వామ్మో.. పెరుగన్నం, వాటర్ బాటిల్ రూ.300 !
శ్రీకాళహస్తి, న్యూస్‌లైన్: అదేదో ఫైఫ్‌స్టారో, త్రీస్టారో హోటల్ కాదు; అయినా పెరుగన్నం, వాటర్ బాటిల్ ఖరీదు అక్షరాలా రూ.300..! ఇదేమి చోద్యం అని అనుకుంటున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాళహస్తి మున్సిపల్ అధికారుల వడ్డన ఇది..! ఆ పెరుగున్నంలోకి స్పూను పెడితే... మున్సిపల్ ఎన్నికల్లో విధుల నిర్వహణకు పలమనేరు నుంచి 150 మంది ఉద్యోగులు శనివారం శ్రీకాళహస్తికి వచ్చారు.
ఆదివారం పోలింగ్ ముగిసిన తర్వాత ఉద్యోగులకు మున్సిపల్ అధికారులు రూ.500 మాత్ర మే ఇచ్చారు. వాస్తవానికి రూ.800 ఇవ్వాల్సి ఉంది. మరో రూ.300 ఇవ్వాలని ఉద్యోగులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. శనివారం మధ్యాహ్నం పెరుగు అన్నం, వాటర్ బాటిల్‌కు రూ.300 కట్ చేసినట్లు చెప్పారు. దీంతో ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు.
పెరుగన్నం, వాటర్ బాటిల్‌కు మూడు వందలా!? అంటూ మండిపడ్డారు. అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఉద్యోగులకు నచ్చజెప్పారు. గంటపాటు ధర్నా చేసిన వారు చేసేదేమీలేక పలమనేరు బస్సు ఎక్కి వెళ్లిపోయారు.
ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు
మదనపల్లె సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన సిబ్బంది ఆదివారం ఆకలికేకలతో అలమటించారు. మదనపల్లె మున్సిపాలిటీలో 34 వార్డుల్లో ఎన్నికల సిబ్బందికి ప్యాకెట్లలో ఇచ్చిన అల్పాహారం, భోజనం పాచిపోయి ఉండడంతో వాటిని ఎవరూ తినలేదు. పోలింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమీ పట్టనట్టు వ్యవహరించారు. వాస్తవానికి ఎన్నికల సిబ్బందికి రెండు రోజులకుగాను రూ.300 ఖర్చు చేయాల్సి ఉండగా మున్సిపల్ అధికారులు చేతివాటం ప్రదర్శించారని ఎన్నికల సిబ్బంది ఆరోపణ. దాదాపు 100 కిలోమీటర్ల దూరం నుంచి ఎన్నికల విధులకు వస్తే డీఏలో కూడా కోతలు పెట్టారని పేర్కొన్నారు.