మంగళగిరి పోలీసులకు ప్రెస్ కౌన్సిల్ ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ జర్నలిస్టులకు జారీ చేసిన సమన్ల కేసులో తాము మళ్ళీ ఆదేశాలు ఇచ్చేవరకు ఎటువంటి దుందుడుకు చర్యలూ తీసుకోరాదని మంగళగిరి పోలీసులను ప్రెస్‌కౌన్సిల్ విచారణ కమిటీ ఆదేశించింది. ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన విచారణ కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశమైంది.
సమన్ల అంశంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపింది. ఏపీ రాజధానికి భూముల సమీకరణ వ్యవహారంలో రాసిన కథనాలకు ‘సాక్షి’ జర్నలిస్టులు తమ ముందు హాజరై ఆధారాలను వెల్లడించాలంటూ మంగళగిరి పోలీసులు మార్చి 22న, తిరిగి సెప్టెంబర్ 5న నోటీసులు జారీ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసిన అమర్ విచారణ కమిటీ ముందు హాజరై తన వాదనలను వినిపించారు.
‘సాక్షి’ జర్నలిస్టులను భయపెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి పోలీసులు ఈ సమన్లు జారీ చేశారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ప్రెస్ కౌన్సిల్ తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నందున కేసును వాయిదా వేయాలని ఏపీ పోలీసులు కౌన్సిల్‌ను కోరారు. దీంతో విచారణ కమిటీ తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది.