Indian Journalists Union
-
ప్రజాస్వామ్యంపై దారుణ దాడి
లండన్: నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కార్.. భారత ప్రజాస్వామ్య మౌలిక స్వరూపంపై దాడికి తెగబడిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకే కన్యాకుమారి నుంచి కశ్మీర్‌దాకా భారత్ జోడో యాత్రగా ముందుకు కదిలామని ఆయన వివరించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న రాహుల్ శనివారం సాయంత్రం లండన్‌లోని ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఐజేఏ) కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు. ‘ దేశ ప్రజాస్వామ్య మౌలిక స్వరూపం ప్రమాదంలో పడింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను మోదీ సర్కార్ ముమ్మరం చేసింది. దేశం గొంతు నొక్కాలని చూస్తున్న బీజేపీ యత్నాన్ని అడ్డుకునేందుకు భారత్ జోడో యాత్రగా ప్రజల వాణిని వినిపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే యాత్ర చేపట్టాం. విపక్షాల ఐక్యత కోసం సంప్రతింపులు చురుగ్గా సాగుతున్నాయి. నిరుద్యోగిత, పెరిగిన ధరలు, మహిళలపై హింసతో పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని తగ్గించేలా ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి జరుగుతోంది’ అని రాహుల్ అన్నారు. ‘ఇటీవల ముంబై, ఢిల్లీలో బ్రిటన్‌కు చెందిన బీబీసీ వార్తా సంస్థ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖతో సర్వే పేరిట ఆకస్మిక దాడులు చేయించి భయపెట్టి, కేంద్రం మీడియా గొంతు నొక్కాలని చూస్తోంది. బీబీసీ మోదీ సర్కార్ మాట వింటే సంస్థపై మోపిన తప్పుడు కేసులన్నీ మాయమవుతాయి’ అని ఆరోపించారు. ప్రతిష్ట దిగజార్చింది ఆయనే విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను దిగజార్చేలా రాహుల్ మాట్లాడారని శుక్రవారం బీజేపీ చేసిన విమర్శలపై రాహుల్ బదులిచ్చారు. ‘ నా దేశాన్ని ఏనాడూ తక్కువ చేసి మాట్లాడలేదు. అది నా స్వభావం కూడా కాదు. ప్రధాని హోదాలో విదేశీ పర్యటనకు వెళ్లి మోదీయే ఆ పనిచేశారు. గత దశాబ్దకాలంలో భారత్ అభివృద్ధికి నోచుకోలేదని మోదీ అన్నారు. దేశ పురోగతికి పాటుపడిన ఇక్కడి ప్రజలను ఆయన అవమానించలేదా ? ’ అని ప్రశ్నించారు. -
జర్నలిస్టులకు బీమా వర్తింపజేయాలి
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరారు. సోమవారం బీఆర్కే భవన్లో మంత్రిని కలిసిన అల్లం నారాయణ వినతి పత్రాన్ని అందజేశారు. పలువురు జర్నలిస్టులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోందని వారందరికీ విధిగా వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరారు. విధి నిర్వహణలో భాగంగానే టీవీ విలేకరి మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందాడని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి జర్నలిస్టుకు కరోనా కిట్ (మాస్క్, సానిటైజర్, పీపీఈ కిట్, గ్లౌజ్) సరఫరా చేయాలని కోరారు. జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులతో కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందేలా, టెస్ట్‌లకు వర్తించేలా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులకు రూ.20 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని అన్నారు. ఇందుకు మంత్రి ఈటల సానుకూలంగా స్పందిస్తూ జర్నలిస్టులందరికి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్, టెమ్జూ అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, చిన్నపత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, జర్నలిస్టుల సంఘాల నాయకులు నవీన్ కుమార్, పార్థ సారధి తదితరులు పాల్గొన్నారు. మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఐజేయూ, టీయూడబ్ల్యూజే డిమాండ్ హిమాయత్‌నగర్: విధి నిర్వహణలో కరోనా కాటుకు బలైన టీవీ జర్నలిస్ట్ మనోజ్ కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన తప్పదని ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్‌లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మనోజ్ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం స్పందించకపోవడం జర్నలిస్టులను ఆందోళనకు గురి చేసిందన్నారు. కరోనా మహమ్మారిని నివారించడానికి వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల మాదిరిగానే అత్యవసర విభాగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు కూడా రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని ఆదినుంచీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జర్నలిస్టుల కోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
జర్నలిస్టుల సమస్యలపై 4న ‘చలో ఢిల్లీ’
సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీయూడబ్ల్యూజే(ఐజేయూ) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలిపారు. మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలోనే గవర్నర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో 220 మంది జర్నలిస్టులు అకాల మరణం పొందారన్నారు. జర్నలిస్టుల హెల్త్‌కార్డులు ఎక్కడా పనిచేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో జర్నలిస్టుల అకాల మరణాల నిలుపుదల కోసమే టీయూడబ్ల్యూజే చలో ఢిల్లీకి పిలుపునిచ్చిందని చెప్పారు. జర్నలిస్టులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఎలక్ట్రానిక్ మీడియాకు చట్టబద్ధత కల్పించాలని కోరారు. మీడియా స్వేచ్ఛను హరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయనున్నట్లు చెప్పారు. త్రిపుర, అస్సాంలో మాదిరిగా దేశ వ్యాప్తంగా 60 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు రూ.10 వేల పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ఐజేయూ సీనియర్ నేత కె. శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ వేజ్‌బోర్డు సిఫారసులు అమలు చేయాలని చాలా కాలంగా కోరుతున్నా పరిష్కారాం కావటంలేదన్నారు. జర్నలిస్టుల సంఘాలతో మంత్రి కేటీఆర్ చర్చలు జరిపినా ఫలితం కనపడటంలేదన్నారు. -
‘సాక్షి’పై దుందుడుకు చర్యలొద్దు
మంగళగిరి పోలీసులకు ప్రెస్ కౌన్సిల్ ఆదేశం సాక్షి, న్యూఢిల్లీ: ‘సాక్షి’ జర్నలిస్టులకు జారీ చేసిన సమన్ల కేసులో తాము మళ్ళీ ఆదేశాలు ఇచ్చేవరకు ఎటువంటి దుందుడుకు చర్యలూ తీసుకోరాదని మంగళగిరి పోలీసులను ప్రెస్‌కౌన్సిల్ విచారణ కమిటీ ఆదేశించింది. ప్రెస్ కౌన్సిల్ అధ్యక్షులు జస్టిస్ సీకే ప్రసాద్ అధ్యక్షతన విచారణ కమిటీ గురువారం ఢిల్లీలో సమావేశమైంది. సమన్ల అంశంపై ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపింది. ఏపీ రాజధానికి భూముల సమీకరణ వ్యవహారంలో రాసిన కథనాలకు ‘సాక్షి’ జర్నలిస్టులు తమ ముందు హాజరై ఆధారాలను వెల్లడించాలంటూ మంగళగిరి పోలీసులు మార్చి 22న, తిరిగి సెప్టెంబర్ 5న నోటీసులు జారీ చేశారు. దీనిపై ఫిర్యాదు చేసిన అమర్ విచారణ కమిటీ ముందు హాజరై తన వాదనలను వినిపించారు. ‘సాక్షి’ జర్నలిస్టులను భయపెట్టడానికి, వారి గొంతు నొక్కడానికి పోలీసులు ఈ సమన్లు జారీ చేశారని చెప్పారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ప్రెస్ కౌన్సిల్ తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభం కానున్నందున కేసును వాయిదా వేయాలని ఏపీ పోలీసులు కౌన్సిల్‌ను కోరారు. దీంతో విచారణ కమిటీ తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. -
కరాచీ సదస్సుకు ఐజేయూ ప్రతినిధులు
హైదరాబాద్: ‘వన్ వరల్డ్-వన్ మీడియా’ అనే అంశంపై పాకిస్తాన్‌లోని కరాచీలో జరగనున్న అంతర్జాతీయ సదస్సుకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ప్రతినిధులు హాజరుకానున్నారు. అంతర్జాతీయ సదస్సుకు హాజరు కావాలంటూ పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) నుంచి ఐజేయూకు ఆహ్వానం అందింది. దీంతో ఈ సదస్సుకు ఐజేయూ ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్, కోశాధికారి షబీనా ఇందర్జీత్లను పంపాలని నిర్ణయించినట్లు యూనియన్ నాయకుడు కె. అమర్నాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల 1 నుంచి 4 వరకు జరిగే ఈ సదస్సుకు ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికాతో పాటు దాదాపు 15 దేశాలకు చెందిన జర్నలిస్టు ప్రతినిధులు, వివిధ యూనియన్ల నేతలు పాల్గొంటారు. -
ఐజేయూ అధ్యక్షుడిగా ఎస్.ఎన్.సిన్హా
ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన దేవులపల్లి అమర్ సాక్షి, హైదరాబాద్: ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్ మళ్లీ ఎంపికయ్యారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవులకు నామినేషన్ల ఉపసంహరణ గడువు శుక్రవారం మధ్యాహ్నం ముగిసింది. ఒక్కో నామినేషనే మిగలడంతో అధ్యక్షునిగా ఎస్.ఎన్.సిన్హా, ప్రధాన కార్యదర్శిగా దేవులపల్లి అమర్ రెండోసారి ఏకగ్రీవంగా ఎంపికైనట్లు యూనియన్ కేంద్ర ఎన్నికల అధికారి రామకృష్ణ ప్రకటించారు. ఢిల్లీకి చెందిన ఎస్.ఎన్.సిన్హా హిందూస్థాన్ టైమ్స్‌లో ఫొటో జర్నలిస్టుగా చేరి 30ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేసి ఫొటో ఎడిటర్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అమర్ సీనియర్ జర్నలిస్టు. మీడియాలో మూడున్నర దశాబ్దాల అనుభవం ఉంది. 2005 - 2010 మధ్య రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రముఖ వార్తా చానెళ్లలో న్యూస్ బేస్డ్ కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తున్నారు. సిన్హా, దేవులపల్లి అమర్ మళ్లీ ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎంపిక కావడంపట్ల తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్. శేఖర్, కె.విరహత్ అలీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.సోమసుందర్, ఐవీ సుబ్బారావు అభినందనలు తెలిపారు. -
జర్నలిస్టులపై పోలీసుల దాడి తగదు
ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ సాక్షి, హైదరాబాద్: హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాలో వార్తా సేకరణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు క్రూరంగా దాడి చేయడాన్ని ఇండియన్ జర్నలిస్టుల యూనియన్ (ఐజేయూ) ఖండించింది. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు జర్నలిస్టులపై దాడికి పాల్పడ్డారని ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్ , జర్నలిస్టు నాయకుడు కె. అమరనాథ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన పోలీసు అధికారులను హర్యానా ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేసి, విచారణ జరపాలని డిమాండ్ చేశారు. -
డిసెంబరు 5 నిరసనలో జర్నలిస్టులు పాల్గొనాలి: ఐజేయూ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో డిసెంబరు 5న తలపెట్టిన నిరసనలో జర్నలిస్టులందరూ పాల్గొనాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), పలు జర్నలిస్టు సంఘాలు పిలుపునిచ్చాయి. యాజమాన్యాలకు అనుగుణంగా కార్మిక చట్టాలు మారిస్తే.. కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ఇందుకు వ్యతిరేకంగా పోరాడాలని ఐజేయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.ఎన్. సిన్హా, దేవులపల్లి అమర్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబరు 5న జరిగే నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని ఏపీ న్యూస్‌పేపర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆంజనేయులు, ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమసుందర్, ఐవీ సుబ్బారావు, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, విరహత్ అలీ వేర్వేరు ప్రకటనల్లో పిలుపిచ్చారు. -
మీడియాపై ‘సీఎం’ల తీరు దారుణం
అధికార మదంతోనే మీడియాపై దాడులు: ఐజేయూ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల తీరు అప్రజాస్వామికం తిరుపతి: రాజకీయ నాయకులు అధికార అహంకారంతోనే మీడియాపై దాడులకు పాల్పడుతున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.ఎన్.సిన్హా, దేవులపల్లి అమర్ విమర్శించారు. తిరుపతిలో శనివారం నుంచి జరుగుతున్న యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మీడియాపై దాడులు, జర్నలిస్టులకు అందాల్సిన కనీస వేతనాలు వంటి సమస్యలపై చర్చించి అనేక తీర్మానాలు చేశారు. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను తిరుపతిలో వారు విలేకరులకు వివరించారు. భారత, ప్రపంచదేశాల్లోనూ జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం, అంగబలం ముసుగులో చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు చూపించడం తప్పా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, సాక్షి చానెల్ ప్రతినిధులను హాజరు కానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడం దారుణమన్నారు. అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ టీవీ9, ఏబీఎన్ చానెళ్లపై దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. మీడియాను పది కిలోమీటర్ల లోతులో పూడ్చివేస్తాననడం, జర్నలిస్టుల తలలు నరికి పాతేస్తానని చెప్పడం దారుణమన్నారు. ఎంఎస్‌వోలకు చానెళ్లను మూతవేయించే అధికారం లేదన్నారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తున్న యాజమాన్యాల వైఖరిపై అవసరమైతే కోర్టు ధిక్కారం వ్యాజ్యం వేసే అధికారాన్ని సెక్రటరీ జనరల్‌కు అప్పగించే తీర్మానంలో ఐజేయూ ఆమోదించిందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
మీడియాపై కక్ష సాధింపు తగదు
‘సాక్షి’ ప్రతినిధులను అడ్డుకోవడం చట్టవిరుద్ధం ఆంధ్రా సీఎం తీరు అప్రజాస్వామికం ఐజేయూ జాతీయ సమావేశాల్లో కీలకతీర్మానాలు తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాపై కక్ష సాధింపునకు పాల్పడటం దారుణమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతిలో రెండో రోజు ఆదివారం ఐజేయూ కార్యవర్గ సమావేశం జరిగింది. యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్.ఎన్.సిన్హా అధ ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ కార్యదర్శి నివేదికను అందించారు. 16 రాష్ట్రాల ప్రతినిధులు చర్చలో పాల్గొని, దేశవ్యాప్తంగా మీడియా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత, మీడియాపై దాడులు, ట్రాయ్ సిఫార్సులు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన పత్రికా సమావేశాలకు ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ చానల్ ప్రతినిధులను హాజరుకానీయకుండా భద్రతా సిబ్బంది ద్వారా అడ్డుకోవడంపైనా చర్చించారు. ఇది చట్టవిరుద్ధం, అప్రజాస్వామికం, మీడియా వ్యతిరేక చర్యగా ఐజేయూ ప్రతినిధులు పేర్కొన్నారు. సమాచార పౌరసంబ ంధాల శాఖ నుంచి అక్రిడిటేషన్ కలిగిన ‘సాక్షి’ సిబ్బందిని సీఎం పత్రికా సమావేశాలకు రానీయకపోవడం మీడియా స్వేచ్ఛపై దాడిగా, ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కుకు అవరోధం కలిగించే చర్యగా ఐజేయూ అభిప్రాయపడింది. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న సాక్షి పత్రిక ప్రతినిధుల పట్ల సీఎం భద్రతా సిబ్బంది అనుసరిస్తున్న వివక్షపూరిత చర్యలను విరమించుకోవాలన్నారు. దీనిపై ఏపీ సీఎం సిబ్బందికి ఆదేశాలు ఇచ్చి సాక్షి ప్రతినిధులను తన పత్రికా సమావేశాలకు హాజరయ్యేట్లు చూడాలని, పత్రికా స్వేచ్ఛకు గల పవిత్రతను కాపాడాలని కోరారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఆందోళన తెలంగాణలో మీడియాపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రతినిధులు చర్చించారు. ప్రజాస్వామిక ఆకాంక్షలకు ప్రతినిధిగా దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే మీడియాపై విరుచుకుపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో మీడియాపై ఇంత దారుణంగా విరుచుకుపడుతున్న వ్యక్తి మరెవ్వరూ లేరన్నారు. -
పత్రికా సమావేశాలకు అనుమతించకపోవడం అన్యాయం
ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై ఐజేయూ సీనియర్ నేత శ్రీనివాస్‌రెడ్డి ధ్వజం తిరుపతిలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు తిరుపతి: ఓ పత్రికకు చెందిన ప్రతినిధులను పత్రికా సమావేశాలకు అనుమతించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సీనియర్ నేత కే.శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించా రు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకేసి తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియావారిని పాతరేస్తామంటూ బెదిరిస్తుండటం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి-కరకంబాడి రోడ్డులోని రెడ్డిభవనంలో శనివారం ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్మిక చట్టాల సవరణల వల్ల వర్కింగ్ జర్నలిస్టులతో సహా మొత్తం కార్మిక వర్గానికి నష్టం జరుగుతోందన్నారు. పెయిడ్ న్యూస్ పేరుతో మీడియా సంస్థలు అభ్యర్థుల నుంచి నల్లధనాన్ని దండుకుంటున్నాయన్నారు. మీడియా గుత్తాధిపత్యంతో చేటు..:ఎస్ఎన్.సిన్హా ముఖ్య అతిథి, యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్ఎన్.సిన్హా మాట్లాడుతూ మీడియాలో గుత్తాధిపత్యం ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. గుత్తాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడటానికి మీడి యా సిబ్బంది సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీడియా గుత్తాదిపత్యాన్ని అరికట్టేందుకు టెలికాం రెగ్యులెటరీ అథార్టీ చేసిన సూచనలను తాము స్వాగతిస్తున్నామన్నారు. జీఆర్ మజీథియా వేతన సంఘ సిఫార్సుల చెల్లుబాటును భారత సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా సమర్థించినప్పటికీ, వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ జరగకపోవడం బాధాకరమన్నారు. పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల్ని అప్రమత్తం చేయాలి: మంత్రి బొజ్జల మరో ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిజం నిష్పాక్షికంగా ఉండాలని, సమాజంలోని చెడుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల్ని సమాయత్తం చేయాలని ఆకాంక్షించారు. అనవసరపు వార్తలు రాయడం వల్ల అబద్ధపు సమాచారం వ్యాప్తిలోకి వెళ్లిపోతుందన్నారు. దానివల్ల జరిగే అనర్థాలకు అంతుండదన్నారు. రాష్ట్ర విభజన కూడా అలాంటిదేనన్నారు. జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలి:అమర్ అనంతరం మరో ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. మీడియా రంగంలో మార్పులు, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై జాతీయ కార్యవర్గంలో చర్చించి వేతన సవరణపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.