మీడియాపై ‘సీఎం’ల తీరు దారుణం
అధికార మదంతోనే మీడియాపై దాడులు: ఐజేయూ
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల తీరు అప్రజాస్వామికం
తిరుపతి: రాజకీయ నాయకులు అధికార అహంకారంతోనే మీడియాపై దాడులకు పాల్పడుతున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్ విమర్శించారు. తిరుపతిలో శనివారం నుంచి జరుగుతున్న యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మీడియాపై దాడులు, జర్నలిస్టులకు అందాల్సిన కనీస వేతనాలు వంటి సమస్యలపై చర్చించి అనేక తీర్మానాలు చేశారు. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతిలో వారు విలేకరులకు వివరించారు.
భారత, ప్రపంచదేశాల్లోనూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, అంగబలం ముసుగులో చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు చూపించడం తప్పా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, సాక్షి చానెల్ ప్రతినిధులను హాజరు కానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడం దారుణమన్నారు. అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ టీవీ9, ఏబీఎన్ చానెళ్లపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. మీడియాను పది కిలోమీటర్ల లోతులో పూడ్చివేస్తాననడం, జర్నలిస్టుల తలలు నరికి పాతేస్తానని చెప్పడం దారుణమన్నారు. ఎంఎస్‌వోలకు చానెళ్లను మూతవేయించే అధికారం లేదన్నారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాల వైఖరిపై అవసరమైతే కోర్టు ధిక్కారం వ్యాజ్యం వేసే అధికారాన్ని సెక్రటరీ జనరల్‌కు అప్పగించే తీర్మానంలో ఐజేయూ ఆమోదించిందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.