మీ సేవలో.. మాఫియా! | meeseva | Sakshi
Sakshi News home page

మీ సేవలో.. మాఫియా!

Published Fri, Dec 5 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

meeseva

సాక్షి, కర్నూలు : ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనేం.. ఇసుక మాఫియా ఎప్పటికప్పుడు సరికొత్త అక్రమ మార్గాలను అన్వేషిస్తోంది. దర్జాగా ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటోంది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులను బుట్టలో వేసుకోవడం.. బోగస్ పత్రాలను తయారు చేసి వనరులను కొల్లగొట్టడం చేసిన మాఫియా ఈసారి ఏకంగా సర్కారుకే టోకరా వేసేలా వ్యూహాలు రూపొందించింది. మీ సేవా కేంద్రాల్లో ఇతర నిర్మాణాల పేరిట భారీ మొత్తంలో ఇసుక సరఫరాకు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించి అక్రమంగా హైదరాబాద్‌తోపాటు, కర్నూలు జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక తరలిస్తోంది. ఇందుకు మైనింగ్, రెవెన్యూ అధికారులు లోపాయికారీగా సహకారం అందిస్తుంటే వ్యాపారులేమో లారీ ఇసుకను రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
 
 స్వయం సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక రీచ్‌లకు అనధికారిక ఇసుక మాఫియా గ్రహణంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికారిక రీచ్‌ల వద్ద క్యూబిక్ మీటరుకు రూ. 500 మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఒక ట్రాక్టరు ద్వారా 3 క్యూబిక్ మీటర్లు తరలించేందుకు రూ. 1,500తోపాటు రవాణా ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంది. అయితే అధికారులు చెబుతున్నట్లుగా ఆయా ఇసుక రీచ్‌ల్లో ఇసుక నిల్వలు లేకపోవడంతో.. ఆన్‌లైన్ ద్వారా డబ్బులు చెల్లించిన సామాన్యులు ఇసుక కోసం చక్కర్లు కొడుతున్నారు. నిడ్జూరు రీచ్‌లో ఉన్న ఇసుక నిల్వలను గత రెండు రోజులుగా బడాబాబులకు టిప్పర్లలో సరఫరా చేశారని స్థానికులు పేర్కొంటున్నారు. ఇదే విషయాన్ని పరిశీలించేందుకు ‘సాక్షి బృందం’ ట్రాక్టర్ ఇసుక కావాలంటూ గురువారం నిడ్జూరు రీచ్‌కు వెళ్లింది.
 
 అక్కడ ట్రాక్టర్ ఇసుక కూడా కనిపించలేదు. మేము ఆన్‌లైన్‌లో 3 క్యూబిక్ మీటర్ల ఇసుకకు రూ. 1,500 చెల్లించామని, ఇసుక సరఫరా చేసేదెవరని అక్కడ కాపలాగా ఉన్న వాచ్‌మెన్‌ను ప్రశ్నించిగా..  ఈ రోజు ఇసుక సరఫరాను బంద్ చేసినట్లు అతను చెప్పారు. స్థానికంగా నది నుంచి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలించే కొందరు ట్రాక్టర్ల డ్రైవర్లు మాట్లాడుతూ.. ‘మాకు 15 రోజులుగా ఇసుక తరలింపు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదు. మా బ్యాంకు అకౌంట్లను కూడా తీసుకున్నారు. అయినా ఇంత వరకు సొమ్ములు చెల్లించలేదు’ అని వాపోయారు. మరీ మీరు ఇప్పటి వరకు ఇక్కడకు తరలించిన ఇసుక ఏదీ అని ప్రశ్నించగా..  ఆ ఇసుకను రెండ్రోజులుగా టిప్పర్లలో తరలించారని సమాధానం చెప్పారు. మరి మాకు ఇసుక ఎలా దొరికేదీ అంటే.. మీ సేవలో కట్టిన రసీదు మాకు ఇవ్వు.. రేపటిలోగా మీ అడ్రస్సుకు ఇసుకను దించుతామని ఓ ట్రాక్టర్ డ్రైవర్ ధీమాగా చెప్పడం కనిపించింది.
 
 ఇతరుల పేరుతో అనుమతులు!
 జిల్లాలో నంద్యాల, కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణాల్లోని నిర్మాణాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చి ఇసుక కొరతను తీర్చడానికి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన వారికి ఇసుక సరఫరాకు అనుమతులు ఇస్తోంది. ప్రభుత్వం నిర్ణయించిన నూతన ధరల ప్రకారం క్యూబిక్ మీటర్‌కు రూ. 500 తీసుకుని రీచ్‌లలో ఇసుక ఇవ్వాల్సి ఉంది. అయితే అధికారులు ఎడ్యుకేషన్ సొసైటీలు, ఇతర నిర్మాణ సంస్థల పేరిట మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసి ఆ రసీదులను ఇసుక మాఫియా సభ్యులకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా సేకరించిన రాయల్టీలతో ఇసుక మాఫియా ఒకే రాయల్టీపై పోలీసుల నిఘా లేని సమయంలో రెండుసార్లు ఇసుక తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న అక్రమార్కులు ఎప్పటికప్పుడు కొత్తదారులు వెతుక్కుంటూ అక్రమాలు కొనసాగిస్తూ కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు.
 
 6 క్యూబిక్ మీటర్ల ఇసుక ధర రూ. 15 వేలు
 ఇసుక ధరల నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే ఇసుక వ్యాపారులు అందినకాడికి దండుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఇతర నిర్మాణ కార్యకలాపాల కోసమంటూ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మాఫియా మూడు రెట్లు అధికంగా విక్రయిస్తోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆరు చక్రాల లారీకి 6 క్యూబిక్ మీటర్ల(2.5 టన్నులు) ఇసుకను మాత్రమే తరలించాలి. దీనికి రూ. 3,000 కొనుగోలుదారులు చెల్లించాలి. ఇదే జరిగితే నంద్యాల, ఆళ్లగడ్డ, వంటి పట్టణాలకు చేరే లారీ కిరాయి మరో రూ. 2,500 వేలు అదనంగా ఖర్చవుతుంది.
 
  అంటే ఒక లారీ ఇసుకకు కర్నూలు సమీప పట్టణాల్లో అత్యధికంగా రూ. 5,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం లారీకి రూ. 12 వేల నుంచి రూ. 15 వేల వరకు అమ్ముతున్నారు. జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌లను అధికారికంగా గుర్తించగా ఇందులో కేవలం ఒక్క రీచ్‌లో మాత్రం ప్రస్తుతం విక్రయాలు జరుగుతున్నాయి. అక్కడా ఇసుక నిల్వలు అంతంత మాత్రంగా ఉండడంతో ఇసుక వ్యాపారులు ధర పెంచి మరీ సొమ్ము చేసుకుంటుండడంతో వినియోగదారుడిపై తీవ్ర భారం పడుతోంది. అయితే బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి, మహిళా సంఘాల ద్వారా నిబంధనల మేరకు క్వారీయింగ్ చేయిస్తామని, సామాన్యులతోపాటు నిర్మాణాదారులకు అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ఇస్తున్న భరోసా.. ఆచరణలో అమలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement