
రాజీనామా లేఖ సమర్పించిన వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి
చెప్పిన మాటకు కట్టుబడి.. తన ఎంపీ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహనరెడ్డి రాజీనామా చేశారు. రాష్ట్ర విభజన పై కాంగ్రెస్ నిరంకుశ వైఖరికి నిరసనగా తాను, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లోక్‌సభ సభ్యత్వాలకు చేసిన రాజీనామాలను ఆమోదించాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే కోరిన విషయం తెలిసిందే.
మంగళవారం ఉదయం లోక్సభ స్పీకర్ మీరాకుమార్తో భేటీ అయ్యేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరారు. అయితే, మీరాకుమార్ అందుబాటులో లేరు. అయినా మేకపాటి వెనుదిరగలేదు. నేరుగా స్పీకర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శికి తన రాజీనామా లేఖను ఆయన అందజేశారు. వాస్తవానికి సోమవారం సాయంత్రమే అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తామని స్పీకర్ కార్యాలయం మేకపాటికి సమాచారం అందించినా, మీరాకుమార్ బిజీ షెడ్యూల్ కారణంగా అది వీలుపడలేదు. మంగళవారం కూడా ఆమె షెడ్యూల్ ఖాళీ లేదు. ఆమె ఢిల్లీలో లేరు. అయినా రాజీనామాకు కట్టుబడి ఉన్నమేకపాటి, తన లేఖను ఆమె ముఖ్యకార్యదర్శికి అందజేసి.. ఆమోదించాల్సిందిగా కోరారు.