అత్తార్.. ఇదేమి ‘దారి’ద్ర్యం?
రహదారులకు నోచుకోని కదిరి నియోజకవర్గంలోని గ్రామాలు
ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి
నేటికీ ఎడ్లబండ్లే!
కొన్ని దశాబ్ధాలుగా పాలకుల వంచనకు ఆ గ్రామాలు కుదేలయ్యాయి. సరైన నేత కోసం ఎదురు చూశాయి. ఇలాంటి తరుణంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన అత్తార్ చాంద్‌బాషా... ఆయా గ్రామాల ప్రజలకు ఆశాదీపమయ్యారు. అందుకు తగ్గట్టుగానే గ్రామీణులపై అభివృద్ధి మంత్రం ప్రయోగించారు. తనకంటే ముందు ఉన్న ప్రజాప్రతినిధుల ఏమీ సాధించలేకపోయారని, తనకూ ఓ అవకాశమిస్తే... అన్నింటా అభివృద్ధిలో ముందుంటామన్నారు. ప్రజాబలంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనను ఆదరించిన కన్నతల్లిలాంటి పార్టీ పట్ల విధేయతను విస్మరించి.. పట్టుమని రెండేళ్లు కూడా గడవక ముందే పచ్చకండువా వేసుకున్నారు. ఇదేమని నిలదీసిన ప్రజలకు అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పు రాలేదు.
- తనకల్లు (కదిరి)
అత్తార్ చాంద్‌బాషా ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో ఆటోలు సైతం వెళ్లలేని గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకు అద్దం పడుతోంది తనకల్లు మండలంలోని గ్రామాలు.
ఏడు దశాబ్ధాలుగా మారని రాత
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్న ప్రస్తుత పాలకులు.. ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నది అక్షర సత్యం. ఏడు దశాబ్ధాలుగా తనకల్లు మండలంలోని పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. రోడ్లు, తాగునీరు, వీధి దీపాల్లాంటి కనీస వసతులు కూడా కల్పించలేకపోయారంటే గ్రామాభివృద్ధిపై పాలకులకు ఎంత మాత్రం శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతి పల్లెని హైటెక్ సిటీలా మారుస్తామంటున్న ప్రభుత్వ పెద్దల మాటల నీటి మీద రాతలయ్యాయి.
అంతా గతుకుల మయం
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక యుగంలోనూ పల్లె ప్రజలు ఎండ్లబండ్లపైనే ప్రయాణం చేస్తున్నారు. తనకల్లు మండలంలోని బుడ్డయ్యకోట, తులసేనాయక్‌తండా, నాన్‌చెరువుపల్లి, బాబేనాయక్‌తండా, సుబ్బరాయునిపల్లి, రత్నేనాయక్‌తండా, కమతంపల్లి, అగ్రహారంపల్లి, తమ్మిశెట్టివారిపల్లి తదితర పల్లెలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. గతుకుల మయమైన రోడ్లపై బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. పాలకుల వైఫల్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలు నేటికీ రోడ్డు సౌకర్యానికి నోచుకోలేకపోయాయి. విపత్కర పరిస్థితుల్లో పల్లె ప్రజల అవస్థలు వర్ణానాతీతం. అభివృద్ధికి మూలమైన రహదారులను పటిష్టంగా ఏర్పాటు చేయించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది.
ఓట్లప్పుడే గుర్తుకొస్తాం
ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులకు మేం గుర్తుకువస్తాం. మా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాతల కాలం నాటి మట్టి రోడ్లపైనే నేటికీ ప్రయాణిస్తున్నాం. అవి కాస్తా ఇప్పుడు గుంతలు పడ్డాయి. మా గ్రామంలోకి ఏ వాహనమూ రాదు.
- రమేష్‌నాయక్, పీజీ తండా, తనకల్లు మండలం
బస్సు వచ్చింది చూడలేదు
మా ఊరికి బస్సు వచ్చి వెళ్లింది ఇప్పటికీ నేను చూడలేదు. నా చిన్నప్పటి నుంచి ఎండ్లబండిలోనే తిరుగుతున్నాం. నేను బతికి ఉండగానే మా ఊరికి బస్సు వచ్చిపోతే చూడాలని ఉంది.
- రవీంద్ర, తులసేనాయక్‌తండా, తనకల్లు మండలం
108 కూడా రాదు
మా పంచాయతీ పరిధిలోని ఏ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు కాదు కదా... కనీసం ఆటో కూడా మా ఊళ్లకు రావు. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఎద్దుల బండ్లే దిక్కు. ఏదైనా ప్రమాదం జరిగితే మా తండాల్లోకి 108 వాహనం కూడా రాదు. మా బతుకులెన్నడు బాగుపడతాయో చూడాలి.
- ప్రసాద్‌నాయక్, జీఎం తండా, తనకల్లు మండలం