
నేటితో ముగియనున్న ఆర్మీ ర్యాలీ
ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మంగళవారంతో ముగియనుంది.
కొత్తగూడెం: ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో నిర్వహిస్తున్న తెలంగాణ స్థాయి ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ మంగళవారంతో ముగియనుంది. సోమవారంతో అన్ని విభాగాల అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. ఎంపికైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు 15 వరకు జరగనున్నాయి. ఆర్మీ ర్యాలీలో భాగంగా సోమవారం హవల్‌దార్ విద్య/మత ఉపాధ్యాయుడు (జూనియర్ కమిషన్ అధికారి) విభాగాలకు అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించారు. ఆయా విభాగాల అభ్యర్థులకు మంగళవారం శారీరక ధారుడ్య పరీక్షలు నిర్వహించనున్నారు.
సోల్జర్ ట్రేడ్స్‌మెన్ అభ్యర్థులకు సోమవారం శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించారు.308 మంది అభ్యర్థులు వైద్య పరీక్షలకు ఎంపికయ్యారు. అన్ని విభాగాల్లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి కావడంతో ఆర్మీ ర్యాలీకి పది జిల్లాల నుంచి తరలి వచ్చిన అభ్యర్థులు వెనుదిరుగుతున్నారు. 11వ తేదీన సోల్జర్ ట్రేడ్స్‌మెన్ విభాగంలో ఎంపికైన అభ్యర్థులకు ట్రేడ్స్‌మెన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించనున్నారు. అన్ని విభాగాల అభ్యర్థులకు ఈనెల 15వ తేదీ వరకు వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి రాత పరీక్షకు ఎంపిక చేయనున్నారు.