ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రత్యేక ప్రవేశ పరీక్ష మే నెల 24న జరగనుంది. ఇందుకోసం నాలుగున నోటిఫికేషన్ జారీ చేయొచ్చని తెలిసింది.
హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రత్యేక ప్రవేశ పరీక్ష మే నెల 24న జరగనుంది. ఇందుకోసం నాలుగున నోటిఫికేషన్ జారీ చేయొచ్చని తెలిసింది. కన్వీనర్ కోటా 50 శాతం సీట్లు మినహా మిగతా 50 శాతంలో 35 శాతం సీట్లనుప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా (ఎంసెట్‌ఏసీ-మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్) ప్రైవేటు కళాశాలల్లో భర్తీ చేస్తారు. ప్రవాస భారతీయ (ఎన్‌ఆర్‌ఐ) కోటా కింద మిగతా 15 శాతం సీట్లను ఆయా కళాశాలలే భర్తీ చేస్తాయి. ఎంసెట్‌ఏసీ ద్వారా యాజమాన్యకోటా సీట్లకు ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ జరగడం ఈ ఏడాదే తొలిసారిగా మొదలైంది. ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) ద్వారా ప్రభుత్వ కళాశాలల్లోని ఎంబీబీఎస్ సీట్లు, ప్రైవేటు కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.
తొలిసారిగా ఆన్‌లైన్‌లో...
ప్రైవేటు వైద్య కళాశాలల్లోని 35 శాతం సీట్లకు తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ పరీక్ష ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ పూర్తయ్యాకే కౌన్సెలింగ్ ఉంటుంది. యాజమాన్య కోటా సీట్లకు సైతం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే కౌన్సెలింగ్ జరుగుతుంది. యాజమాన్య కోటా సీట్లకు దరఖాస్తు ఫీజు కింద రూ.1800 వరకూ చెల్లించాలి. ఈ సీట్లకు ఏడాది ఫీజును రూ.11 లక్షలుగా ఇటీవల నిర్ణయించిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు వైద్య కళాశాలల యాజమాన్య సీట్లకు ప్రవేశ పరీక్ష జరుగుతున్నప్పటికీ ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సెంటర్లు కేటాయిస్తున్నారు. ఇక దేశవ్యాప్తంగా చెన్నై, కోయంబత్తూర్, త్రివేండ్రం, ఢిల్లీ, కోల్‌కతా, భువనేశ్వర్‌లలోనూ కేంద్రాలు ఉంటాయి.