తెలంగాణ ప్రాంతంలోని ఆదిలాబాద్ నుంచి సరిహద్దు పెన్‌గంగ మీదుగా మహారాష్ట్రలోకి ప్రవేశిస్తున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసులు
సాక్షి,ఆదిలాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. పదవ రోజు బుధవారం కూడా ఇది పరిస్థితి కొనసాగింది. జిల్లాకు సరిహద్దుగా మహారాష్ట్ర ఉండగా, ఆయా మండలాల్లో సరిహద్దున పోలీసుల ఆధ్వర్యంలో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. జైనథ్, తలమడుగు, బోథ్, గాదిగూడ, తదితర చోట్ల సరిహద్దుల వైపు ఏడుచోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి అటువైపు నుంచి, ఇటువైపు నుంచి రాకపోకలను కట్టడి చేశారు. ఇదిలా ఉంటే గత కొద్దిరోజులుగా వలస జీవులు తెలంగాణలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి ఆదిలాబాద్ జిల్లాను దాటుకొని కాలినడకన వెళ్తున్నారు. మహారాష్ట్ర వైపు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, తదితర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇక మహారాష్ట్ర వైపు నుంచి తెలంగాణ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఇతరత్ర ప్రాంతాలకు కాలినడకన వలస జీవులు వెళ్తూ నిత్యం కనిపిస్తున్నారు. 44వ జాతీయ రహదారిపై వెళుతూ గుంపులు గుంపులుగా అనేకమంది వలస జీవులు, విద్యార్థులు తమ స్వస్థలాల వైపు వెళ్తూ కనిపిస్తున్నారు. సరిహద్దున చెక్‌పోస్టు వద్ద పోలీసులు కట్టడి చేస్తున్న విషయాన్ని గమనించి వీరు చెట్టు.. పుట్ట.. నదులను దాటి ఇతర మార్గాల ద్వారా రాష్ట్రాన్ని దాటుతున్నారు. జైనథ్ మండలం పెన్‌గంగ వద్ద ఇటు తెలంగాణ పోలీసులు, అటు మహారాష్ట్ర పోలీసులు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. దీంతో అటువైపు నుంచి వచ్చేవారు, ఇటువైపు నుంచి అటువైపు వెళ్లేవారు దొడ్డిదారిన నీటి ప్రవాహం లేని పెన్‌గంగ నదీని దాటుకొని వెళ్తున్నారు. ఇలా ప్రమాదకరంగా పయనిస్తుండడంతో ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ తమ స్వస్థలాలకు వెళ్లాలనే ఆతృత మాత్రం వారిలో కనిపిస్తుంది.
మాడే కడుపు..
కాలినడకన వస్తున్న వలస జీవులకు దారివెంబడి హోటళ్లు, దుకాణాలు ఏమీ కనిపించకపోవడంతో అన్నపానీయాలు లేకుండానే అలిసిపోయిన శరీరాలతోనే నడుస్తున్నారు. ఇలా రోజూ అనేక దృశ్యాలు రోడ్డు వెంబడి కనిపిస్తున్నాయి. అన్నపానీయాలు అందజేసేలా లేకపోవడంతో దయనీయంగా మారింది. ఎక్కడైన స్వచ్ఛంద సంస్థలు, ఇతర దాతలు మానవత హృదయంతో అన్నపానీయాలు కల్పిస్తుంటే తీసుకొని మళ్లీ తమ గమ్యం వైపు బయల్దేరి వెళ్తున్నారు. కొన్నిచోట్ల కొంతమంది దాతలు బిస్కెట్లు, నీళ్ల బాటిళ్లు అందజేస్తున్నారు.
జిల్లాలో కట్టడి..
జిల్లా నుంచి కాలినడకన వెళ్తున్న తెలంగాణ ప్రాంతంలోని వివిధ జిల్లాలకు చెందిన వారు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరా™త్ తదితర ప్రాంతాల వ్యక్తులను పోలీసులు కట్టడి చేశారు. సుమారు 150మందిని జిల్లాకేంద్రంలో వారికి ఆశ్రయం కల్పించారు. తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో 110 మందికి, బీసీ హాస్టల్‌లో 32 మందికి ఆశ్రయం కల్పించి అన్నపానీయాలు, ఇతరత్ర అందజేస్తున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నిరాశ్రయులకు రెండు భవనాల్లో ఆశ్రయం కల్పించారు. ఇందులో రోడ్డు పక్కన నివసించే వారు, బిక్షాటన చేసేవారు, ఇతరులు ఉన్నారు. వారందరిని నిరాశ్రయుల భవనానికి తరలించారు. ఇదిలా ఉంటే రేషన్‌కార్డు లేనటువంటి వారికి కొన్ని స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రేషన్ సరుకుల పంపిణీ నిర్వహించారు. పిట్టలవాడలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న చేతుల మీదుగా ఈ సరుకులను పేదలకు పంపిణీ చేశారు. నిరాశ్రయులకు మున్సిపాలిటీ పరిధిలో ఆశ్రయం కల్పించిన చోటా సదుపాయాలను ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పరిశీలించారు. వారికి అందుతున్న వసతులపై ఆరా తీశారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు చౌహాన్ జ్ఞానేశ్వర్–ఐశ్వర్య.. జ్ఞానేశ్వర్ ఆదిలాబాద్‌లో దినసరి కూలీలా ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు. లాక్‌డౌన్ కావడంతో పనులు లేక ఏం చేయాలో తెలియని పరిస్థితి. దీంతో తన భార్యతో కలిసి స్వగ్రామమైన మహారాష్ట్రలోని పూసద్ గ్రామానికి కాలిబాటన బయల్దేరాడు. బుధవారం పెన్‌గంగ సమీపంలో మహారాష్ట్ర వైపు వెళ్తూ కనిపించాడు. ఇది ఒక జ్ఞానేశ్వర్ పరిస్థితి కాదు. అనేక మంది వలస జీవుల దుస్థితి.
బెంగుళూరు నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లేందుకు ఆదిలాబాద్ మీదుగా కాలినడకన వస్తున్న వలస జీవులు
Comments
Please login to add a commentAdd a comment