మెట్రో రైలు లేనట్టే!
ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ
లాభసాటిగా ఉండదనే అనుమానం
గుంటూరు, విజయవాడ నగరాలను కలిపితేనే లాభం
విజయవాడ : విజయవాడ నగరానికి మెట్రో రైలు ప్రాజెక్టు ఇప్పట్లో లేనట్టే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ఈ విషయం స్పష్టమవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన నివేదికలను పరిశీలించిన తరువాత మెట్రో రైలు ప్రాజెక్టుకు ఫీజబిలిటీ ఇచ్చేందుకు కేంద్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది. విజయవాడ నగరంలో ప్రస్తుతం 13 లక్షల వరకు జనాభా ఉంది. నిత్యం వచ్చిపోయే వారి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని వ్యాపార వర్గాల అంచనా. మొత్తం మీద మెట్రో రైలు ప్రాజెక్టు వల్ల నష్టాలు తప్ప లాభాలు ఉండే అవకాశం లేదని కేంద్రం తేల్చింది.
గుంటూరు-విజయవాడ కలిపితేనే...
విజయవాడ, గుంటూరు నగరాలను కలిపితేనే జనాభా పరంగా చూసినా, కిలోమీటర్ల పరంగా చూసినా లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. మెట్రో రైలు ప్రాజెక్టు ఫీజబిలిటీని పరిశీలించేందుకు వచ్చిన శ్రీధరన్ గుంటూరు నగరాన్ని మినహాయించి విజయవాడ నగరంలోనే 30 కిలోమీటర్ల వరకు రైలు నడిచే విధంగా ప్రతిపాదనలు తయారు చేశారు. విజయవాడకే పరిమితం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అప్పటిలో ఆయన చెప్పారు. బందరు వైపు సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ వరకు, హైదరాబాద్ వైపు ఇబ్రహీంపట్నం వరకు నగరాన్ని చుట్టే విధంగా మెట్రో రైలు నిర్మాణం చేసేందుకు నిర్ణయించారు.
రాజకీయ కోణం...
మెట్రో రైలు ప్రాజెక్టును కేంద్రం తిరస్కరించడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నాయని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బందరు రోడ్డు మధ్యలో నుంచి మెట్రో రైలు ట్రాక్ వేయాల్సి ఉంటుంది. 13 కిలోమీటర్ల పొడవున బందరు రోడ్డులో మెట్రో నిర్మాణం జరుగుతుంది. దీనివల్ల రోడ్డును మరికొంత వెడల్పు చేయాల్సి ఉంది. అలా చేస్తే పలు దుకాణాలు తొలగించాల్సి ఉంటుంది. దీంతో కొందరు బడా వ్యాపారులు కేంద్ర మంత్రి సుజనా చౌదరి వద్దకు వెళ్లి పరిస్థితి వివరించారు. దీంతో ఆయన మోకాలడ్డటం వల్లే కేంద్రం ఈ రకమైన అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డీపీఆర్ సిద్ధం చేసి ఢిల్లీకి పంపినందున తాను ఇక్కడ ఏమీ చెప్పలేనని, ఢిల్లీ వారి ద్వారానే ఆ మాట చెప్పిస్తే సరిపోతుందని చంద్రబాబునాయుడు సుజనా చౌదరికి సలహా ఇవ్వడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తిస్థాయిలో అయిపోయిందని, త్వరలోనే పనులు చేపడతారని భావిస్తున్న తరుణంలో ప్రాజెక్టు తిరస్కరణకు గురికావడం స్థానికులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం జరగాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.