kadiri constituency
-
టీడీపీ నేతపై హైకోర్టు సీరియస్..!
సాక్షి, కదిరి: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్మెన్లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ‘కందికుంట తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదు. ఆయనపై మొత్తం 22 కేసులున్నాయి. అందులో నకిలీ డీడీలకు సంబంధించి 2 కేసుల్లో శిక్ష కూడా పడింది. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్మెన్లు ఎలా ఇస్తారు?’ అంటూ హైకోర్టు మండిపడటంతో పాటు గన్మెన్లను తిరిగి నియమించాలని కోరడంలో అర్థం లేదని సీరియస్ అయ్యింది. ఈ తీర్పుతో కందికుంట వర్గం డీలా పడిపోగా, అదే పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఆనందంలో మునిగి పోయింది. దీన్ని చూసి అత్తార్ చాంద్‌బాషాకు కూడా గన్మెన్లను తొలగించాలని కందికుంట వర్గం డిమాండ్ చేస్తోంది. -
రూ.10 వేల కోసం కుక్క కిడ్నాప్
కదిరి: రూ.10 వేల కోసం కుక్కను కిడ్నాప్ చేశాడో వ్యక్తి.. అనంతపురం కదిరి మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా ఆసక్తి కలిగించింది. సోమేష్‌నగర్‌కు చెందిన చంద్రమౌళిరెడ్డి ఓ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు. ఏడాది కిందట ఓ కుక్క పిల్లను తెచ్చి గోడౌన్ వద్ద వదిలిపెట్టాడు. అక్కడ కాపలాగా ఉన్న వెంకటేశ్ భార్య భారతి దాని బాగోగులు చూసేది. గోడౌన్‌లోని గ్యాస్ సిలిండర్లకు ఆ కుక్క కాపలాగా ఉండేది. అయితే సోమవారం ఓ వ్యక్తి బైక్‌పై వేగంగా దూసుకొచ్చి కుక్కను పట్టుకెళ్లాడు. కుక్క కిడ్నాప్‌పై గోడౌన్ యజమాని కదిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాండ్లపెంట మండలానికి చెందిన మల్లి అనే వ్యక్తి కుక్కను తీసుకెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారిస్తే.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి కాపలాకు ఓ కుక్కను తెచ్చిస్తే రూ.10 వేలు ఇస్తానన్నాడని, దీంతో దానిని పట్టుకెళ్లినట్టు మల్లి చెప్పాడు. పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. కుక్కను భారతికి అప్పగించారు. -
ఏ మొహం పెట్టుకొని వచ్చారు..?
సాక్షి, కదిరి: ‘చాంద్‌బాషాకు క్యాడర్ లేదు. ఆయనకు టికెట్ ఇవ్వకండి. కందికుంటకివ్వండని చంద్రబాబునాయుడు దగ్గర చెప్పి ఇప్పుడు ఇద్దరూ ఏ మొహం పెట్టుకొని ఎమ్మెల్యే చాంద్‌బాషా ఇంటికి వచ్చారు? ముస్లింలకు టికెట్లు వద్దుగానీ తెలుగుదేశం పార్టీకి ముస్లింల ఓట్లు కావాలా?’ అని ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఎంపీ నిమ్మలతోపాటు టీడీపీ అభ్యర్థి కందికుంటపై మండిపడ్డారు. ఎంపీతోపాటు కందికుంట బుధవారం చాంద్ ఇంటికెళ్లి ఆయనను బుజ్జగించాలని చూశారు. అయితే వారికి అక్కడ చాంద్ వర్గం నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘ఇంటింటికీ తెలుగుదేశం పేరుతో చాంద్‌బాషా నియోజకవర్గంలో తిరిగినప్పుడు ఎంపీగా మీరు చాంద్‌తోపాటు పర్యటించకుండా ఆయన చేతిలో ఓడిపోయిన కందికుంట వెంట తిరిగిన విషయం అప్పుడే మరిచిపోయారా?.. మీరు మర్చిపోయినా మేం ఎలా మరిచిపోతాం. ఏ మొహం పెట్టుకుని ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వచ్చారు.. మిమ్మల్ని ఈసారి ఇంటికి సాగనంపే వరకూ మేము నిద్రపోము. కదిరి నియోజకవర్గంలో కందికుంట సామాజికవర్గం ఓట్లు 3 వేలకు మించి లేవు. కానీ ముస్లింల ఓట్లు సుమారు 50 వేలున్నాయి. ముస్లింలకు చంద్రబాబు కదిరిలో టికెట్ ఇవ్వనప్పుడు ముస్లింల ఓట్లు టీడీపీకి ఎందుకు వేయాలి?’ అని నిమ్మల కిష్టప్పను చాంద్‌బాషా అనుచరులు ప్రశ్నించడంతో నిమ్మల అవాక్కయ్యారు. చాంద్ అనుచరుఅ ఆగ్రహం చూసి కందికుంట అక్కడి నుంచి మెల్లిగా జారుకున్నాడు. నిమ్మల కిష్టప్ప మాత్రం ఈసారి కందికుంటతోపాటు తనకూ మద్దతు ఇవ్వాలని కోరుతూ అక్కడే కూర్చుండిపోయారు. కదిరి నియోజకర్గంలో మీరు చేసిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం చెప్పండని చాంద్ అనుచరులు ఆయనకు ప్రశ్నల వర్షం కురిపించారు. చాంద్‌బాషా తన అనుచరులను సముదాయించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ‘కబ్జాలు చేసేవారికి, రౌడీయిజం చేసేవారికి, ముస్లింలు, క్రిష్టియన్ల ఆస్తులకు తప్పుడు పత్రాలు పుట్టించి అమ్ముకుంటున్న వారికి టికెట్లు ఇస్తే ప్రజలు ఓట్లేయరు. మేం కూడా వేయము. మీరు ఇక్కడి నుండి మర్యాదగా వెళ్లిపోతే బాగుంటుంది. చాంద్‌బాషాకు టికెట్ రాకపోవడానికి మీరే ప్రధాన కారకులు’ అనడంతో నిమ్మల వెనుదిరగక తప్పలేదు. కార్యకర్తల అభిప్రాయం మేరకే తన నిర్ణయం ఉంటుందని చాంద్‌బాషా నిమ్మలతో చివరిమాటగా చెప్పారు. -
అత్తార్.. ఇదేమి ‘దారి’ద్ర్యం?
రహదారులకు నోచుకోని కదిరి నియోజకవర్గంలోని గ్రామాలు ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి నేటికీ ఎడ్లబండ్లే! కొన్ని దశాబ్ధాలుగా పాలకుల వంచనకు ఆ గ్రామాలు కుదేలయ్యాయి. సరైన నేత కోసం ఎదురు చూశాయి. ఇలాంటి తరుణంలోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగిన అత్తార్ చాంద్‌బాషా... ఆయా గ్రామాల ప్రజలకు ఆశాదీపమయ్యారు. అందుకు తగ్గట్టుగానే గ్రామీణులపై అభివృద్ధి మంత్రం ప్రయోగించారు. తనకంటే ముందు ఉన్న ప్రజాప్రతినిధుల ఏమీ సాధించలేకపోయారని, తనకూ ఓ అవకాశమిస్తే... అన్నింటా అభివృద్ధిలో ముందుంటామన్నారు. ప్రజాబలంతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తనను ఆదరించిన కన్నతల్లిలాంటి పార్టీ పట్ల విధేయతను విస్మరించి.. పట్టుమని రెండేళ్లు కూడా గడవక ముందే పచ్చకండువా వేసుకున్నారు. ఇదేమని నిలదీసిన ప్రజలకు అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. రోజులు గడుస్తున్నా.. పరిస్థితిలో మార్పు రాలేదు. - తనకల్లు (కదిరి) అత్తార్ చాంద్‌బాషా ప్రాతినిథ్యం వహిస్తున్న కదిరి నియోజకవర్గంలోని చాలా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేకపోయాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో ఆటోలు సైతం వెళ్లలేని గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇందుకు అద్దం పడుతోంది తనకల్లు మండలంలోని గ్రామాలు. ఏడు దశాబ్ధాలుగా మారని రాత గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని పేర్కొంటున్న ప్రస్తుత పాలకులు.. ఆ దిశగా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదన్నది అక్షర సత్యం. ఏడు దశాబ్ధాలుగా తనకల్లు మండలంలోని పలు గ్రామాలు అభివృద్ధికి నోచుకోకపోవడం ఇందుకు నిదర్శనం. రోడ్లు, తాగునీరు, వీధి దీపాల్లాంటి కనీస వసతులు కూడా కల్పించలేకపోయారంటే గ్రామాభివృద్ధిపై పాలకులకు ఎంత మాత్రం శ్రద్ధ ఉందో ఇట్టే అర్థమవుతోంది. ప్రతి పల్లెని హైటెక్ సిటీలా మారుస్తామంటున్న ప్రభుత్వ పెద్దల మాటల నీటి మీద రాతలయ్యాయి. అంతా గతుకుల మయం సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న నేటి ఆధునిక యుగంలోనూ పల్లె ప్రజలు ఎండ్లబండ్లపైనే ప్రయాణం చేస్తున్నారు. తనకల్లు మండలంలోని బుడ్డయ్యకోట, తులసేనాయక్తండా, నాన్చెరువుపల్లి, బాబేనాయక్తండా, సుబ్బరాయునిపల్లి, రత్నేనాయక్తండా, కమతంపల్లి, అగ్రహారంపల్లి, తమ్మిశెట్టివారిపల్లి తదితర పల్లెలకు ఇప్పటికీ సరైన రోడ్లు లేవు. గతుకుల మయమైన రోడ్లపై బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు వెళ్లలేకపోతున్నాయి. పాలకుల వైఫల్యం కారణంగా గ్రామీణ ప్రాంతాలు నేటికీ రోడ్డు సౌకర్యానికి నోచుకోలేకపోయాయి. విపత్కర పరిస్థితుల్లో పల్లె ప్రజల అవస్థలు వర్ణానాతీతం. అభివృద్ధికి మూలమైన రహదారులను పటిష్టంగా ఏర్పాటు చేయించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఓట్లప్పుడే గుర్తుకొస్తాం ఎన్నికలప్పుడు మాత్రమే నాయకులకు మేం గుర్తుకువస్తాం. మా గ్రామాలకు సరైన రోడ్లు లేవు. తాతల కాలం నాటి మట్టి రోడ్లపైనే నేటికీ ప్రయాణిస్తున్నాం. అవి కాస్తా ఇప్పుడు గుంతలు పడ్డాయి. మా గ్రామంలోకి ఏ వాహనమూ రాదు. - రమేష్‌నాయక్, పీజీ తండా, తనకల్లు మండలం బస్సు వచ్చింది చూడలేదు మా ఊరికి బస్సు వచ్చి వెళ్లింది ఇప్పటికీ నేను చూడలేదు. నా చిన్నప్పటి నుంచి ఎండ్లబండిలోనే తిరుగుతున్నాం. నేను బతికి ఉండగానే మా ఊరికి బస్సు వచ్చిపోతే చూడాలని ఉంది. - రవీంద్ర, తులసేనాయక్తండా, తనకల్లు మండలం 108 కూడా రాదు మా పంచాయతీ పరిధిలోని ఏ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. బస్సులు కాదు కదా... కనీసం ఆటో కూడా మా ఊళ్లకు రావు. మేం ఎక్కడికి వెళ్లాలన్నా ఎద్దుల బండ్లే దిక్కు. ఏదైనా ప్రమాదం జరిగితే మా తండాల్లోకి 108 వాహనం కూడా రాదు. మా బతుకులెన్నడు బాగుపడతాయో చూడాలి. - ప్రసాద్‌నాయక్, జీఎం తండా, తనకల్లు మండలం