sunita krishnan
-
నీలినీడలో ఆడపిల్ల
‘ఐయామ్ వాట్ ఐయామ్’... సునీతకృష్ణన్ రాసుకున్న జీవన జ్ఞాపకాల గుచ్ఛం. ఆడపిల్లల అక్రమ రవాణా, లైంగికదాడి బాధితుల పునర్జీవనం పై పోరాడుతున్న సామాజిక కార్యకర్తగా సునీతా కృష్ణన్ ఈ పుస్తకంలో సాంకేతికత ముసుగులో సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితులను నమోదు చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలు...‘‘సైబర్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్’ మీద నేను జాతీయస్థాయి సర్వే చేస్తూ ఆధారాల కోసం ఒక యాప్ ద్వారా ‘పిల్లల అశ్లీల వీడియో’ల కోసం ప్రయత్నించాను. అందుకోసం 532 రూపాయలు చెల్లించాను. మూడు రోజుల్లో తొమ్మిదివేల వీడియోలు వచ్చాయి. ఆరు నెలల పసిబిడ్డ నుంచి ఎనిమిదేళ్ల అమ్మాయి వరకు ఉన్న వీడియోలు కళ్లు మూసుకోవాల్సినంత ఘోరంగా ఉన్నాయి. ఇది ఏ డార్క్ వెబ్లోనో కాదు, పబ్లిక్ డొమైన్‌లోనే. ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌కి డబ్బు పంపించాం, వీడియో రావడం ఆలస్యమైంది. ఫోన్ చేసి అడిగితే వచ్చిన సమాధానమేంటో తెలుసా... ‘నేను ట్యూషన్లో ఉన్నాను. తర్వాత పంపిస్తాన’ అని. అంటే ఆ కుర్రాడి వయసు ప్లస్‌టూ దాటలేదని అర్థమవుతోంది. సమాజం ఇలా ఉంది’మగపిల్లలకూ రక్షణ లేదు ‘ఒకప్పుడు మానవ అక్రమ రవాణా అంటే చదువులేక పేదరికంతో కష్టాలు పడుతున్న వారికి మాయమాటలు చెప్పి మోసం చేసేవారు. ఇప్పుడు ఆ ఆర్థిక రేఖ కూడా చెరిగిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా బాధితులవుతున్నారు. ఒకప్పుడు ఈ నేరాలు ఎవరు చేశారనేది దర్యాప్తులో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు నేరస్థులు సాంకేతికత మాటున దాక్కుంటున్నారు. మగపిల్లలు కూడా ట్రాఫికింగ్‌కి గురవుతున్నారిప్పుడు. ఈ ఘోరాలన్నింటికీ సోషల్‌మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. వీటన్నింటినీ నియంత్రించాలంటే ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలి, వాటిని కచ్చితంగా అమలు చేయాలి. మాలాంటి సోషల్ నేను నా పుస్తకం ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’లో ఉదహరించిన అనేక అంశాలు, వాటి నుంచి నేను నేర్చుకున్న ΄ాఠాలు కూడా ఈ సమస్యల మీద ముందుకెళ్లడానికి ఉపకరిస్తాయనే అనుకుంటున్నాను’ ఎందుకు రాశానంటే... ‘మా నాన్నకు తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక ఉందని తెలిసి పిల్లలుగా మేము సహకరించాం. ఆయన తుదిశ్వాస వదలడానికి రెండు నెలల ముందు పుస్తకం ఆవిష్కరించాం. బంధువులు, స్నేహితులకు ఆ ప్రతులను పంచినప్పుడు ఒక్కొక్కరూ ‘ఆయన సమాజం కోసం ఇంత సర్వీస్ ఇచ్చారని మాకిప్పటి వరకూ తెలియద’ంటూ నాన్నగారి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఆ మాటలు వినడానికి నాన్న లేరు. అప్పుడు నాకు ఒక మనిషి గురించి పదిమందికి ఆ మనిషి బతికుండగానే తెలియాలి. అలాగే ఆ పదిమంది ఏమనుకున్నారనేది అది మంచి అయినా చెడు అయినా సరే... ఆ మనిషి బతికుండగానే తెలుసుకోవాలి అనిపించింది. అది తొలి కారణం. రెండో కారణం బాలీవుడ్ బయోపిక్. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు నా బయోపిక్ తీస్తామని అనుమతి కోరారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యూ ట్యూబ్‌లో నా గురించి ఎవరికి తోచిన కథ వారు పెట్టారు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వడం కంటే నా స్టోరీ నా వెర్షన్ నేనే చె΄్పాలి అనుకున్నాను. నా పుస్తకంలో నేనేంటో ఉంది. ఒక గదిలో కూర్చుని రోజుకు 14 గంటల చొప్పున 13 రోజుల్లో పూర్తి చేసి జూన్ 17వ తేదీన విడుదల చేశాను. ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ ఆన్లైన్లో అందుబాటులో ఉంది’ అని వివరించారు సునీతాకృష్ణన్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : అనిల్ కుమార్ మోర్లబలహీనత తెలియడమే బలం మన బలహీనతలను గుర్తించగలగడమే మన శక్తి. నా బలహీనత ఏమిటో గుర్తించగలిగాను కాబట్టే శక్తిమంతమయ్యాను. మన ఇచ్ఛాశక్తిలో శుద్ధి ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు సహాయంగా వస్తాయి. ప్రజ్వల నిర్వహణ కోసం ఫండ్‌రైజింగ్ గురించి ్ర΄ోగ్రామ్ చేయడానికి ఎన్డీటీవీ, సాక్షి టీవీలు అవకాశం ఇచ్చాయి. లైవ్ పూర్తయ్యేలోపు ఒక చిన్న ΄ాప తన కిడ్డీ బ్యాంక్‌ని పగలకొట్టి ఏడువేల రూ΄ాయలిచ్చింది. ఇలాంటి ఎంతోమంది సహకారం అందించారు. ఇప్పటి వరకు బాధితులైన మహిళల రక్షణ కోసమే పని చేశాను. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న సామాజిక విధ్వంసం చూస్తుంటే ప్రమాదం బారిన పడుతున్న మహిళల గురించి పని చేయాలనుకుంటున్నాను.– సునీతా కృష్ణన్, ఫౌండర్, ప్రజ్వల ఫౌండేషన్ -
మహిళల భద్రతకు పూర్తి భరోసా
సాక్షి, అమరావతి: మహిళలు, బాలల భద్రతకు భరోసానిస్తూ ‘దిశ’ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికి ఆదర్శంగా నిలిచారని ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత సునీతా కృష్ణన్ ప్రశంసించారు. మాటల మనిషిని కాదు, చేతల మనిషినని ముఖ్యమంత్రి నిరూపించుకున్నారని కొనియాడారు. మహిళలపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా సునీతా కృష్ణన్ ఉద్యమిస్తున్నారు. లైంగిక దాడుల బాధితులకు ఆశ్రయం కల్పించేందుకు ‘ప్రజ్వల’ అనే స్వచ్ఛంద సంస్థను నిర్వహిస్తున్నారు. మహిళల భద్రత కోసం చేస్తున్న కృషికి గాను భారత ప్రభుత్వం సునీతా కృష్ణన్‌కు 2016లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. రాష్ట్ర శాసన సభ శుక్రవారం ‘దిశ’ బిల్లును ఆమోదించిన సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. దిశ చట్టం మహిళల భద్రతకు పూర్తి భరోసా ఇవ్వనుందని చెప్పారు. ప్రశ్న: ఏపీ ప్రభుత్వం ‘దిశ’ బిల్లును ఆమోదించడాన్ని ఎలా చూస్తారు? సునీతా కృష్ణన్: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికి ఓ మంచి సందేశాన్ని ఇచ్చారు. హైదరాబాద్‌లో ‘దిశ’ ఘటన జరిగినప్పుడు చాలామంది మాటలు చెప్పారు. కానీ, జగన్ మాత్రం తాను మాటల మనిషినని కాదు, చేతల మనిషినని నిరూపించారు. తల్లిదండ్రులకు ధైర్యం కలిగించారు. నేరస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోకుండా కచి్చతంగా శిక్షలు పడేలా పటిష్టమైన చట్టాన్ని తీసుకొస్తున్న ముఖ్యమంత్రిని అందరం అభినందించాల్సిందే. ప్రశ్న: మహిళల భద్రతకు ఈ బిల్లు ఎలాంటి భరోసా ఇస్తుందని భావిస్తున్నారు? సునీతా కృష్ణన్: మహిళలు, బాలలపై దాడులు, వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించే చట్టం చేసేలా ‘దిశ’ బిల్లును రూపొందించారు. ఇందులో మూడు ప్రధానాంశాలు మహిళలు, బాలల భద్రతకు భరోసానిస్తున్నాయి. ► మొదటి అంశం.. నేరస్తుల రిజిస్టర్ నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పింది. వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చే దిశగా ఓ గొప్ప ముందడుగు ఇది. నేరస్తుల పేర్లతో ఓ రిజిస్టర్ నిర్వహిస్తారు. దాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. దీంతో నేరస్తుల్లో భయం పుడుతుంది. ►రెండో అంశం.. నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడం గొప్ప నిర్ణయం. దీంతో నిర్ణీత గడువులోగా 100 శాతం న్యాయం జరుగుతుందని బాధితులకు నమ్మకం కలుగుతుంది. ప్రత్యేక కోర్టులు, జడ్జీలు, ఇతర మౌలిక సదుపాయాలతో ఓ వ్యవస్థను నెలకొల్పనుండటం అంటే మాటలు కాదు. నేరాలను అరికట్టాలంటే ఎంత పెద్ద శిక్ష విధిస్తామన్నదే కాదు, ఎంత త్వరగా శిక్షిస్తామన్నది కూడా చాలా ముఖ్యం. ►మూడో అంశం.. మహిళలు, బాలలపై నేరాల విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి చర్చలకు గానీ, సంప్రదింపులకు గానీ అవకాశం ఇవ్వదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేరస్తులను తమ ప్రభుత్వం రక్షించదని తేలి్చచెప్పారు. నేరాలు జరిగితే సత్వరం విచారణ పూర్తి చేయాల్సిందే... దోషులకు శిక్షలు పడాల్సిందేనని నిబద్ధత చాటారు. ఇది చాలా మంచి విషయం. ప్రశ్న: దిశ బిల్లు చట్టంగా మారిన తరువాత వ్యవస్థలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయని భావిస్తున్నారు? సునీతా కృష్ణన్: దిశ బిల్లు చట్టంగా మారిన తరువాత మన క్రిమినల్ జ్యుడిషియరీ విధానంలో పెను మార్పులకు నాంది పలుకుతుంది. ప్రధానంగా మహిళలపై దాడులను అరికట్టడంలో కీలకమైన పోలీసు, న్యాయ వ్యవస్థలకు రాజకీయ వ్యవస్థ స్పష్టమైన సందేశాన్ని ఇచి్చంది. నేరస్తులను కఠినంగా శిక్షించి, నేరాలను కట్టడి చేయడానికి ఆ రెండు వ్యవస్థలకు మార్గం సుగమం చేసినట్టు అయ్యింది. -
గొర్రెపిల్లల్ని కాస్తున్న పల్లె పడుచుగా!
గట్టి పిల్ల: రశ్మికా మందన్నా ‘ఇన్నర్వ్యూ’ ని తెలుసుకోవడం తేలికైన విషయమేమీ కాదు. చక్కటి ఆ చిరునవ్వుతోనే ‘చెప్పితీరాల్సిన’ సిట్యుయేషన్ని అలవోకగా దాటవేస్తారు రశ్మిక. అలాగని మొహమాట పడే అమ్మాయి కూడా కాదు. ‘‘మీకూ, విజయ్ దేవరకొండకు’ సమ్‌థింగ్ సమ్‌థింగ్ అట కదా’’ అని ‘డియర్ కామ్రేడ్’ చిత్రం విడుదల సందర్భంగా రశ్మిక హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె తనదైన చిరునవ్వుతో.. ‘‘అంత సీన్ లేదు’’ అని అనడం మీకు గుర్తుండే ఉంటుంది. ఏ పాత్రలోనైనా కుదురుగా ఇమిడిపోగల రశ్మిక ఏ ప్రశ్నకైనా తడబడకుండా సమాధానం చెబుతారు. అందుకని ఆమెని ఇరుకున పెట్టడం అనే వృథా ప్రయాస మాని, ఆమె నటిస్తున్న సినిమాల్లో చిన్న చిన్న షాట్స్‌ని పాప్పరాజ్జీలు (వెంటాడే ఫొటో జర్నలిస్టులు) గుట్టు చప్పుడు కాకుండా నొక్కేస్తూ ఉంటారు. అలా నొక్కి వేయబడిన ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో రశ్మిక గొర్రెపిల్లల్ని కాస్తున్న పల్లె పడుచుగా కనిపిస్తున్నారు! దాంతో ఈ అతిలోక సుందరి.. అతి సాధారణమైన ఈ సీన్‌ని ఏ సినిమా కోసం చేసి ఉంటారా అన్న డిబేట్ కూడా అప్పుడే నెట్లో మొదలైపోయింది. ప్రస్తుతం రశ్మిక.. పేరింకా ఖరారు కాని ఒక తెలుగు సినిమాలో నటిస్తున్నారు. గొర్రెల కాపరిగా ఆమె ఆ సినిమాలో కనిపించబోతున్నారా? లేక, ‘సుల్తాన్’ అనే తమిళ సినిమాకు ఆమె సంతకం చేశారు.. అందులో ఇలా నటించబోతున్నారా.. తేల్లేదు. ఏమైనా ఈ అందాల రాశి గొర్రెల కాపరిగా నటించడం తమకు అన్యాయం చేయడమేనని అని ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు. ఈ విషయాన్ని రశ్మిక సన్నిహితులైన వారు ఆమెతో అంటే.. ఎప్పటిలా చిరునవ్వు నవ్వుతూ.. ‘‘క్యారెక్టర్లో కనిపించే అందం.. క్యారెక్టర్ వేస్తున్న నటిలో కనిపించే అందం కన్నా గొప్పది’’ అన్నారు తప్ప.. ఆ సీన్ తెలుగుదా, తమిళ్దా చెప్పలేదు. గట్టి పిల్లే. ఇంత గుట్టా?! -
మగవాళ్ల ఆలోచనల్లో మార్పు రావాలి
శ్రీకాకుళం సిటీ: సమాజంలో ప్రేమ, పెళ్లి, ఇతర వ్యవహారాల పేరుతో కొందరు మహిళలు మోసపోతున్నార ని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ (హైద రాబాద్) పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్.సునీతాకృష్ణన్ అన్నారు. మహిళల బలహీనతలను ఆసరాగా తీసుకొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల నుంచి మార్పు రావాలంటే మగవాళ్ల ఆలోచన విధానాల్లో మార్పు ఒక్కటే మార్గమని సూచించారు. రిమ్స్ ఆడిటోరియంలో గురువారం ‘మానవ అక్రమ రవాణా వ్యతిరేక ఉద్యమ ప్రజాచైతన్య రథం’ పేరిట ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంస్థ ప్రారంభించిన రెండు దశాబ్దాల కాలంలో సుమారు 16 వేల మంది మహిళలు, చిన్నారులను వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించినట్టు చెప్పారు. అందులో 10, 8, 6, 3 ఏళ్ల బాలికలు, చిన్నారులు కూడా ఉండడం ఆవేదన కలిగిస్తున్న విషయమని తెలిపారు. ప్రతి మహిళ తనను తాను ఎలా రక్షించుకోవాలో, సంఘటితంగా ఎలా ఉండాలో తెలిపేందుకే సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు చెప్పారు. ప్రతి ఒక్కరూ జీవితంలో ఎలా ఉండాలనే దానిపై కలలు కనడం తప్పుకాదని, ఆ క లలకు హద్దులు లేకపోతేనే ముంచుకొచ్చే ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ‘ఏ అమ్మాయి అమ్ముడుపోకూడదు... ఏ అబ్బాయి అమ్మాయిలను అమ్మకూడదు’ అనే నినాదంతో ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నట్టు తెలిపారు. అబ్బాయిల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా దృష్టిసారించాల్సిందిగా సూచించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ఈ ఏడాది జనవరి 9వ తేదీన ప్రజల్లో అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఈ కార్యక్రమంతో ఉమ్మడి రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో ఈ యాత్రలను పూర్తి చేసినట్టు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలో 30 జిల్లాల్లో కూడా మహిళలను చైతన్యవంతం చేస్తామన్నారు. మరో 2, 3 ఏళ్లలో దేశం మొత్తం తమ ప్రజ్వల సంస్థ తరఫున అన్ని రాష్ట్రాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం మాట్లాడుతూ దేశంలో చట్టాలు ఎన్ని వస్తున్నా మహిళలపై నిత్యం జరుగుతున్న దాడులు, వారు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. పెళ్లిపేరుతో, ఉపాధి పేరుతో ఎవరైనా జిల్లా నుంచి ఎక్కడికైనా వెల్లవలసి వస్తే సమాచారం తెలిపేందుకు కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాన చెప్పారు. వారు ఎక్కడికి వెళుతున్నది, ఏ పనిమీద వెళుతున్నది వివరాలు నమోదు చేయాల్సిందిగా కోరారు. దీనివల్ల దేశంలో ఏ రాష్ట్రంలోనైనా, ఇతర దేశాలకు ఎక్కడికి వెళ్లినా వారి సమాచారాన్ని తెలుసుకొనే అవకాశం ఉంటుందన్నారు. దీని కోసం ఒక ప్రత్యేక అధికారిని కూడా నియమిస్తామని చెప్పారు. జిల్లాలో 2011 నుంచి ఈనెల వరకు మహిళల అపహరణ, ఇంటి నుంచి వెళ్లిపోరుున కేసులు 257 వరకు నమోదు కాగా, వాటిలో 243 కేసుల్లో మహిళలను, యువతను సురక్షితంగా పోలీస్‌శాఖ ఇంటికి చేర్పించిందన్నారు. మిగితా 14 కే సుల్లో పురోగతిపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్పీ ఏఎస్ ఖాన్ మాట్లాడుతూ సెల్‌ఫోన్ వాకడం పరిమితిని, సోషల్ మీడియా వల్ల అనర్థాలను వైద్యవిద్యార్థులకు వివరించారు. సమావేశంలో రిమ్స్ డెరైక్టర్ బీఎల్ఎన్ ప్రసాద్, సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌నాయక్, జిల్లా ఆస్పత్రుల సమన్వయాధికారి వీరాస్వామి, ఐసీడీఎస్ పీడీ చక్రధరావు, డీఆర్డీఏ పీడీ తనూజారాణి, స్వీప్ స్వచ్ఛంద సంస్థ డెరైక్టర్ కె.రమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. ముందుగా 20 నిమిషాల నిడివిగల ఆనామిక డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. కుటుంబాన్ని దూరం చేసుకొని సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందులను, అట్టి పరిస్థితుల్లో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ తోడుగా నిలబడిన సందర్భాలను సంస్థలో పనిచేసిన వారు తెలియజేశారు. -
ఇంకొకరైతే...
రేప్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఎనిమిది మంది. కొట్టారు... తిట్టారు... మనసును పుండు చేశారు. పుండు మీద పురుషాహం‘కారం’ చల్లారు. శరీరానికి మనసుకు నొప్పి తెలిసింది. స్ఫూర్తిని మాత్రం ముట్టుకోను కూడా ముట్టుకోలేక పోయారు. తమ బాధను మర్చిపోవడానికి కొందరు ఇతరుల కోసం ఆశ్రమాలు కట్టారు.సునీతా కృష్ణన్ ఏకంగా ఆశ్రయమే కట్టింది. తల దాచుకునే ఆశ్రమం కాదు... తలరాతను మార్చే ఆశ్రయం. ఇంకొకరైతే ఆశ్రమానికి చేరేవారు. మరొకరైతే ఆగిపోయుండేవారు. సునీత కదిలింది. సునీతను చూసి వాళ్లూ కదం తొక్కుతున్నారు ఆమె చిన్నప్పుడు అమ్మానాన్నల గారాలపట్టి. ఎనిమిదేళ్ల వయసుకే సమాజ సేవపై ఆసక్తి పెంచుకుంది. తను నేర్చుకున్న డాన్స్‌ను మెంటల్లీ చాలెంజ్డ్ పిల్లలకు నేర్పడం మొదలుపెట్టింది. పన్నెండేళ్లు వచ్చేప్పటికి స్లమ్‌లోని పిల్లలకు టీచర్‌గా మారింది. పదిహేనో యేట దళితులను అక్షరాస్యులను చేసే క్యాంపెయిన్‌లో భాగమైంది. అయితే ఆ సర్వీస్‌లైన్ సరళరేఖలా సాగలేదు. ఆమె మీద ఎనిమిది మంది లైంగికదాడి చేశారు. పడిలేచిన కెరటం పసివయసులో మనసుకి, శరీరానికి అయిన ఆ గాయం ఆమెను అనామికగా మిగల్చలేదు. అక్రమరవాణాలో చిక్కుకున్న అమ్మాయిలకు కొత్త జన్మనిచ్చే అమ్మగా మార్చింది. ప్రజ్వల సునీతాకృష్ణన్గా ప్రపంచానికి సుపరిచితురాలిని చేసింది. నేపథ్యం బెంగుళూరులో పుట్టి తండ్రి రాజుకృష్ణన్ ఉద్యోగరీత్యా దేశమంతటా ప్రయాణం చేస్తూ పెరిగింది సునీత. తల్లి నళిని కృష్ణన్ గృహిణి. భూటాన్‌లోని సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్లో స్కూలింగ్, బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ నుంచి ఎన్విరాన్మెంటల్ సెన్సైస్‌లో డిగ్రీపట్టా పొంది మంగుళూరు యూనివర్సిటీ రోషిణి నిలయలో సోషల్‌వర్క్ మీద పీహెచ్డీ చేసింది సునీత. డాక్టరేట్ కోసం సెక్స్వర్కర్స్ జీవితాల పరిశోధనను అంశంగా తీసుకుంది. ఆకాశాన్నంటిన అల పొద్దస్తమానం సమాజం, బడుగువర్గాలు, అక్రమరవాణాకు గురవుతున్న మహిళలు అంటూ పాటుపడ్డం సునీత తల్లిదండ్రులకు అంతగా రుచించలేదు. అంతకుముందే దెబ్బతిన్న మనిషి.. దాని తాలూకు భయమేదీ లేకుండా దూసుకెళ్తుంటే మళ్లీ ఇంకేదైనా ప్రమాదం ముంచుకు రావచ్చనే వెరపుతో ఆమెను ప్రోత్సహించలేదు. అయినా ఆమె వెనక్కి వెళ్లలేదు. తీరాన్ని చేరడం కాదు ఆకాశాన్నంటాలి అనే సాహసంతో ముందుకు సాగింది. హైదరాబాద్ వచ్చేసింది. వర్గీస్ థెకనాథ్ నడుపుతున్న పీపుల్స్ ఇనీషియేటివ్ నెట్వర్క్ (పీఐఎన్)లో చేరింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ‘మూసీ బ్యూటీఫికేషన్’ ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా నినదించింది. మూసీ తీరాన్ని ముస్తాబు చేయడం కోసం దాని తీరం వెంట ఉన్న స్లమ్‌లోని ఇళ్లను కూల్చేసే ప్రక్రియ అది. నిరాశ్రయుల తరపున వాళ్ల హక్కుల కోసం ధర్నాలు, నిరసన ర్యాలీలు నిర్వహించింది. ప్రజ్వల 1996.. హైదరాబాద్ పాతబస్తీలోని మెహబూబ్ కీ మెహందీ... అంటే సెక్స్వర్కర్స్ ఉండే ప్రాంతం. పాత బస్తీలోంచి వాళ్లను పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది అప్పటి ప్రభుత్వం. దాంతో వ్యభిచారం ఉచ్చులో బిగుసుకున్న వాళ్లంతా నిలువ నీడలేని వాళ్లయ్యారు. వాళ్ల పిల్లలు ఆ కూపంలోకి జారిపోకుండా ఈ రెండోతరం కోసం ఓ స్కూల్‌ను ప్రారంభించింది. నగా నట్రా, చివరకు ఇంట్లోని వస్తువులనూ అమ్మి మరీ ఆ స్కూల్‌ని నిలబెట్టింది. అదే ప్రజ్వల. సునీత కృష్ణన్ ప్రయత్నాలకు అడ్రస్‌గా.. ఆమె కష్టాలకు ప్రతిఫలంగా కనిపిస్తున్న సంస్థ. ఇప్పటి వరకు దాదాపు పన్నెండువేల మందిని సెక్స్ ట్రాఫికింగ్ నుంచి కాపాడి ప్రపంచంలోనే అతిపెద్ద యాంటీ ట్రాపికింగ్ సంస్థగా తన శక్తి నిరూపించుకుంది. ఆటుపోట్లు రాలేదా? ‘బోలెడు. ఇప్పటికి పదిహేడుసార్లు నామీద దాడులు జరిగాయి. నా కుడిచెవి