టీ బిల్లు చర్చలపై కేంద్రానికి పంపిన నివేదిక ఇవ్వండి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 బిల్లుపై జరిగిన చర్చల సారాంశంపై కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదిక ప్రతిని తనకు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు మేకతోటి సుచరిత విజ్ఞప్తి చేశారు. ఆమె మంగళవారం ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద రాష్ట్ర శాసనసభా కార్యాలయం పౌరసమాచార అధికారి(పీఐఓ)కి దరఖాస్తు చేశారు.
చట్టంలోని నిబంధనల ప్రకారం, వీలైనంత త్వరగా 30 రోజులు దాటకుండా ఈ సమాచారం ఇప్పించాలని ఆమె తన దరఖాస్తులో కోరారు. బిల్లుపై జరిగిన చర్చలో తమ ప్రసంగాల ద్వారా ఎంత మంది సభ్యులు అభిప్రాయాలను వ్యక్తం చేశారు? లిఖిత పూర్వకంగా ఎంత మంది అభిప్రాయాలను వ్యక్తం చేశారు? వారి పేర్లు, అభిప్రాయాల వివరాలను ఇప్పించాలని కోరారు.
బిల్లుపై జరిగిన చర్చలో రాష్ట్ర విభజనకు మొత్తం ఎంత మంది సభ్యులు అనుకూలంగా ఉన్నారు? ఎంత మంది వ్యతిరేకంగా ఉన్నారు? ఎంత మంది తటస్థంగా ఉన్నారు? ఈ వివరాలన్నీ సభ్యుల పేర్లు, పార్టీలపరంగా ఇప్పించాలని కోరారు. జనవరి 30న సభ ఆమోదించిన తీర్మానాల ప్రతులను కూడా ఇప్పించాలని సుచరిత విజ్ఞప్తి చేశారు.