కోటి దాటిన మొక్కులు
మేడారం.. జనసంద్రం
ఒక్కరోజే యాభైలక్షల మంది దర్శనం
మేడారం నుంచి సాక్షి ప్రతినిధి: సమ్మక్క, సారలమ్మ నామస్మరణతో మేడారం ఉప్పొంగింది. ‘సమ్మక్క కో... సారక్క కో’ అంటూ గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తుల పూనకాలతో దద్దరిల్లింది. చీర, సారె, నిలువెత్తు బంగారం(బెల్లం), ఎదుర్కోళ్లు, ఒడి బియ్యం, కొబ్బరి కాయలు... తీరొక్క రూపాల్లో వనదేవతలకు మనసారా మొ క్కులు చెల్లించుకున్నారు. అమ్మల ప్రసాదం(బెల్లం) కోసం భక్తులు పోటీపడ్డారు.
భక్తుల రద్దీ దృష్ట్యా దేవాదాయ శాఖ వారు గద్దెల ప్రాంగణంలో కాకుండా బయటికి వెళ్లే దారిలో వీటిని భక్తులకు అందించారు. పవిత్రమైన మాఘశుద్ధ పౌర్ణమి(సమ్మక్కల పున్నము) రోజున వనదేవుళ్లు... సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపై కొలువుదీరడంతో దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం ఉదయం నుంచే క్యూలైన్లు, గద్దెల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
కోటి 30 లక్షల మంది దర్శనం: ఈసారి జాతరకు కోటి మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అయితే జాతర ముగిసేందుకు శనివారం వరకు సమయం ఉండగా, శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది మొక్కులు చెల్లించుకోగా, ఇప్పటివరకు ఈ సంఖ్య కోటికి చేరినట్లు అధికారులు అంచనా వేశారు. అంతకుముందు గురువారం వరకు ముందస్తు మొక్కులతో కలిసి 80 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ముఖ్యంగా సమ్మక్క-సారలమ్మలిద్దరు గద్దెలపై కొలువై ఉండడంతో శుక్రవారం దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మనరాష్ట్రంతోపాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులు కూడా మొక్కులు చెల్లించుకున్నారు.
క్యూలైన్లలో భక్తుల ఇబ్బందులు: భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో క్యూలైన్లలో పలుమార్లు తోపులాట జరిగింది. సాధారణ భక్తులకు దర్శనం 6 గంటల వరకు పట్టింది. రాత్రి వరకూ ఇదే పరిస్థితి కొనసాగింది. క్యూలైన్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో మహిళా భక్తులు ఇబ్బంది పడ్డారు. పోలీసుల దురుసు ప్రవర్తనతో భక్తుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మరికొందరకు భక్తులు సర్వదర్శనం బారికేడ్లను తొలగించి వీఐపీ దర్శనం క్యూలైన్ల వైపు వెళ్లారు. సాధారణ భక్తుల నిరసనతో వీఐపీ, ప్రత్యేక దర్శనాలను అధికారులు నిలిపివేశారు. ఆఖరికి ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి సైతం తల్లుల దర్శనం చేసుకున్న తర్వాత గద్దెల ప్రాంగణం నుంచి బయటకు వెళ్లేందుకు రెండు గంటల సేపు వేచి చూడాల్సి వచ్చింది. జాతరలో ప్రమాదవశాత్తు పోలీసుల తూటా పేలింది. ఈ ఘటనలో ములుగు మండలం అడవి మల్లంపల్లికి చెందిన ఆర్షం కొమురమ్మ(78)కు గాయాలయ్యాయి.