'ఆత్మహత్యలు వెలుగు చూడకుండా చేస్తున్నారు'
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో అరవై మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా తొక్కి పెడుతున్నారని మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా తమ జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సమస్యలతో సతమతం అవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటే జిల్లా మంత్రి మాత్రం ఆత్మహత్యలు లేనే లేవని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఆత్మహత్యలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారన్నారు.
అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత వెంకట్రామిరెడ్డి టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు లక్షన్నర రూపాయల ప్యాకేజీని ఇచ్చారని, ప్రస్తుతం అది కూడా అమలు కావడం లేదన్నారు.
టీడీపీ అనుకూల పత్రికల తీరు దారుణం
నిరుపేదలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాటి ప్రచురణకు టీడీపీ అనుకూల పత్రికలు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వారి వ్యక్తిగత సమస్యలే కారణమని ముడిపెడుతూ ఈ పత్రికలు అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఇలా వ్యవహరించడం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భరమైన వ్యవసాయ పరిస్థితులు నెలకొన్నందు వల్ల 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేక పోవడం శోచనీయమన్నారు.
జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామన్నారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా గురించి కూడా చర్చించామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చక పోగా అర్హులైన వృద్ధులు, వికలాంగుల పింఛన్లు సైతం రద్దు చేసి వారి ఉసురు పోసుకుంటున్నారన్నారు.
బాబు వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అవుతాయని, ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా గోడలపై రాసిన రాతలు గోడలకే పరిమితం అయ్యాయని ఆచరణలో శూన్యమై పోయిందని కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై జిల్లాలో ఎంత ప్రజాగ్రహం ఉందో డిసెంబర్ 5వ తేదీన ధర్నా సందర్భంగా పెల్లుబుకుతుందని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.