‘ఐయామ్ వాట్ ఐయామ్’... సునీతకృష్ణన్ రాసుకున్న జీవన జ్ఞాపకాల గుచ్ఛం. ఆడపిల్లల అక్రమ రవాణా, లైంగికదాడి బాధితుల పునర్జీవనం పై పోరాడుతున్న సామాజిక కార్యకర్తగా సునీతా కృష్ణన్ ఈ పుస్తకంలో సాంకేతికత ముసుగులో సోషల్ మీడియా వేదికగా ఆడపిల్లలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితులను నమోదు చేశారు. ఆమె ‘సాక్షి’తో మాట్లాడిన వివరాలు...
‘‘సైబర్ టెక్నాలజీ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్’ మీద నేను జాతీయస్థాయి సర్వే చేస్తూ ఆధారాల కోసం ఒక యాప్ ద్వారా ‘పిల్లల అశ్లీల వీడియో’ల కోసం ప్రయత్నించాను. అందుకోసం 532 రూపాయలు చెల్లించాను. మూడు రోజుల్లో తొమ్మిదివేల వీడియోలు వచ్చాయి. ఆరు నెలల పసిబిడ్డ నుంచి ఎనిమిదేళ్ల అమ్మాయి వరకు ఉన్న వీడియోలు కళ్లు మూసుకోవాల్సినంత ఘోరంగా ఉన్నాయి. ఇది ఏ డార్క్ వెబ్‌లోనో కాదు, పబ్లిక్ డొమైన్‌లోనే. ఒక ఇన్‌ఫ్లూయెన్సర్‌కి డబ్బు పంపించాం, వీడియో రావడం ఆలస్యమైంది. ఫోన్ చేసి అడిగితే వచ్చిన సమాధానమేంటో తెలుసా... ‘నేను ట్యూషన్‌లో ఉన్నాను. తర్వాత పంపిస్తాన’ అని. అంటే ఆ కుర్రాడి వయసు ప్లస్‌టూ దాటలేదని అర్థమవుతోంది. సమాజం ఇలా ఉంది’
మగపిల్లలకూ రక్షణ లేదు
‘ఒకప్పుడు మానవ అక్రమ రవాణా అంటే చదువులేక పేదరికంతో కష్టాలు పడుతున్న వారికి మాయమాటలు చెప్పి మోసం చేసేవారు. ఇప్పుడు ఆ ఆర్థిక రేఖ కూడా చెరిగిపోయింది. బాగా చదువుకున్న అమ్మాయిలు కూడా బాధితులవుతున్నారు. ఒకప్పుడు ఈ నేరాలు ఎవరు చేశారనేది దర్యాప్తులో స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు నేరస్థులు సాంకేతికత మాటున దాక్కుంటున్నారు. మగపిల్లలు కూడా ట్రాఫికింగ్‌కి గురవుతున్నారిప్పుడు. ఈ ఘోరాలన్నింటికీ సోషల్‌మీడియా అనేది ప్రధాన మాధ్యమంగా మారింది. వీటన్నింటినీ నియంత్రించాలంటే ప్రభుత్వం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పటిష్టంగా ఏర్పాటు చేయాలి, వాటిని కచ్చితంగా అమలు చేయాలి. మాలాంటి సోషల్ నేను నా పుస్తకం ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’లో ఉదహరించిన అనేక అంశాలు, వాటి నుంచి నేను నేర్చుకున్న ΄ాఠాలు కూడా ఈ సమస్యల మీద ముందుకెళ్లడానికి ఉపకరిస్తాయనే అనుకుంటున్నాను’
ఎందుకు రాశానంటే...
‘మా నాన్నకు తన ఆటోబయోగ్రఫీ రాయాలనే కోరిక ఉందని తెలిసి పిల్లలుగా మేము సహకరించాం. ఆయన తుదిశ్వాస వదలడానికి రెండు నెలల ముందు పుస్తకం ఆవిష్కరించాం. బంధువులు, స్నేహితులకు ఆ ప్రతులను పంచినప్పుడు ఒక్కొక్కరూ ‘ఆయన సమాజం కోసం ఇంత సర్వీస్ ఇచ్చారని మాకిప్పటి వరకూ తెలియద’ంటూ నాన్నగారి గురించి ప్రశంసాపూర్వకంగా మాట్లాడారు. ఆ మాటలు వినడానికి నాన్న లేరు. అప్పుడు నాకు ఒక మనిషి గురించి పదిమందికి ఆ మనిషి బతికుండగానే తెలియాలి. అలాగే ఆ పదిమంది ఏమనుకున్నారనేది అది మంచి అయినా చెడు అయినా సరే... ఆ మనిషి బతికుండగానే తెలుసుకోవాలి అనిపించింది. అది తొలి కారణం.
రెండో కారణం బాలీవుడ్ బయోపిక్. బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు నా బయోపిక్ తీస్తామని అనుమతి కోరారు. ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే యూ ట్యూబ్‌లో నా గురించి ఎవరికి తోచిన కథ వారు పెట్టారు. ఇతరులకు ఆ అవకాశం ఇవ్వడం కంటే నా స్టోరీ నా వెర్షన్ నేనే చె΄్పాలి అనుకున్నాను. నా పుస్తకంలో నేనేంటో ఉంది. ఒక గదిలో కూర్చుని రోజుకు 14 గంటల చొప్పున 13 రోజుల్లో పూర్తి చేసి జూన్ 17వ తేదీన విడుదల చేశాను. ‘ఐ యామ్ వాట్ ఐ యామ్’ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది’ అని వివరించారు సునీతాకృష్ణన్.
– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటో : అనిల్ కుమార్ మోర్ల
బలహీనత తెలియడమే బలం
మన బలహీనతలను గుర్తించగలగడమే మన శక్తి. నా బలహీనత ఏమిటో గుర్తించగలిగాను కాబట్టే శక్తిమంతమయ్యాను. మన ఇచ్ఛాశక్తిలో శుద్ధి ఉంటే ప్రపంచంలోని శక్తులన్నీ మనకు సహాయంగా వస్తాయి. ప్రజ్వల నిర్వహణ కోసం ఫండ్‌రైజింగ్ గురించి ్ర΄ోగ్రామ్ చేయడానికి ఎన్‌డీటీవీ, సాక్షి టీవీలు అవకాశం ఇచ్చాయి. లైవ్ పూర్తయ్యేలోపు ఒక చిన్న ΄ాప తన కిడ్డీ బ్యాంక్‌ని పగలకొట్టి ఏడువేల రూ΄ాయలిచ్చింది. ఇలాంటి ఎంతోమంది సహకారం అందించారు. ఇప్పటి వరకు బాధితులైన మహిళల రక్షణ కోసమే పని చేశాను. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న సామాజిక విధ్వంసం చూస్తుంటే ప్రమాదం బారిన పడుతున్న మహిళల గురించి పని చేయాలనుకుంటున్నాను.
– సునీతా కృష్ణన్, ఫౌండర్, ప్రజ్వల ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment