
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ కంపెనీలో గ్యాస్ లీకయిన వెంటనే రాష్ట్ర యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
► ప్రభావిత గ్రామాల్లోని ప్రజలను త్వరితగతిన ఖాళీ చేయించడం ద్వారా మరణాల సంఖ్య తగ్గించగలిగాం.
► జిల్లా కలెక్టర్, పరిశ్రమలశాఖ అధికారులతో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు విశాఖలోని పరిశ్రమలశాఖ జీఎం కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం.
► ఇందుకోసం ఎస్ ప్రసాదరావు, ఆర్.బ్రహ్మ అనే అధికారులను నియమించాం. సహాయం కోసం వీరిని 7997952301, 8919239341, 9701197069 అనే నంబర్లలో సంప్రదించవచ్చు.
► సహాయక పనులను పర్యవేక్షించడానికి పరిశ్రమలశాఖ తరఫున ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశాం.
► ఈ దుర్ఘటనకు కంపెనీ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. విచారణ అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటాం.
బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం
ఢిల్లీలోని దక్షిణ కొరియా దౌత్యవేత్త షిన్‌బాంగ్
ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్ ఘటనపై దక్షిణ కొరియా స్పందించింది. విశాఖ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఢిల్లీలో ఉన్న కొరియన్ దౌత్యవేత్త షిన్‌బాంగ్ కిల్ అన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ లీకేజీతో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
దర్యాప్తుకు సహకరిస్తాం
ఎల్‌జీ పాలిమర్స్ జీఎం శ్రీనివాస్ రామ్
ఎల్‌జీ పాలిమర్స్‌లో జరిగిన ఘటనపై ఆ సంస్థ జీఎం శ్రీనివాస్ రామ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులందరికీ అవసరమైన వైద్య సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత గ్రామాల ప్రజలు, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య భద్రత తమ బాధ్యతని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం చేసే దర్యాప్తుకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు సాంకేతిక బృందాల్ని సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత పటిష్ట చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment