రాష్ట్రంలో ఉన్నత విద్య ఫీజులు వరుసగా మోతమోగిపోతున్నాయి. కొద్ది రోజుల కిందే ఇంజనీరింగ్, ఫార్మసీ ఫీజులను భారీగా పెంచిన ప్రభుత్వం.. తాజాగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ఫీజులనూ పెంచింది. గత ఏడాది రూ. 27 వేల కంటే అధికంగా ఫీజు ఉన్న ఎంబీఏ కళాశాలల సంఖ్య 61 మాత్రమేకాగా.. ఈ సారి అంతకు నాలుగు రెట్లు అంటే ఏకంగా 259 కళాశాలల్లో రూ. 27,200 నుంచి రూ. 70 వేల మధ్య ఫీజును ఖరారు చేశారు.
ఎంసీఏలో గత ఏడాది 58 కళాశాలల్లో ఫీజు రూ. 27 వేల కంటే ఎక్కువగా ఉండగా.. ఈసారి 94 కళాశాలల్లో రూ. 27,500 నుంచి రూ. 82 వేల మధ్య నిర్ణయించారు. ఈ మేరకు ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో 2013-16 బ్లాక్ పీరియడ్‌కు సంబంధించిన ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవంగా ఈ నెల 3వ తేదీ నుంచే ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాల్సి ఉంది. కానీ, ఫీజులు ఖరారు కాకపోవడం, సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగుతుండడం తదితర కారణాలతో ఆ ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వం.. అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్సీ) ప్రతిపాదించిన ఫీజులను ఆమోదిస్తూ శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. అయితే.. వ్యయ నివేదికలు సమర్పించని 132 ఎంబీఏ కళాశాలల్లో తాత్కాలిక ఫీజును రూ. 23 వేలుగా నిర్ధారించింది. ఆ కళాశాలలు సెప్టెంబర్ 30లోగా వ్యయనివేదికలు సమర్పించాలని షరతు విధించింది.
వ్యయ నివేదికలు సమర్పించిన వాటిలో 300 కళాశాలలకు రూ. 27 వేలు, మరో 259 కళాశాలలకు రూ. 27,200 నుంచి రూ. 70 వేల మధ్య ఫీజులను ఖరారు చేసింది. 2012-13లో ఎంబీఏలో చేరి ఈ సారి ద్వితీయ సంవత్సరానికి వచ్చిన విద్యార్థులకు సంబంధించి 48 కళాశాలల్లో ఫీజు మారనుంది. ఆ ఫీజులు రూ. 43,900 నుంచి రూ. 56,800 మధ్య ఉన్నాయి.
ఎంసీఏ కళాశాలల్లో..
వ్యయ నివేదికలు సమర్పించిన ఎంసీఏ కాలేజీల్లో... 147 కళాశాలలకు రూ. 27 వేలు, 94 కళాశాలలకు రూ. 27,500 నుంచి రూ. 82,000గా ఫీజును నిర్ధారించారు. వ్యయ నివేదికలు సమర్పించని 44 ఎంసీఏ కళాశాలల్లో తాత్కాలిక ఫీజుగా రూ. 23 వేలుగా నిర్ణయించి, ఆ కాలేజీలు సెప్టెంబర్ 30లోగా వ్యయ నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఇక 2012-13లో చేరి ఈ సారి ఎంసీఏ రెండో సంవత్సరానికి చేరిన విద్యార్థులకు సంబంధించి 49 కళాశాలల్లో ఫీజులు మారుతున్నాయి. ఆ ఫీజులు రూ. 42,900 నుంచి రూ. 69 వేల మధ్య ఉన్నాయి.
ఎంబీఏ, ఎంసీఏ ఫీజుల మోత
Published Sat, Aug 17 2013 2:38 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement