పత్రికా సమావేశాలకు అనుమతించకపోవడం అన్యాయం
ఏపీ సీఎం చంద్రబాబు వైఖరిపై ఐజేయూ సీనియర్ నేత శ్రీనివాస్‌రెడ్డి ధ్వజం
తిరుపతిలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు
తిరుపతి: ఓ పత్రికకు చెందిన ప్రతినిధులను పత్రికా సమావేశాలకు అనుమతించబోమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం ఎంతవరకు సమంజసమని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సీనియర్ నేత కే.శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించా రు. తెలంగాణ ముఖ్యమంత్రి ఒకడుగు ముందుకేసి తమకు వ్యతిరేకంగా ఉన్న మీడియావారిని పాతరేస్తామంటూ బెదిరిస్తుండటం సిగ్గుచేటన్నారు. చిత్తూరు జిల్లా తిరుపతి-కరకంబాడి రోడ్డులోని రెడ్డిభవనంలో శనివారం ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన కార్మిక చట్టాల సవరణల వల్ల వర్కింగ్ జర్నలిస్టులతో సహా మొత్తం కార్మిక వర్గానికి నష్టం జరుగుతోందన్నారు. పెయిడ్ న్యూస్ పేరుతో మీడియా సంస్థలు అభ్యర్థుల నుంచి నల్లధనాన్ని దండుకుంటున్నాయన్నారు.
మీడియా గుత్తాధిపత్యంతో చేటు..:ఎస్‌ఎన్.సిన్హా
ముఖ్య అతిథి, యూనియన్ జాతీయ అధ్యక్షుడు ఎస్‌ఎన్.సిన్హా మాట్లాడుతూ మీడియాలో గుత్తాధిపత్యం ప్రజాస్వామ్యానికి ముప్పని హెచ్చరించారు. గుత్తాధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా పోరాడటానికి మీడి యా సిబ్బంది సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మీడియా గుత్తాదిపత్యాన్ని అరికట్టేందుకు టెలికాం రెగ్యులెటరీ అథార్టీ చేసిన సూచనలను తాము స్వాగతిస్తున్నామన్నారు. జీఆర్ మజీథియా వేతన సంఘ సిఫార్సుల చెల్లుబాటును భారత సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా సమర్థించినప్పటికీ, వర్కింగ్ జర్నలిస్టులకు వేతన సవరణ జరగకపోవడం బాధాకరమన్నారు. పత్రికా యాజమాన్యాలు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజల్ని అప్రమత్తం చేయాలి: మంత్రి బొజ్జల
మరో ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిజం నిష్పాక్షికంగా ఉండాలని, సమాజంలోని చెడుకు వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రజల్ని సమాయత్తం చేయాలని ఆకాంక్షించారు. అనవసరపు వార్తలు రాయడం వల్ల అబద్ధపు సమాచారం వ్యాప్తిలోకి వెళ్లిపోతుందన్నారు. దానివల్ల జరిగే అనర్థాలకు అంతుండదన్నారు. రాష్ట్ర విభజన కూడా అలాంటిదేనన్నారు.
జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలి:అమర్
అనంతరం మరో ముఖ్య అతిథిగా హాజరైన ఐజేయూ కార్యదర్శి దేవులపల్లి అమర్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం దృష్టిసారించాలని కోరారు. మీడియా రంగంలో మార్పులు, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై జాతీయ కార్యవర్గంలో చర్చించి వేతన సవరణపై పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామన్నారు.