
మెడిసిన్ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: మెడిసిన్ విద్యార్థిని మంగళవారం రాత్రి కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం గుంటూరులోని కాటూరి మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న కృష్ణవేణి (25) రాత్రి 11.30 గంటల ప్రాంతంలో తాడేపల్లి సమీపంలో కృష్ణానదిలో దూకింది. చూసిన స్థానిక మత్య్సకారులు వెంటనే నదిలో దూకి విద్యార్థినిని రక్షించారు. కొన ఊపిరితో ఉన్న కృష్ణవేణిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. 108 వాహనంలో కృష్ణవేణిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తరలించడం ఆలస్యం అయిన కారణంగా మృతి చెందినట్లు భావిస్తున్నారు.
కృష్ణవేణి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ నోట్ రాసి ఇంట్లో పెట్టినట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆత్మహత్య చేసుకుంటానని కృష్ణవేణి ఇంట్లోవారిని బెదిరిస్తోందని సమాచారం. ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ వ్యవహారం ఏమైనా కారణమై ఉంటుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణవేణి అమ్మ,నాన్న ఇద్దరూ డాక్టర్లే. బాబాయి డాక్టరే. ఆ కుటుంబానికి సంబంధించి మొత్తం 13 మంది డాక్టర్లు ఉన్నారు. కృష్ణవేణి తండ్రి గుంటూరులో డాక్టరు కాగా, తల్లి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో సూపరింటెండెంట్గా పని చేస్తున్నారు.