నాణ్యతలేని భోజనం మాకొద్దు
పుల్లేటికుర్రు (అంబాజీపేట) :నాణ్యతలేని మధ్యాహ్న భోజనం పెడుతున్నారు.. ఉడకని కూరలు, ముద్దయిన అన్నం మాకొద్దంటూ 500 మంది విద్యార్థులు ఆందోళన చేశారు. ఉపాధ్యాయులకు, ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులకు నాలుగు నెలలుగా భోజనం బాగుండడం లేదని చెబుతున్నా పట్టించుకోలేదని విద్యార్థులు అన్నారు. మండలంలోని పుల్లేటికుర్రు జెడ్పీ హైస్కూలు విద్యార్థులు బుధవారం మధ్యాహ్నం భోజనం సమయంలో కూర, అన్నం బాగోలేదంటూ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. అన్నంలో రాళ్లు, వడ్లు ఉంటున్నాయని, వంకాయ కూర తినేందుకు వీలుగా లేదని వంకాయ ముక్కలు ఉడకలేదని విద్యార్థులు అన్నారు.
ఇంప్లిమెంట్ ఏజెన్సీ నిర్వాహకులను అడుగగా తింటే తినండి, లేకపోతే మానేయండని చెప్పడంతో విద్యార్థులు పుల్లేటికుర్రు సెం టర్‌కు చేరుకుని మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు. నాణ్యమైన భోజనం పెట్టాలని, ఇంప్లిమెంట్ ఏజెన్సీని మార్పు చేయాలని వారు నినాదాలు చేశారు. ఆర్‌ఐ బి.గోపాలకృష్ణ విద్యార్థులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రాస్తారోకో విరమించిన విద్యార్థులు హైస్కూలుకు చేరుకుని ధర్నా చేశారు. ఎంఈఓ ఎం.హరిప్రసాద్, ఆర్ గోపాలకృష్ణ, మాజీ సర్పంచ్ అందె వెంకట ముక్తేశ్వరరావులతో పాటు పలువురు విద్యార్థులతో మాట్లాడారు. నాలుగు నెలల నుంచి భోజనం తినేం దుకు రుచిగా లేక బయట పడేస్తున్నట్టు విద్యార్థులు తెలిపారు. ఈ విషయం ఉపాధ్యాయులకు చెప్పినా పరిస్థితిలో మార్పులేదని వారన్నారు.
హాస్టల్స్ విద్యార్థులు 200 మంది ఆకలితో అలమటిస్తున్నట్టు వారు తెలిపారు. వంటకాలను ఎం ఈఓ రుచి చూసి కూరలు బాగోలేదని వంకాయి కూర చేదుగా ఉండి, ఉడకలేదన్నారు. అనంతరం ఎంఈఓ, స్థానికులు బయటి నుంచి పెరుగు, పచ్చడి తెప్పించి విద్యార్థులకు భోజనం పెట్టించారు. అనంతరం హెచ్‌ఎం. ఎస్.సుబ్బరాజును అధికారులు, ఎంపీపీ దాసరి వీరవెంకట సత్యనారాయణలు ఆరాతీశారు. ఆఫీసు రూంలో ఉండగా విద్యార్థులు బయటకు వెళ్లిపోయారని హెచ్‌ఎం తెలిపారు. ఎస్‌ఎంసీ చైర్మన్, హెచ్‌ఎంలతో చర్చించి విద్యార్థుల నుంచి రాత పూర్వకంగా ఫిర్యాదు తీసుకోవాలని ఎంఈఓ అన్నారు. ఉన్నతాధికారులకు ఈ ఫిర్యాదు పంపి చర్యలకు సిఫార్సు చేస్తామని ఎంఈఓ తెలిపారు.