ప్రధాన సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా: అత్తార్ చాంద్‌బాషా
కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా
కదిరి : నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో కదిరి నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలపై ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా ఆదివారం 'సాక్షి' కి తెలిపారు. కదిరి మండలం దిగువ చెర్లోపల్లి వద్ద హంద్రీనీవా రిజర్వాయర్ పనులు పూర్తి చేయించి, నియోజకవర్గంలోని అన్ని ప్రధాన చెరువులు, కుంటలను నీటితో నింపాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. గాండ్లపెంట మండలం గండిచెరువు ముంపు బాధితులకు పరిహారం మంజూరు చేయాలని కోరుతానన్నారు.
కదిరి పట్టణ ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకం నిర్వహణ భారం మునిసిపాలిటీపై పడకుండా ప్రభుత్వమే చూస్తే బాగుంటుందని అసెంబ్లీ దృష్టికి తీసుకెళతానన్నారు. తిమ్మమ్మ మర్రిమానును సందర్శించే పర్యాటకులకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కదిరిలో వేరుశనగ పరిశోధన కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని, దీనికి అనుబంధంగా ఒక వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు.
ఎన్‌పీ కుంట మండలంలో వంద ఎకరాలు వ్యవసాయ పరిశోధనా స్థానానికి కేటాయిస్తే.. ఇక్కడ పరిశోధన చేసి కనుగొన్న నూతన వేరుశనగ రకాలను ఆ భూమిలో సాగుచేస్తే భవిష్యత్‌లో జిల్లా రైతులకు విత్తన వేరుశనగ కొరత తలెత్తకుండా చూడచ్చని పేర్కొన్నారు. సమయం ఉంటే మరి కొన్ని సమస్యలపై కూడా మాట్లాడతానని తెలిపారు.