దెబ్బతింది. వీటిని నేను దాడులుగా భావించట్లేదు. వ్యవస్థీకృతమైన నేరాన్ని ఆపే నా ప్రయత్నానికి గుర్తింపు అనుకుంటున్నా. ఒక అమ్మాయి అక్రమరవాణాకు గురై, వ్యక్తిగత, సామాజిక గుర్తింపు సహా ఆరోగ్యం, కుటుంబం, అనుబంధాలు అన్నిటినీ కోల్పోతోంది. ఆమెను కాపాడి తను కోల్పోయిన సెల్ఫ్ అండ్ సోషల్ ఐడెంటిటీనీ మళ్లీ ఆమె పొందేలా చెయ్యాలన్నదే లక్ష్యం. వాళ్లను తిరిగి ఈ సమాజంలో భాగం చెయ్యాలి. ఆ బిడ్డలూ మన బిడ్డలే అన్న స్పృహ కల్పించాలి. ప్రజ్వలకొచ్చి కొత్త జీవితం మొదలుపెట్టిన అమ్మాయిల మొహాల్లోని నవ్వు, తమను హింసించిన వాళ్లను క్షమించే సహనం నా గాయాలను మరిపించేస్తాయి. నాలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపుతాయి’ ప్రజ్వల ఎలా పనిచేస్తుంది? పోలీసుల సహాయంతో రెస్క్యూ చేసి ఆ పిల్లలను ప్రజ్వల హోమ్‌కి తెస్తారు. హోమ్‌కు వచ్చిన ఆ అమ్మాయిల మానసిక స్థితి చాలా చిత్రంగా ఉంటుంది. అసలు ఆ కూపంలో పడి మగ్గిపోవడమే తమ తలరాత అనే భావనలో ఉంటారు. వాళ్లను ట్రాఫికర్స్ అలా తయారు చేస్తారు. దీంతో హోమ్‌లోని కేర్‌టేకర్స్‌ను నమ్మే పరిస్థితి ఉండదు. పారిపోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్లను వాళ్లు హింసించుకుంటుంటారు. కొందరైతే ఆత్మహత్యాయత్నానికీ పాల్పడతారు. అలాంటి వాళ్లకు సైకాలజికల్, సైకియాట్రిక్ కౌన్సెలింగ్స్ ఇస్తారు. సాధారణస్థితికి వచ్చాక లైఫ్‌స్కిల్స్ ట్రైనింగ్ ఉంటుంది. వీటితో వీళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమందిని వాళ్లవాళ్లు తీసుకెళ్తారు. ఇంకొంతమంది తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇష్టపడరు. మరికొంతమందిని కుటుంబాలు తిరస్కరిస్తాయి. అలాంటి వాళ్లకు ప్రజ్వలే ఇల్లు, సునీతకృష్ణే అమ్మ. ఇక్కడ కంప్యూటర్స్, హార్డ్‌వేర్, బైండింగ్, వెల్డింగ్ రంగాల్లో శిక్షణపొందిన చాలా మంది అమ్మాయిలు పెద్దపెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. - సాక్షి ఫీచర్స్ ప్రతినిథి ఆడపిల్లల్ని అలర్ట్ చేసే... స్వరక్షా క్యాంపెయిన్ సెంటిమీటరు భూమి పోయిందంటే సుప్రీంకోర్టుదాకా వెళ్లే మనుషులు ఆడకూతురికి అన్యాయం జరిగితే నాలుగు గోడల మధ్యే దాస్తున్నారు. ఈ రోజు కులం, మతం పేరుమీద జరుగుతున్న ఇంటాలరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మన ఆడబిడ్డలకు జరుగుతున్న అన్యాయాలపై మాత్రం ఎక్కడలేని టాలరెన్స్ ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ ఆడపిల్లలు తమను తమనే రక్షించుకోవాల్సిన అవసరాన్ని కల్పిస్తున్నాయి. ఎలా రక్షించుకోవాలి... మోసపోకుండా, అక్రమ రవాణాకు బలి కాకుండా ఎలాంటి జాగ్రత్త కావాలి అని చెప్పే ‘స్వరక్షా యాత్ర’ను ప్రారంభించబోతున్నాం. అమెరికన్ కాన్సులేట్‌తో కలిసి ప్రజ్వల చేసే ఈ ప్రయాణం జనవరి 9న మొదలై మే వరకు సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 53 జిల్లాలు, 132 గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్తాం. అదీ రేప్ సర్వైవర్స్‌తో. ఓ కారవాన్‌లో వెళ్తాం. వెళ్లిన ప్రతిచోటా ఈ సర్వైవర్స్ తమ సొంత కథను