
మెడిసిన్ యాజమాన్య కోటాలో.. ప్రత్యేక పరీక్షకే మొగ్గు
మెడిసిన్ యాజమాన్య కోటా భర్తీపై కళాశాలల నిర్ణయం
కర్ణాటక తరహాలో నిర్వహిస్తామని సర్కారుకు వినతి
యాజమాన్య కోటా భర్తీకి గతంలో ఎంసెట్ ర్యాంకు,ఇంటర్ మార్కులు, ప్రవేశ పరీక్ష ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు భారీ గిరాకీ ఏర్పడిన నేపథ్యంలో సీట్ల భర్తీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడిసిన్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కర్ణాటక తరహాలోనే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామని ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాయి. దీనికి ఇప్పటివరకూ ప్రభుత్వం ఆమోదం తెలుపనప్పటికీ యాజమాన్యాల ఒత్తిడి నేపథ్యంలో యాజమాన్యకోటాకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుస్తోంది.
ఇంటర్ మార్కుల మెరిట్, ఎంసెట్ ర్యాంకు, ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా యాజమాన్య కోటాను భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వం గతంలో ఆప్షన్లు ఇచ్చింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం ప్రైవేటు కళాశాలలు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి, ఈ ఆప్షన్లలో దేన్నయినా ఎంచుకోవచ్చునని సూచించింది.
భారతీయ వైద్యమండలి సైతం ప్రైవేటు కాలేజీలు ఎంచుకునే ఆప్షన్ ఏదైనా సరే, ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసి, ఆయా వివరాలను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి పంపించాలని కోరింది.
ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రత్యేక ప్రవేశ పరీక్షకే మొగ్గు చూపుతుండటంతోపాటు ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తెచ్చాయి. కర్ణాటక, మహరాష్ర్టలో సైతం ఇలా చేస్తున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి.
బహుశా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే అవకాశాలున్నట్టు ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. అయితే ఈ విధానం అమల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయని, దీనికంటే ఇంటర్ మార్కులు లేదా, ఎంసెట్ ర్యాంకింగ్‌ల ద్వారా భర్తీ జరిగితే బావుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
యాజమాన్యకోటా సీట్లు పెరిగే అవకాశం
ప్రస్తుతం ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,650 సీట్లున్నాయి. ఇందులో 40 శాతం సీట్లు అంటే 1,460 సీట్లు యాజమాన్య కోటా సీట్లు వస్తాయి. ఈ ఏడాది మరో ఐదారు కొత్త కళాశాలలకు అనుమతి వచ్చే అవకాశముంది. దీనివల్ల మరో 150 నుంచి 200 సీట్లు పెరిగే అవకాశ ముంది.
40 శాతం యాజమాన్య కోటా సీట్లలోనే 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా (ఎన్‌ఆర్‌ఐ) కింద భర్తీ చేసుకుంటారు. అంటే మొత్తం సీట్లలో 25 శాతం మాత్రమే యాజమాన్యకోటా కింద భర్తీ చేసుకోవాల్సి ఉంది.
గత ఏడాది యాజమాన్య సీట్ల భర్తీలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు నచ్చిన అభ్యర్థులకు ఒక్కో సీటును రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ యాజమాన్యాలు అమ్ముకున్నాయి. దీనిపై హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. భారతీయ వైద్యమండలి కూడా దీనిపై స్పందిస్తూ ఇకపై మెరిట్ వివరాలు ఆన్‌లైన్‌లో పెట్టాలని సూచించింది.