
సోనియా ముందు వాజమ్మల్లా తలాడిస్తున్నారు
కేంద్ర మంత్రులు, సీఎంపై మేకపాటి ధ్వజం
ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు
చంద్రబాబు కోరినట్టుగానే రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర కేంద్ర మంత్రులు, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజల మనోభావాలు ఏమాత్రం పట్టించుకోకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ముందు వాజమ్మల్లా తలాడిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ఇన్నాళ్లూ కల్లబొల్లి కబుర్లు చెప్పిన కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రిల నైజం తేటతెల్లమైపోరుుందన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కోరినట్లుగానే కేంద్ర మంత్రులు ప్యాకేజీలు, సమన్యాయం, యూటీ అంటూ విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆకాంక్ష మేరకు అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి ‘సమైక్య తీర్మానం’ చేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కాంగ్రెస్, టీడీ పీ కుమ్మక్కై పట్టనట్లు వ్యవహరించాయని మండి పడ్డారు. ముందే అసెంబ్లీ తీర్మానం చేసి పంపితే యావత్ దేశం ఈ వ్యవహారంపై దృష్టి సారించేందుకు అవకాశం చిక్కుతుందని, అప్పుడు కేంద్రం రాష్ట్ర విభజన సాహసం చేయజాలదంటూ తామెంత చెప్పినా ఆ రెండు పార్టీలు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలిపారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి పెనుముప్పు కలిగించేలా ఉందని మేకపాటి ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా తమకు ఇష్టమొచ్చినట్లు చేస్తామనడం సమంజసం కాదన్నారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితే దాని జోలికి వెళ్లకుండా, ఎలాంటి తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తామనడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. కేవలం ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజిస్తామంటే చరిత్రహీనులుగా మిలిగిపోతారని కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి పదే పదే లేఖలు రాసిన చంద్రబాబుకు, ప్రజల ఆకాంక్ష మేరకు సమైక్యంగా ఉంచమంటూ ఒక్కలేఖ రాయడానికి చేతులు రావడం లేదా? అని ప్రశ్నించారు.
అన్ని పార్టీలు మద్దతు పలికారు
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను కేంద్రం దుర్వినియోగం చేస్తున్న తీరును.. జగన్ నేతృత్వంలో వెళ్లిన తమ పార్టీ ప్రతినిధి బృందం అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలకు కూలంకషంగా వివరించగలిగిందని మేకపాటి తెలిపారు. కేంద్రం అసెంబ్లీ అభిప్రాయం తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైనాన్ని వివరించిన ప్పుడు అన్ని పార్టీలూ ఏకీభవించాయని చెప్పారు. ఏరాష్ట్రాన్నైనా విభజించాలనుకుంటే అందుకు ఆ రాష్ట్ర అసెంబ్లీ 2/3 మెజార్టీ ఆమోదాన్ని తప్పనిసరి చేయాలన్న తమ డిమాండ్‌ను కూడా పార్టీలు అంగీకరించినట్లు తెలిపారు. ఈ విషయమై జగన్ లేవనెత్తిన అంశాలన్నింటికీ బీజేపీ, సీపీఎం, సీపీఐ, తృణమూల్, జేడీయూ, బీజేడీ, ఎన్సీపీ, శివసేనలాంటి పార్టీలు మద్దతు పలికాయన్నారు. త్వరలో లక్నోలో సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) నేతలను, చెన్నయ్‌లో ఏఐఏడీఎంకే, డీఎంకే అధినేతలను కలిసి మద్దతు కూడగట్టనున్నట్లు మేకపాటి తెలిపారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను విలేకరులు ప్రస్తావించగా... అది దుర్మార్గమని, అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం నెగ్గించుకోవడం కోసం కుటిల యత్నాలకు పాల్పడుతున్నారని అన్నారు.