మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్ (ఫైల్‌ఫోటో)
తిరువనంతపురం: దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భావిస్తోన్న బీజేపీ అందుకు తగ్గట్లుగా పావులు కదుపుతోంది. మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. వీటిలో దక్షిణాది రాష్ట్రాలు కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి. తమిళ ప్రజలు బీజేపీ పట్ల అంత విశ్వాసం చూపరు. ఈ క్రమంలో కాషాయ పార్టీ కేరళలో పాగా వేసేందుకు సీరియస్‌గా ట్రై చేస్తోంది. దానిలో భాగంగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్‌ని తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం కేరళ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ కే సురేంద్రన్ ప్రకటన విడుదల చేశారు. కేరళ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రోమ్యాన్ శ్రీధరన్ పేరును ప్రకటించారు. మిగతా వారి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
శ్రీధరన్ గత వారం బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధం అని తెలిపారు. తాజాగా బీజేపీ ఆయననే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. శ్రీధరన్‌కున్న క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ.. ‘‘ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే దాని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎక్కడ నుంచి పోటీ చేసినా నేను గెలుస్తాననే నమ్మకం ఉంది. ఈ సారి బీజేపీ అధికారంలోకి వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, నేను ఇప్పుడు నివసిస్తున్న మలప్పురంలోని పొన్నానికి సమీపంగా ఉండే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటున్నాను”అని తెలిపారు.
కొచ్చి మెట్రో ప్రాజెక్టుకు గురువుగా ఉన్న శ్రీధరన్ తాను ఇంటింటికి వెళ్లి ఓట్లు అడిగే సంప్రదాయాన్ని పాటించనని తెలిపారు. ‘‘నేను ఇళ్లకు, దుకాణాలకు, ఊర్లకు వెళ్లను. కానీ నా సందేశం ఓటర్లందరికి చేరుతుంది’’ అన్నారు. వృద్ధులను పక్కకు పెడుతున్న బీజేపీ తాజాగా 88 ఏళ్ల శ్రీధరన్‌ను తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
చదవండి:
మెట్రోమ్యాన్ లక్ష్యం నెరవేరేనా?
లవ్ జిహాద్‌పై శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు!
Comments
Please login to add a commentAdd a comment