సాక్షి, కదిరి: తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌లు అక్కర లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు శనివారం కోర్టు తన తీర్పును వెలువరించింది. తాను 2009లో టీడీపీ తరఫున కదిరి ఎమ్మెల్యేగా ఉన్నానని, తనకున్న 2 ప్లస్ 2 గన్‌మెన్‌లను ఇటీవల ప్రభుత్వం తొలగించిందని, తిరిగి గన్‌మెన్లను నియమించాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు ‘కందికుంట తాజా మాజీ ఎమ్మెల్యే కూడా కాదు.
ఆయనపై మొత్తం 22 కేసులున్నాయి. అందులో నకిలీ డీడీలకు సంబంధించి 2 కేసుల్లో శిక్ష కూడా పడింది. ఇంతటి నేర చరిత్ర ఉన్న వ్యక్తికి గన్‌మెన్‌లు ఎలా ఇస్తారు?’ అంటూ హైకోర్టు మండిపడటంతో పాటు గన్‌మెన్‌లను తిరిగి నియమించాలని కోరడంలో అర్థం లేదని సీరియస్ అయ్యింది. ఈ తీర్పుతో కందికుంట వర్గం డీలా పడిపోగా, అదే పార్టీకి చెందిన తాజా మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా వర్గం ఆనందంలో మునిగి పోయింది. దీన్ని చూసి అత్తార్ చాంద్‌బాషాకు కూడా గన్‌మెన్‌లను తొలగించాలని కందికుంట వర్గం డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment