మెట్రో రైలుమార్గంపై ప్రభుత్వానికి ప్రాథమిక
- మెట్రో రైలుమార్గంపై ప్రభుత్వానికి ప్రాథమిక
- ప్రతిపాదనలు పంపిన తుడా అధికారులు
- సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అక్టోబర్‌లో తిరుపతిలో పర్యటించనున్న శ్రీధరన్!
మెట్రో రైలు ప్రాజెక్టుపై తుడా(తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ) కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ మౌఖిక ఆదేశాల మేరకు రైలుమార్గంపై ప్రాథమిక నివేదికను తుడా అధికారులు సర్కారుకు పంపారు. తిరుపతిలో మెట్రో రైలు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అక్టోబర్ రెండో వారంలో ఆ ప్రాజెక్టు సలహాదారు, డీఎమ్మార్సీ(ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) మాజీ మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధరన్ తిరుపతిలో పర్యటించనున్నారు.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: రాజధాని ఏర్పాటుపై ప్రజల్లో అసంతృప్తిని చల్లార్చేందుకు ఈనెల 4న అసెంబ్లీలో సీఎం చంద్రబాబు జిల్లాపై హామీల వర్షం కురిపిం చారు. అందులో తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు ఒకటి. విశాఖపట్నం, వీజీటీఎం(విజయవాడ-గుంటూరు-తెనాలి-మంగళగిరి)లకు మెట్రో రైలును మంజూరు చేస్తూ ప్రభుత్వం ఆగస్టు 30న ఉత్తర్వులు జారీచేసిన విషయం విధితమే. తిరుపతికి మెట్రో రైలు ప్రాజెక్టు మంజూరుచేస్తూ ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకపోవడం గమనార్హం. మెట్రో రైలు ప్రాజెక్టులకు సహకరించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు డీఎమ్మార్సీ మాజీ ఎండీ శ్రీధరన్ అంగీకరించారు.
రాష్ట్రంలో మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారుగా శ్రీధరన్ బాధ్యతలు స్వీకరించారు. వీజీటీఎం పరిధిలో మెట్రో రైలు ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు శనివారం అక్కడ పర్యటించి తన నివేదికను ప్రభుత్వానికి పంపిన విష యం విధితమే. తిరుపతికి మెట్రో రైలును మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు వెలువడకున్నా.. సీఎం చంద్రబాబు శాసనసభలో చేసిన ప్రకటన మేరకు తుడా అధికారులు ఆ ప్రాజెక్టుకు అవసరమైన ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు.
రేణిగుంట విమానాశ్రయం, తిరుచానూరు, ఆర్టీసీ బస్టాండ్, పద్మావతి మహిళా యూనివర్సిటీ, శ్రీనివాస మంగాపురం, ఎస్వీ యూనివర్సిటీ, ఎస్వీ జూ, అలిపిరి, కపిలతీర్థం, రేణిగుంట విమానాశ్రయం మధ్యన తొలుత మెట్రో రైలు మార్గాన్ని ఏర్పాటుచేయాలని తుడా అధికారులు ప్రతిపాదించారు. సుమారు 60 కిమీల మేర మెట్రో రైలు మార్గాన్ని నిర్మించాల్సి వస్తుందని తుడా అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు నివేదికను ప్రభుత్వానికి అందించారు.
ఈ నివేదిక అమలుకు సా ధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు మెట్రో రైలు ప్రాజెక్టు సలహాదారు శ్రీధరన్ అక్టోబర్ రెండో వారంలో పర్యటించనున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు తిరుపతిలో ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందా లేదా అన్నది ప్రధానం గా పరిశీలించనున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజూ సగటున 65 వేల మంది భక్తులు తిరుపతికి వస్తున్నారు. ఇందులో 30 వేల మంది తిరుచానూరులోని అలివేలు మంగమ్మ అమ్మవారిని.. శ్రీని వాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. తుడా ప్రతిపాదించిన మార్గాల్లో ప్రయాణికుల రాకపోకలు కూడా అధికంగా ఉంటాయి.
వీటిని పరిగణనలోకి తీసుకుని ఆర్థికంగా గిట్టుబాటైతేనే మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టేలా శ్రీధరన్ ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఇదే అంశంపై తుడా వీసీ వెంకటేశ్వరరెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా.. మెట్రో రైలు మార్గాన్ని ప్రతిపాదిస్తూ ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక పంపామని చెప్పారు. తిరుపతిలో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు.. ఫీజుబులిటీ ఉందా లేదా అన్నది తేల్చేందుకు సలహాదారు శ్రీధరన్ త్వరలోనే పర్యటించనున్నారని తెలిపారు. శ్రీధరన్ ఇచ్చే నివేదికను బట్టే మెట్రో రైలు ప్రాజెక్టు భవిత ఆధారపడి ఉంటుందని స్పష్టీకరించారు.