చెప్తూ ట్రాఫికింగ్ పట్ల అవగాహన కలిగిస్తారు. మగపిల్లలనూ సెన్సిటైజ్ చేస్తాం. మగపిల్లలు థ్రిల్ కోసం పోర్న్‌సైట్స్ చూసి సెక్స్‌ని కొనాలనుకున్నప్పుడు వాళ్ల కోరిక తీర్చడానికి ఎక్కడో అక్కడ ఓ అమ్మాయి ఎలా అమ్ముడుపోతుందో చెప్తాం. పోస్టర్లు, షార్ట్ఫిలిమ్స్, సినిమాల ద్వారా చూపిస్తాం. అలా ఇంకో మగాడి కోరికకు వీళ్లింట్లోని ఆడపిల్ల కూడా బలవ్వచ్చు అనే స్పృహను కలిగించి రియల్ మ్యాన్ డోంట్ బై సెక్స్ అనే మెసేజ్‌ను తెలియజేస్తాం. అమెరికన్ కాన్సులేట్‌తో కలిసి ప్రజ్వల చేసే ఈ ప్రయాణం జనవరి 9న మొదలై మే వరకు సాగుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 53 జిల్లాలు, 132 గ్రామాల్లోని ఇంటింటికీ వెళ్తాం. -
సునీత కృష్ణన్ కారుపై దాడి
హైదరాబాద్: వ్యభిచార కూపంలో చిక్కుకున్న మహిళల పునరావాసానికి కృషిచేస్తున్న ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సునీత కృష్ణన్ కారుపై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఆమె అందులో లేరు. చార్మినార్ సమీపంలోని సంస్థ కార్యాలయం సమీపంలో కారు పార్క్ చేసి ఉండగా ఈ ఘటన జరిగింది. సునీత కృష్ణన్ కారుపై దాడి జరగడం, మూడు రోజులుగా ఆమెకు బెదిరింపు కాల్స్ వస్తుండడంపై జాతీయ మీడియాలోనూ కథనాలు రావడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఓ జాతీయ చానెల్‌కు ఆమె ఇంటర్వూ ఇచ్చిన కొద్దిసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓ గ్యాంగ్‌రేప్‌నకు సంబంధించి నిందితుల వీడియోను ఆమె సోషల్ మీడియాలో పెట్టడం వల్లే ఈ దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 6 నెలల క్రితం ఉత్తరాది రాష్ట్రంలో ఓ మహిళపై ఐదుగురు యువకులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన వీడియో వాట్సాప్ ద్వారా సునీత కృష్ణన్‌కు చేరింది. ఆ యువకులు మాత్రమే కనిపించే విధంగా ఆమె ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఆ దుశ్చర్యపై ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. దీంతో శుక్రవారం ఉదయమే సునీత కృష్ణన్‌ను ఓ జాతీయ చానల్ ఇంటర్వ్యూ చేసి ప్రసారం చేసింది. ఆ తర్వాత గంట సేపటికే ఆమె కారును దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఈ ఘటనపై ఆరా తీశారు. మరోవైపు శుక్రవారం సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారులు చార్మినార్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సునీత కృష్ణన్ ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తునకు రెండు ప్రత్యేక బందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రజ్వల కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాగా, మూడు రోజులుగా తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని సునీత కృష్ణన్ మీడియాకు వెల్లడించారు. లైంగికదాడి ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. లైంగికదాడుల నిరోధానికి ప్రత్యేక చట్టాలు తేవాలన్నారు. తాజా ఘటనపై హోంశాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.