పూలు అమ్మిన చోటే కట్టెలు కొట్టాలి.. పల్లకీలో తిరిగిన చోటే బోయీగా మారాలి... కాలుమీద కాలేసుకున్న చోటే కాలికి బలపం కట్టుకుని పనిచేయాలి.. దర్జాగా జీవించిన చోటే దయనీయంగా బతకాలి.. అజమాయిషీ చెలాయించిన చోటే అన్నీ వదులుకుని మసలాలి. పుట్టి పెరిగిన ఊళ్లోనే పరదేశీయుల్లా తిరగాలి..!
ఇదీ రానున్న రోజుల్లో రాజధాని గ్రామాల్లోని అన్నదాతల దుస్థితి.. తెలుగుదేశం ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల కారణంగా జరీబు రైతులు గరీబులు కానున్నారు. బంగారం పండిన భూములు కాంక్రీటు జంగిళ్లుగా మారబోతున్నాయి. పచ్చటి పంటలతో కళకళలాడిన ఊళ్లు కాలుష్యకాసారాలు కాబోతున్నాయి.
రాజధాని గ్రామాల భవిష్యత్‌ను తలచుకుంటే అమెరికా రాజకీయ వేత్త విలియం జెన్నింగ్స్ బ్రెయామ్ చెప్పిన ఓ వ్యాఖ్య గుర్తుకు రాకమానదు. ‘‘ మీ నగరాలను దగ్ధం చేసి పొలాలను వదిలేయండి, మాయ చేసినట్టు నగరాలు మళ్లీ కళకళలాడతాయి. పొలాలను నాశనం చేసి నగరాలను వదిలిపెట్టండి, దేశమంతటా గడ్డే మొలుస్తుంది.’’
భూ సమీకరణ పూర్తికావడంతో రాజధాని గ్రామాల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తి పనివారు తమ భవిష్యత్‌పై కలత చెందుతున్నారు. వ్యవసాయం మినహా మరో వ్యాపకం తెలియని ఈ వర్గాలు కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించాలి ? మిగిలిపోయిన పిల్లల చదువులు, వివాహాలు వంటి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి? ప్రభుత్వం సాలీనా ఇచ్చే నష్టపరిహారంతో కుటుంబాలను ఎలా నడపాలి...వంటి సమస్యలపైనే ఆలోచన చేస్తున్నారు.
నిన్నటి వరకు పదిమందికి ఉపాధి కల్పించిన రైతు మరో నెలలో ఇతరుల వద్ద పనిచేయాల్సిన పరిస్థితి. మూడు పంటలు పండిస్తూ సాలీనా ఎకరాకు రూ.లక్ష ఆదాయం పొందిన జరీబు రైతుల పరిస్థితి అగమ్యగోచరం. నదీపరివాహక ప్రాంతంలో రెండు ఎకరాల జరీబు భూమి కలిగిన రైతు, సాగుతోపాటు పశుపోషణ వంటి అనుబంధ రంగాల నుంచి అధిక ఆదాయాన్ని పొంది గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపారు. ఇకపై ప్రభుత్వం ఎకరాకు ఇవ్వనున్న రూ.50 వేలతోనే సంవత్సరమంతా జీవనాన్ని కొనసాగించాలి.
నిన్నటి వరకు రారాజులా గడిపిన జరీబు రైతు, ఇకపై ఖర్చుపై ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి. ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, రాయపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం తదితర గ్రామాల జరీబు రైతులు భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పూలు, కూరగాయలు, పాలను విజయవాడకు ఎగుమతి చేసిన ఈ రైతులకు ఇకపై ఆ పనులేవీ ఉండవు.
-సాక్షి ప్రతినిధి, గుంటూరు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని గ్రామాల్లోని రైతుల హక్కులకు రక్షణ కల్పించేందుకు, వారికి వెన్నుదన్నుగా నిలిచేందుకు అనేక పోరాటాలు, ఉద్యమాలు నడిపింది. ఆ ఉద్యమాల ఫలితమే జరీబు రైతులకు గడువుకు రెండు రోజుల ముందు ప్రభుత్వం అదనపు ప్యాకేజీని ప్రకటించింది. ‘మేమంతా మీ వెంటే’అంటూ వైఎస్సార్ సీపీకి చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతుకు భరోసా కల్పించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు, రైతుకూలీలు, కౌలుదారులు, చేతివృతి ్తపనివారల సమస్యలను తెలుసుకుని అసెంబ్లీలో వారి తరఫున పోరాటం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఇక్కడకు రానున్నారు. ఆయన రాకకోసం రాజధాని గ్రామాలు ఎంతో ఆశతో నిరీక్షిస్తున్నాయి.
పొంచి ఉన్న పొల్యూషన్ ...
రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యరహిత రాజధాని నిర్మాణానికి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నిర్మాణ పనుల సమయంలోనే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కాలుష్య కారకాలు పరిమితంగా ఉండటంతో కృష్ణానదీ పరివాహక ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సమస్యలు పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఇకపై కృష్ణానది కూడా హుస్సేన్ సాగర్ వలే కాలుష్య కాసారం కానుందనే భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మురుగునీటిపారుదలకు ఇప్పటి వరకు అంచనాలే కాని టెండర్లు కూడా ఆహ్వానించలేదు.
సంస్కృతి-సంప్రదాయాలపై దాడి ....
ఈ గ్రామాల్లోని కార్మికులకు నిర్మాణపనుల్లో నైపుణ్యం లేకపోవడంతో ఆయా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకోక తప్పదు. ముం బాయి, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి దిగుమతి అయ్యే కార్మికులు అక్కడి తమ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లను ఇక్కడ వ్యాప్తి చేయడం, అంతేగాక వాటికి సంబంధిం చిన వ్యాపారాలు ఇక్కడ ప్రారంభమయ్యే అవకాశం లేకపోలేదు. ఈ పరిస్థితుల కారణంగా మన సంస్కృతి, సంప్రదాయాలకు భంగం వాటిల్లనుందనే భయాందోళన వ్యక్తమవుతోంది.
రెండు నెలల కష్టాలు ....
రెండు నెలల పాటు జరిగిన భూ సమీకరణలో రాజధాని గ్రామాల రైతుల కష్టాలు వర్ణనాతీతం. కంటిమీద కునుకు లేకుండా నిత్యం అభద్రతతో కాలం గడిపారు. అధికారులు, టీడీపీ పాలకులు రోజుకో విధంగా రైతుల్ని బెదిరించి భూ సమీకరణ పూర్తిచేశారు. భూ సమీకరణను వ్యతిరేకించిన వారిపై పోలీసులు వేధింపులు కొనసాగాయి. స్వచ్ఛందంగా భూ సమీకరణ జరిగిందని చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులు అంగీకారపత్రాలు ఇచ్చేందుకు వారి హక్కులకు భంగం కలిగించే విధంగా అనేక చర్యలు తీసుకున్నారు.
మెతుకు పండిన చోట బతుకు.. బిక్కు బిక్కు
Published Tue, Mar 3 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement