attar chand basha
-
అత్తార్.. ఇదేమి ‘దారి’ద్ర్యం?
రహదారులకు నోచుకోని కదిరి నియోజకవర్గంలోని గ్రామాలు ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి నేటికీ ఎడ్లబండ్లే! కొన్ని దశాబ్ధాలుగా పాలకుల వంచనకు ఆ గ్రామాలు కుదేలయ్యాయి. సరైన నేత కోసం ఎదురు చూశాయి. ఇలాంటి తరుణంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన అత్తార్ చాంద్‌బాషా... ఆయా గ్రామాల ప్రజలకు ఆశాదీపమయ్యారు. అందుకు తగ్గట్టుగానే గ్రామీణులపై అభివృద్ధి మంత్రం ప్రయోగించారు. తనకంటే ముందు ఉన్న ప్రజాప్రతినిధుల ఏమీ సాధించలేకపోయారని, తనకూ ఓ అవకాశమిస్తే... అన్నింటా అభివృద్ధిలో ముందుంటామన్నారు. ప్రజాబలంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనను ఆదరించిన కన్నతల్లిలాంటి పార్టీ పట్ల విధేయతను విస్మరించి.. పట్టుమని రెండేళ్లు కూడా గడవక ముందే పచ్చకండువా వేసుకున్నారు. ఇదేమని నిలదీసిన ప్రజలకు అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పు రాలేదు. - తనకల్లు (కదిరి) అత్తార్ చాంద్‌బాషా ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో ఆటోలు సైతం వెళ్లలేని గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకు అద్దం పడుతోంది తనకల్లు మండలంలోని గ్రామాలు. ఏడు దశాబ్ధాలుగా మారని రాత గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్న ప్రస్తుత పాలకులు.. ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నది అక్షర సత్యం. ఏడు దశాబ్ధాలుగా తనకల్లు మండలంలోని పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. రోడ్లు, తాగునీరు, వీధి దీపాల్లాంటి కనీస వసతులు కూడా కల్పించలేకపోయారంటే గ్రామాభివృద్ధిపై పాలకులకు ఎంత మాత్రం శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతి పల్లెని హైటెక్ సిటీలా మారుస్తామంటున్న ప్రభుత్వ పెద్దల మాటల నీటి మీద రాతలయ్యాయి. అంతా గతుకుల మయం సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక యుగంలోనూ పల్లె ప్రజలు ఎండ్లబండ్లపైనే ప్రయాణం చేస్తున్నారు. తనకల్లు మండలంలోని బుడ్డయ్యకోట, తులసేనాయక్తండా, నాన్చెరువుపల్లి, బాబేనాయక్తండా, సుబ్బరాయునిపల్లి, రత్నేనాయక్తండా, కమతంపల్లి, అగ్రహారంపల్లి, తమ్మిశెట్టివారిపల్లి తదితర పల్లెలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. గతుకుల మయమైన రోడ్లపై బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. పాలకుల వైఫల్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలు నేటికీ రోడ్డు సౌకర్యానికి నోచుకోలేకపోయాయి. విపత్కర పరిస్థితుల్లో పల్లె ప్రజల అవస్థలు వర్ణానాతీతం. అభివృద్ధికి మూలమైన రహదారులను పటిష్టంగా ఏర్పాటు చేయించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఓట్లప్పుడే గుర్తుకొస్తాం ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులకు మేం గుర్తుకువస్తాం. మా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాతల కాలం నాటి మట్టి రోడ్లపైనే నేటికీ ప్రయాణిస్తున్నాం. అవి కాస్తా ఇప్పుడు గుంతలు పడ్డాయి. మా గ్రామంలోకి ఏ వాహనమూ రాదు. - రమేష్‌నాయక్, పీజీ తండా, తనకల్లు మండలం బస్సు వచ్చింది చూడలేదు మా ఊరికి బస్సు వచ్చి వెళ్లింది ఇప్పటికీ నేను చూడలేదు. నా చిన్నప్పటి నుంచి ఎండ్లబండిలోనే తిరుగుతున్నాం. నేను బతికి ఉండగానే మా ఊరికి బస్సు వచ్చిపోతే చూడాలని ఉంది. - రవీంద్ర, తులసేనాయక్తండా, తనకల్లు మండలం 108 కూడా రాదు మా పంచాయతీ పరిధిలోని ఏ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు కాదు కదా... కనీసం ఆటో కూడా మా ఊళ్లకు రావు. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఎద్దుల బండ్లే దిక్కు. ఏదైనా ప్రమాదం జరిగితే మా తండాల్లోకి 108 వాహనం కూడా రాదు. మా బతుకులెన్నడు బాగుపడతాయో చూడాలి. - ప్రసాద్‌నాయక్, జీఎం తండా, తనకల్లు మండలం -
చంద్రబాబుది దుర్మార్గ పాలన
అనంతపురం : ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనపై అనంతపురం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషాలు మండిపడ్డారు. బుధవారం అనంతపురంలో వారు మాట్లాడారు. చంద్రబాబు పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు. వారం రోజుల ముందే బెలుగుప్ప ధర్నాకు అనుమతి అడిగినా... ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తారా అంటూ టీడీపీ నేతలను విశ్వేశ్వరరెడ్డి నిలదీశారు. చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు హితవు పలికారు. మరో ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ఆర్ ని అభిమానించే వారందరిని చంపుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని చాంద్‌బాషా అభివర్ణించారు. -
'వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై ప్రభుత్వం కక్ష కట్టింది'
అనంతపురం: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై అధికార టీడీపీ ప్రభుత్వం కక్ష కట్టిందని కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా (వైఎస్సార్సీపీ) మండిపడ్డారు. సోమవారం ఆయన అనంతపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి (ఉరవకొండ) తో కలిసి విలేకరులతో మాట్లాడారు. జెడ్పీ సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రొటోకాల్ పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను కలిసిన అధికారులను బదిలీ చేస్తామంటూ టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని చాంద్ బాషా మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షంపై దాడులు చేయటం ఎంతవరకు సమంజసం అని చాంద్‌బాషా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీకి చెందిన మరో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. 'ఏదో ఒక రూపంలో ప్రజలకు సాయం చేస్తే చాలు' అనే కోణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. -
'ఆత్మహత్యలు వెలుగు చూడకుండా చేస్తున్నారు'
హైదరాబాద్: అనంతపురం జిల్లాలో అరవై మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా తొక్కి పెడుతున్నారని మాజీ ఎంపి అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా తమ జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని సమస్యలతో సతమతం అవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూ ఉంటే జిల్లా మంత్రి మాత్రం ఆత్మహత్యలు లేనే లేవని ప్రకటనలు చేస్తున్నారన్నారు. ఆత్మహత్యలు జరుగుతున్నా జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారన్నారు. అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత వెంకట్రామిరెడ్డి టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నపుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు లక్షన్నర రూపాయల ప్యాకేజీని ఇచ్చారని, ప్రస్తుతం అది కూడా అమలు కావడం లేదన్నారు. టీడీపీ అనుకూల పత్రికల తీరు దారుణం నిరుపేదలైన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాటి ప్రచురణకు టీడీపీ అనుకూల పత్రికలు ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ విమర్శించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి వారి వ్యక్తిగత సమస్యలే కారణమని ముడిపెడుతూ ఈ పత్రికలు అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా ఇలా వ్యవహరించడం చాలా దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుర్భరమైన వ్యవసాయ పరిస్థితులు నెలకొన్నందు వల్ల 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా టీడీపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టైనా లేక పోవడం శోచనీయమన్నారు. జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామన్నారు. టీడీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా గురించి కూడా చర్చించామన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో చేసిన హామీలను నెరవేర్చక పోగా అర్హులైన వృద్ధులు, వికలాంగుల పింఛన్లు సైతం రద్దు చేసి వారి ఉసురు పోసుకుంటున్నారన్నారు. బాబు వస్తే రైతుల, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ అవుతాయని, ఇంటికో ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సందర్భంగా గోడలపై రాసిన రాతలు గోడలకే పరిమితం అయ్యాయని ఆచరణలో శూన్యమై పోయిందని కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంపై జిల్లాలో ఎంత ప్రజాగ్రహం ఉందో డిసెంబర్ 5వ తేదీన ధర్నా సందర్భంగా పెల్లుబుకుతుందని ఆయన అన్నారు. మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. -
ఈ హామీలు ఎలా నెరవేరుస్తారు?
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెబుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలకు భారీ స్థాయిలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర రెడ్డి, కదిరి ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషాలు ప్రశ్నించారు. రాజధానిపై శాసనసభలో లోతైన చర్చ జరగలేదని చెప్పారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదపడేలా రాజధాని ఉండాలని వారన్నారు. అనంతపురం జిల్లాకు త్రాగు, సాగు నీటి సరఫరాపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టాలని వారు కోరారు. ** -
ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: అత్తార్ చాంద్‌బాషా
కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా కదిరి : నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కదిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆదివారం 'సాక్షి' కి తెలిపారు. కదిరి మండలం దిగువ చెర్లోపల్లి వద్ద హంద్రీనీవా రిజర్వాయర్ పనులు పూర్తి చేయించి, నియోజకవర్గంలోని అన్ని ప్రధాన చెరువులు, కుంటలను నీటితో నింపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గాండ్లపెంట మండలం గండిచెరువు ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతానన్నారు. కదిరి పట్టణ ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకం నిర్వహణ భారం మునిసిపాలిటీపై పడకుండా ప్రభుత్వమే చూస్తే బాగుంటుందని అసెంబ్లీ దృష్టికి తీసుకెళతానన్నారు. తిమ్మమ్మ మర్రిమానును సందర్శించే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కదిరిలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి అనుబంధంగా ఒక వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. ఎన్పీ కుంట మండలంలో వంద ఎకరాలు వ్యవసాయ పరిశోధనా స్థానానికి కేటాయిస్తే.. ఇక్కడ పరిశోధన చేసి కనుగొన్న నూతన వేరుశనగ రకాలను ఆ భూమిలో సాగుచేస్తే భవిష్యత్‌లో జిల్లా రైతులకు విత్తన వేరుశనగ కొరత తలెత్తకుండా చూడచ్చని పేర్కొన్నారు. సమయం ఉంటే మరి కొన్ని సమస్యలపై కూడా మాట్లాడతానని తెలిపారు.