
రాజకీయ లబ్ధి కోసమే విభజన
కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై జాతీయ పార్టీలు ఇదే భావన వ్యక్తం చేశాయి
వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు మేకపాటి, ఉమ్మారెడ్డి, మైసూరా వెల్లడి
ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడ్డాయి
ఎవరినీ సంప్రదించకుండా కేంద్రం నిరంకుశంగా వ్యవహరించిందన్నాయి
నిజాలు దాచి దిగ్విజయ్, షిండేలు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు
వైఎస్సార్‌సీపీ అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోమంది
విభజన చేయాలని ఎన్నడూ చెప్పలేదు
సమస్యకు పరిష్కారం చూపకుండా రాష్ట్రపతి పాలనతో ఫలితం ఏంటని ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెనుక రాజకీయ లబ్ధి స్పష్టంగా కనిపిస్తోందని జాతీయ పార్టీలన్నీ అభిప్రాయపడుతున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎంవీ మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేతృత్వంలోని బృందం పలు జాతీయ పార్టీలను కలిసినప్పుడు, మెజార్టీ పార్టీలు.. రాష్ట్రంపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టాయన్నారు. రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా, కొన్ని ఓట్లు, సీట్లు లక్ష్యంగా కాంగ్రెస్ విభజన నిర్ణయం చేసిందని పార్టీలు అభిప్రాయపడినట్లు వెల్లడించారు. ‘‘ఢిల్లీలో బీజేపీ, సీపీఐ, సీపీఎం, డీఎంకే పార్టీలను కలిశాం. ఈ సందర్భంగా పార్టీలు విభజన జరుగుతున్న విధానాన్ని తప్పుబట్టాయి. కొన్ని పార్టీలు తాము సమైక్యానికే మద్దతు ఇస్తున్నామని తెలిపాయి. ఢిల్లీలో మా మిషన్ పూర్తయింది. మా పర్యటన సంతృప్తినిచ్చింది’’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీతో పాటు, కేంద్రంలోని ప్రభుత్వం మెజార్టీ ప్రజలు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెసుకోకుండా, ఎవరినీ సంప్రదించకుండా అత్యంత నిరంకుశంగా నిర్ణయం చేసిందని పార్టీలు అభిప్రాయపడ్డాయని చెప్పారు. ప్రస్తుత సీమాంధ్రలోని పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వమే కారణమనే భావనను వెలిబుచ్చాయని వివరించారు. కాంగ్రెస్ తన నిర్ణయంతో సొంత పార్టీలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలనే సంతృప్తి పరచలేని దయనీయ స్థితిలో ఉందని తెలిపారు.
మంత్రుల కమిటీ సభ్యులంతా కోర్ కమిటీ నేతలే..
ఇక విభజన నిర్ణయం అమలులో భాగంగా ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను చూపేందుకు ఏర్పాటైన మంత్రుల కమిటీలో ఉన్నవారంతా కోర్‌కమిటీ సభ్యులేనని నేతలు విమర్శించారు. ఇప్పటికే కాంగ్రెస్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి మద్దతు తెలిపిన కోర్ కమిటీ సభ్యులే మంత్రుల బృందంలో ఉండటం దురదృష్టకరమన్నారు. విభజనకు మద్దతు తెలిపిన సభ్యులు రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా విశ్వసనీయత కల్పిస్తారని ప్రశ్నించారు. మంత్రుల కమిటీ న్యాయం చేస్తుందన్న నమ్మకం ఎవరికీ లేదన్నారు. ఇక ఇదే సమయంలో రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖరరెడ్డి అంగీకరించారని, వైఎస్సార్ కాంగ్రెస్ సైత ం అనుకూలమని చెప్పిందంటూ ఇటీవల కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై నేతలు మండిపడ్డారు. విభజనపై రెండో ఎస్సార్సీనే తమ విధానమని వైఎస్ పలుమార్లు స్పష్టం చేశారన్నారు. ఇక తమ పార్టీ.. అందరికీ ఆమోదయోగ్యంగా తండ్రిలా నిర్ణయం చేయమందే తప్ప విభజన చేయాలని ఎన్నడూ చెప్పలేదన్నారు. ధైర్యం ఉంటే తెలంగాణకు ఎక్కడైనా అనుకూలమని చెప్పినట్లు చూపాలని వారు డిమాండ్ చేశారు. నిజాలను దాచి షిండే, దిగ్విజయ్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
సీఎం హైమాండ్ ఆదేశాలను అమలు చేస్తున్నారు..
రాష్ట్రంలో పాలన స్తంభించిన నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశాలున్నాయా? అని ఈ సందర్భంగా విలేకరులు అడగ్గా ‘ రాష్ట్రంలో ప్రభుత్వమే లేదు. పరిపాలన స్తంభించింది. కేబినెట్ నిలువునా చీలిపోయిందనేది వాస్తవం. అక్కడ రాష్ట్రపతి పాలన పై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి. అయితే రాష్ట్రపతి పాలన వచ్చినా ప్రస్తుత సమస్యకు దొరికే పరిష్కారం ఏమిటి? ప్రజల ఆందోళనలు పట్టించుకోకుండా రాష్ట్రపతి పాలనతో ఫలితం ఏమిటి?’ అని వారు ప్రశ్నించారు. ఇక ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయాన్ని ధిక్కరించడంలేదని, ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో భాగమైన ముఖ్యమంత్రి హైకమాండ్‌కు వ్యతిరేకంగా పోవడం సాధ్యం కాదన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు దీక్షను నేతలు తప్పుపట్టారు. విభజనకు అనుకూలమా? లేక సానుకూలమా? చెప్పకుండా బాబు దీక్ష చేయడం ప్రజలను ఆయోమయానికి గురిచేయడమేనన్నారు. ఇప్పటికే ఆయన విభజనకు అనుకూలంగా లేఖలు ఇచ్చారని, కొత్త రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. ఇక కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కాపాడిందీ, కేంద్రంలో ఎఫ్‌డీఐ బిల్లు సందర్భంగా కేంద్రానికి సహకారం అందించిందీ చంద్రబాబేనన్నారు. తమకు కాంగ్రెస్, టీడీపీలు రెండూ శత్రువులేనని చెప్పారు.