నెల్లూరు(బారకాసు), న్యూస్‌లైన్ : నెల్లూరు నగరంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఈ ఏడాది ప్రారంభించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ) అనుమతి లభించడం అనుమానంగా ఉంది. జిల్లా అభివృద్ధి పనుల్లో ఒకటి కానున్న ప్రభుత్వ వైద్యకళాశాల ఏర్పాటును తమ కృషిగా చెప్పుకుని ఆనం సోదరులు ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని భావించారు. ఈ ఏడాదే ఈ కళాశాలను ప్రారంభించాలని అనుకున్నారు.
ప్రారంభంలో నత్తనడకగా సాగిన పనులు ఇటీవల వేగాన్ని పుంజుకున్నాయి. ఎంత శరవేగంగా నిర్మాణ పనులు సాగినా అనుకున్న సమయానికి పూర్తిస్థాయిలో పూర్తికాలేదు. వైద్య కళాశాలను ప్రారంభించాలంటే ఎంసీఐ నిబంధనల మేరకు పూర్తిస్థాయిలో అన్ని వసతులను కలిగి ఉండాలి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ వైద్యకళాశాల పనులు 70 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ముందుగా అనుకున్న మేరకు ఆగస్టులో మొదటి సంవత్సర వైద్య విద్య కోర్సు తరగతులు ప్రారంభించేందుకు తగిన మౌలిక వసతులు ఇంకా సమకూరలేదు. ఈ నెలాఖరుకు వైద్యకళాశాల పరిశీలనకు ఎంసీఐ బృందం రానుంది.
ఈ బృందం కళాశాలను పరిశీలించి సంతృప్తి చెందితేనే ప్రారంభానికి అనుమతి ఇస్తుంది. ఇప్పటి వరకు వైద్య కళాశాల నిర్మాణం ఆసంపూర్తిగానే ఉంది. అన్ని విధాల మౌలిక సదుపాయాలతో పూర్తి చేయాలంటే మరికొంత కాలం పట్టే అవకాశం ఉంది. ఎంసీఐ బృందం పరిశీలనకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ సంతృప్తి చెందే అవకాశం లేదు. అయితే ఆగస్టులో వైద్యకళాశాలను ప్రారంభించేందుకు మరో రెండు నెలలు అదనంగా వ్యవధి కావాలని ఎంసీఐ బృందాన్ని వైద్య విద్యసంచాలకులు (డీఎంఈ) కోరనున్నట్లు తెలిసింది. కళాశాల ఏర్పాటుకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో 300 పడకల సామర్థ్యం కలిగి ఉండాలి.
కాని ప్రస్తుతం ఉన్న పెద్దాసుపత్రిలో 200 పడకలు మాత్రమే ఉన్నాయి. పెద్దాసుపత్రి పరిధిలో ఉన్న రేబాలా, జూబ్లీ ఆసుపత్రుల పడకలను ఎంసీఐకి చూపించి అనుమతి పొందాలని డీఎంఈ ఆలోచనలో ఉంది. కానీ ఎంసీఐ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోదని సీనియర్ వైద్యాధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ జిలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలలో కొన్ని వసతులు లేవు. అప్పట్లో డీఎంఈ సకాలంలో పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని ఎంసీఐతో నమ్మబలికింది. దీంతో ఎంసీఐ ఆ వైద్యకళాశాలకు అనుమతిచ్చింది. కొద్దికాలం తరువాత ఎంసీఐ తాము చేసిన తప్పు తెలుసుకుని నిజామాబాద్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలకు రెండో సంవత్సర వైద్యవిద్య కోర్సును ప్రారంభించేందుకు అనుమతి నిరాకరించింది. ఈ అనుభవాల నేపథ్యంలో ఎంసీఐ అసంపూర్తిగా ఉన్న వైద్యకళాశాల ప్రారంభానికి అనుమతి ఇచ్చే పరిస్థితి లేదన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో వైద్యవిద్య మొదటి సంవత్సర కోర్సు చేయాలనుకునే విద్యార్థుల ఆశలు ఆడియాశలే కానున్నాయి.
వైద్య కళాశాలకు ఎంసీఐ అనుమతి అనుమానమే!
Published Sun, Mar 9 2014 3:17 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement