేస్తే ఎవర్నీ నిధులు కోసం అడగక్కర్లేదన్నారు. నగరపాలక సంస్థ రూ.350 కోట్ల అప్పుల్లో ఉందన్నారు. దీనిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తానని ప్రకటించారు. నగరానికి శనివారం రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు.
డంపింగ్ యార్డుకు స్థల సేకరణ, విజయవాడను గ్రేటర్ సిటీ చేయాలని, ఉద్యోగులకు 010 పద్దు ద్వారా జీతాలు చెల్లించాలని, అర్ధంతరంగా నిలిచిపోయిన జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పనులకు నిధులు ఇవ్వాలని చంద్రబాబును కోరతామని వివరించారు. డంపింగ్‌యార్డుకు ఆగి రిపల్లి మండలంలో 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. స్థల కేటాయింపు విషయమై నూజివీడు సబ్ కలెక్టర్‌తో చర్చించామన్నారు. త్వరలోనే డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమవుతుందన్నారు. కాంగ్రెస్ అస్తవ్యస్త విధానాల వల్లే కార్పొరేషన్ దివాళా తీసిందని దుయ్యబట్టారు.