శ్రీకాకుళం సిటీ: సమాజంలో ప్రేమ, పెళ్లి, ఇతర వ్యవహారాల పేరుతో కొందరు మహిళలు మోసపోతున్నార ని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ (హైద రాబాద్) పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.సునీతాకృష్ణన్ అన్నారు. మహిళల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలంటే మగవాళ్ల ఆలోచన విధానాల్లో మార్పు ఒక్కటే మార్గమని సూచించారు. రిమ్స్ ఆడిటోరియంలో గురువారం ‘మానవ అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమ ప్రజాచైతన్య రథం’ పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ప్రారంభించిన రెండు దశాబ్దాల కాలంలో సుమారు 16 వేల మంది మహిళలు, చిన్నారులను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించినట్టు చెప్పారు.
అందులో 10, 8, 6, 3 ఏళ్ల బాలికలు, చిన్నారులు కూడా ఉండడం ఆవేదన కలిగిస్తున్న విషయమని తెలిపారు. ప్రతి మహిళ తనను తాను ఎలా రక్షించుకోవాలో, సంఘటితంగా ఎలా ఉండాలో తెలిపేందుకే సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎలా ఉండాలనే దానిపై కలలు కనడం తప్పుకాదని, ఆ క లలకు హద్దులు లేకపోతేనే ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘ఏ అమ్మాయి అమ్ముడుపోకూడదు... ఏ అబ్బాయి అమ్మాయిలను అమ్మకూడదు’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నట్టు తెలిపారు. అబ్బాయిల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా దృష్టిసారించాల్సిందిగా సూచించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంతో ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈ యాత్రలను పూర్తి చేసినట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో 30 జిల్లాల్లో కూడా మహిళలను చైతన్యవంతం చేస్తామన్నారు. మరో 2, 3 ఏళ్లలో దేశం మొత్తం తమ ప్రజ్వల సంస్థ తరఫున అన్ని రాష్ట్రాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలపై నిత్యం జరుగుతున్న దాడులు, వారు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.
పెళ్లిపేరుతో, ఉపాధి పేరుతో ఎవరైనా జిల్లా నుంచి ఎక్కడికైనా వెల్లవలసి వస్తే సమాచారం తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాన చెప్పారు. వారు ఎక్కడికి వెళుతున్నది, ఏ పనిమీద వెళుతున్నది వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరారు. దీనివల్ల దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఇతర దేశాలకు ఎక్కడికి వెళ్లినా వారి సమాచారాన్ని తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. దీని కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని చెప్పారు. జిల్లాలో 2011 నుంచి ఈనెల వరకు మహిళల అపహరణ, ఇంటి నుంచి వెళ్లిపోరుున కేసులు 257 వరకు నమోదు కాగా, వాటిలో 243 కేసుల్లో మహిళలను, యువతను సురక్షితంగా పోలీస్‌శాఖ ఇంటికి చేర్పించిందన్నారు.
మిగితా 14 కే సుల్లో పురోగతిపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్పీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ వాకడం పరిమితిని, సోషల్ మీడియా వల్ల అనర్థాలను వైద్యవిద్యార్థులకు వివరించారు. సమావేశంలో రిమ్స్ డెరైక్టర్ బీఎల్‌ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌నాయక్, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి వీరాస్వామి, ఐసీడీఎస్ పీడీ చక్రధరావు, డీఆర్‌డీఏ పీడీ తనూజారాణి, స్వీప్ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ కె.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా 20 నిమిషాల నిడివిగల ఆనామిక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. కుటుంబాన్ని దూరం చేసుకొని సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అట్టి పరిస్థితుల్లో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ తోడుగా నిలబడిన సందర్భాలను సంస్థలో పనిచేసిన వారు తెలియజేశారు.
మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి
Published Fri, Mar 18 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement