పల్లెలపై పగ! | Villages revenge! | Sakshi
Sakshi News home page

పల్లెలపై పగ!

Published Fri, Feb 20 2015 3:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Villages revenge!

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో నివసిస్తున్న ప్రజలపై భారీగా పన్నుల భారం పడనుంది. పంచాయతీలను అభివృద్ధి చేస్తామనే మిషతో ప్రజల జేబులను కొల్లగొట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. పంచాయతీల ఖజానాను నింపేందుకు మొత్తం 48 రకాల పన్నులను వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటి పన్నుతో పాటు ఖాళీ స్థలాలు, పోరంబోకు భూములపైనా పన్ను వేయనుంది. వాహనాలు, వీధి దీపాలకు కూడా శిస్తు చెల్లించాల్సిందే. ఈ మేరకు ఇప్పటికే పంచాయతీరాజ్‌శాఖ అన్ని జిల్లాల అధికారులకు మార్గదర్శకాలను జారీచేసింది. ప్రస్తుతం ఏయే పన్నులు వసూలు చేస్తున్నారు? ఇంకా ఏయే పన్నులు వసూలు చేయవచ్చో.. వివరాలను ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేకంగా పంచాయతీరాజ్‌శాఖ వెబ్‌సైట్లో ప్రతీ పంచాయతీకి ఒక యూజర్ నేమ్, పాసువర్డు ద్వారా వివరాలు పంపాలని స్పష్టం చేసింది.
 
 ప్రజల పన్నులతో అభివృద్ధి పనులు!
 వాస్తవానికి పంచాయతీల ఆర్థిక వనరులన్నీ రాష్ర్ట ప్రభుత్వమే గుంజేసుకుంది. రాష్ట్ర ఖజానాను నింపుకునేందుకు అనేక రకాల పన్నులను తన జాబితాలోనే చేర్చుకుంది. దీంతో పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టం కాలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో కేవలం ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఆర్థిక సంఘం నిధులతోనే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది.
 
 ఈ పరిస్థితులల్లోనే.. గోరుచుట్టుపై రోకటిపోటులాగా విద్యుత్ బిల్లులను కూడా పంచాయతీలే చెల్లించాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 13వ ఆర్థిక సంఘం నిధులను వెచ్చించాలని ఆదేశాలు జారీచేసింది. ఫలితంగా ఆర్థిక సంఘం నిధుల్లో 70 నుంచి 80 శాతం మేరకు కేవలం విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించేందుకు సరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ప్రజల జేబులు కొల్లగొట్టడం ద్వారా నిధులను సమకూర్చుకునేందుకు 48 రకాల పన్నుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వమే సిద్ధం చేసింది.
 
 కరెంటు పంచాయతీతో మొదలు!
 పంచాయతీల కరెంటు బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు అమలు కూడా చేశారు. అయితే, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వంతో పాటు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం కూడా పంచాయతీల కరెంటు బిల్లులను ఆయా పంచాయతీలే చెల్లించాలని ఆదేశాలు జారీచేశాయి. 13వ ఆర్థిక సంఘం నిధులను ఇందుకు వెచ్చించాలని కూడా చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో పంచాయతీలు ఆర్థికంగా కుంగిపోయాయి. అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు కరెంటు బిల్లులు కట్టకపోతే వీధి లైట్లకు విద్యుత్ సరఫరా కట్ చేస్తామని విద్యుత్‌శాఖ తేల్చిచెప్పింది.
 
 జిల్లాలో వందలాది గ్రామాలకు కరెంటు సరఫరాను కూడా నిలిపివేసింది. దీనిపై ఇప్పటికే సర్పంచులు ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీల ఖజానా నింపేందుకు ప్రభుత్వం సరికొత్త మార్గాన్ని అన్వేషించింది. ఇందులో భాగంగా పన్ను వసూలుకు మొత్తం 48 అంశాలను గుర్తించింది. ఈ పన్నులను వసూలు చేసుకోవడంతో ఖజానా నింపుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని పేర్కొంది. అంటే ప్రజల జేబు కొట్టి అభివృద్ధి చేసుకోవాలని తేల్చిచెప్పిందన్నమాట. ఈ నేపథ్యంలోనే జిల్లాలోని అన్ని పంచాయతీలు సర్వే పనులు మొదలు పెట్టాయి. ఇప్పటివరకు ఏయే రకాల పన్నులు వసూలు చేస్తున్నాము? ఇంకా ఎన్ని వసూలు చేయాల్సి ఉంది? అనే అంశాలను పట్టికల రూపంలో తయారుచేసే పనిలో పంచాయతీ సిబ్బంది నిమగ్నమయ్యారు.
 
 కర్నూలు మండలంతో షురూ...!
 ఈ పన్ను పోటు వ్యవహారం జిల్లాలో కర్నూలు మండలంతో మొదలయింది. వాస్తవానికి కర్నూలు మండలంలో ప్రస్తుతం ఇంటి పన్ను, నీటి సరఫరాకు యూజర్ చార్జీలు, ప్రైవేటు కుళాయి కనెక్షన్ ఫీజు, లే అవుట్ అనుమతి ఫీజు, బిల్డింగ్ ప్లాన్ అనుమతి, సెల్ టవర్ల నుంచి లెసైన్సు ఫీజు వంటి పన్నులను మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇక నుంచి వీధి దీపాల పన్నుతో పాటు వాహన పన్ను, ఖాళీ స్థలం లేదా భూమి ఉంటే పన్నును కూడా ప్రజలు చెల్లించాల్సి రానుంది. కర్నూలు మండలంతో మొదలైన ఈ వ్యవహారం నెలాఖరు నాటికి జిల్లా మొత్తానికి విస్తరించనుంది. మొత్తం మీద ఈ 48 రకాల పన్నులు వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని పంచాయతీరాజ్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.
 
 ఉపాధి పనులపైనా పన్ను..!
 పంచాయతీల ఖజానాను నింపేందుకు ఏకంగా కూలీ పనుల మీద కూడా ప్రభుత్వం కన్ను వేసింది. పంచాయతీలల్లో అమలయ్యే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పనులపైనా పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. అయితే, ఇది ఎంత మొత్తం అనే విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు. అంతేకాదు.. పోరంబోకు భూములతో పాటు చివరకు మరుగునీరు (డ్రైనేజీ వ్యవస్థ) నిర్వహణకు కూడా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇక మీద గ్రామాల్లో షాపులు పెట్టుకునే వారే కాకుండా వీధుల్లో ఏర్పాటు చేసుకునే తోపుడు బండ్ల నిర్వాహకులు కూడా పన్ను చెల్లించాల్సి రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement