నేడు బాలల మెగా వైద్యశిబిరం | Medical camp for children | Sakshi
Sakshi News home page

నేడు బాలల మెగా వైద్యశిబిరం

Published Thu, Nov 14 2013 4:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM

Medical camp for children

ఒంగోలు, న్యూస్‌లైన్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో బాలల దినోత్సవమైన గురువారం బాలల మెగా వైద్యశిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ వైద్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ శివభరత్‌రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్యశిబిరాన్ని వైఎస్సార్ సీఎల్‌పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభిస్తారు. పిల్లల కోసం ప్రత్యేకంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. శిబిరంలో వైద్యసేవలందించేందుకు 70 మంది వైద్యులు వస్తున్నారు.
 
 ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు వీరిలో ఉన్నారు. స్థానిక పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలోని కేంద్రీయ విద్యాలయంలో వైద్యశిబిరం నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శిబిరం ఉంటుంది. దంతవైద్య సేవలు అందించేందుకు నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీ నుంచి, గుంటూరు సీవీఆర్ దంత వైద్యశాల నుంచి రెండు ప్రత్యేక అంబులెన్స్‌లు కూడా వస్తున్నాయి. కీళ్లు, దంత పరీక్షలతో పాటు, కళ్ల పరీక్ష, చర్మవ్యాధులు, సుగర్, సహజంగా పిల్లల్లో వచ్చే వ్యాధులకు చికిత్స అందించేందుకు పలు విభాగాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవసరమైన వారికి కళ్లద్దాలు ఇస్తారు. ఉచిత వైద్య శిబిరంతో పాటు రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. చెవి పరీక్షల కోసం అపోలో ఆస్పత్రి నుంచి వైద్యుల బృందం వస్తోంది. వారు వినికిడి శక్తిని పరీక్షించి అవసరమైన వైద్య పరికరాలు పంపిణీ చేస్తారు.
 
 ఒకవేళ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అవసరమని గుర్తిస్తే దాన్ని హైదరాబాదులో ఉచితంగా చేసేందుకు కూడా చర్యలు తీసుకుంటామని డాక్టర్ శివభరత్‌రెడ్డి తెలిపారు. వైఎస్సార్ సీపీ వైద్య విభాగం జిల్లా కన్వీనర్ డాక్టర్ యాదాల అశోక్ మాట్లాడుతూ గురువారం నిర్వహించే వైద్యశిబిరంలో డాక్టర్ శివభరత్‌రెడ్డి (సన్‌షైన్ వైద్యశాల కీళ్ల విభాగం వైద్యుడు), డాక్టర్ సుధాకర్‌రెడ్డి (అపోలో ఆస్పత్రి)తోపాటు ఒంగోలులోని ప్రముఖ వైద్యులు కూడా పాల్గొంటారని, ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఇప్పటి వరకు 150 పాఠశాలలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా సమాచారం అందించామన్నారు. బాలలు ఎక్కువగా ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement