మెట్రో శ్రీధరన్ వెయిటింగ్
సాదాసీదాగా చిన్నకారులో వచ్చిన వైనం
గెస్ట్‌హౌస్‌లో గది కోసం నిరీక్షణ
విజయవాడ బ్యూరో : రాష్ట్రంలోని మెట్రో రైలు ప్రాజెక్టుల సలహాదారు, డీఎంఆర్‌సీ మాజీ ఎండీ శ్రీధరన్ బుధవారం సాయంత్రం స్టేట్ గెస్ట్ హౌస్‌లో గది కోసం నిరీక్షించాల్సివచ్చింది. బుధవారం రాత్రి 7.30 గంటలకు శ్రీధరన్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీ ఎస్.డి.శర్మ స్టేట్ గెస్ట్ హౌస్‌కు వచ్చారు. వారి కోసం ముందే రెండు వీఐపీ గదులు బుక్ చేశారు. అయితే వారు వచ్చే సమయానికి ఆ గదులకు తాళం వేసి ఉంది. గెస్ట్‌హౌస్ ఉద్యోగి ఒకరు తాళం వేసుకుని బయటకు వెళ్లినట్లు సమాధానం రావడంతో కొద్దిసేపు వారిద్దరూ ఆ గది బయటే నుంచున్నారు. ఈలోపు మరో ఉద్యోగి వచ్చి వేరే గదిలో కొంతసేపు వేచి ఉంటే బుక్ చేసిన వీఐపీ గదుల తాళాలు తెప్పిస్తానని చెప్పడంతో శ్రీధరన్ అందులో కొద్దిసేపు కూర్చున్నారు.
ఈలోపు బుక్ చేసిన గదుల తాళాలు రావడంతో అందులోకి వెళ్లారు. రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. సీఆర్‌డీఏ ఉన్నతాధికారులంతా సింగపూర్ పర్యటనలో ఉండడంతో మిగిలిన అధికారులు ఆయన పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రొటోకాల్ బాధ్యతలు చూసే రెవెన్యూ అధికారులు కూడా ఆయన్ను పట్టించుకోలేదు. దీంతో ఇక్కడ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న డీఎంఆర్‌సీ అధికారే హడావుడి పడాల్సివచ్చింది. మరోవైపు గెస్ట్‌హౌస్ట్‌కు కిందిస్థాయి అధికారులు ఇన్నోవా, ఇతర మోడల్ కార్లలో వస్తుంటే శ్రీధరన్, ఎస్.డి.శర్మ అద్దెకు తీసుకున్న ఇండికా విస్టా కారులో చాలా సాదాసీదాగా రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
నేడు కారిడార్ల పరిశీలన
బుధవారం రాత్రి డీపీఆర్ రూపకల్పన తీరును మ్యాప్‌ల ద్వారా సమీక్షించిన శ్రీధరన్ గురువారం ఉదయం ప్రతిపాదిత రెండు కారిడార్లను పరిశీలించనున్నారు. ఏలూరు, బందరు రోడ్డుల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రదేశాలను చూడనున్నారు. మధ్యాహ్నం తిరిగి ఢిల్లీ వెళతారు.