
సాక్షి, విశాఖపట్నం : మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్ నొక్కితే చాలు.. పోలీసులకు చేరే విధంగా త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. శత్రువు ఎక్కడో లేడు.. మన పక్కనే సెల్‌ఫోన్ రూపంలో ఉన్నాడన్న విషయాన్ని గుర్తించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, చిన్నారుల రక్షణకై ప్రభుత్వం... పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా మిత్రలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ మంత్రి తానేటి వనితతో కలిసి విశాఖపట్నంలో మహిళా మిత్ర సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ..టెక్నాలజీ అభివృద్ధితో పాటు సమస్యలు ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్ ద్వారా మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం మొత్తం నేరస్తులకు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా నేరస్తుల బెదిరింపులు... బ్లాక్‌మెయిల్‌కు దారితీసి, చివరకు మహిళల ఆత్మహత్యలకు కారణమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే మహిళల భద్రత కోసం సైబర్ మిత్రను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మహిళా భద్రతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవులను మహిళలకు కేటాయించి ప్రాధాన్యమిచ్చారని సుచరిత గుర్తు చేశారు.
వారి కోసమే సైబర్ మిత్ర, మహిళా మిత్ర
అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్ధినులు సైబర్ స్పేస్‌లో సమస్యలు ఎదురుకొంటున్నారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. తమకు తెలియకుండానే నేరస్తుల నుంచి మెసేజ్‌లు, బెదిరింపులు ఎదుర్కోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోవాలో తెలియక తమలో తామే కుమిలిపోతూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను అమల్లోకి తీసుకువచ్చిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment