సాక్షి, ఆదిలాబాద్ : పొట్టచేత పట్టుకొని.. రాష్ట్ర సరిహద్దులు దాటి జిల్లాకు వచ్చిన వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతించింది. దీంతో లాక్‌డౌన్ నిబంధనలను కొంత మేరకు సడలించింది. నెల రోజులకుపైగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు అనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర సరిహద్దు వరకు కూలీలను తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయగా, తమ తమ రాష్ట్రాలకు తీసుకెళ్లాలని కోరుతున్నారు. దీంతో శని, ఆదివారాల్లో బయలుదేరాలి్సన బస్సులు ఇక్కడే నిలిచిపోయాయి. కరోనా దేశ వ్యాప్తంగా ఉన్న దృష్ట్యా ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులను సంప్రదించకుండా కూలీలను తీసుకెళ్లడం సరికాదు. అయితే సహాయ కలెక్టర్ అభిలాష అభినవ్ ఆయా రాష్ట్రాల నోడల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడి నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో ఇక్కడ ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక.. అవస్థలు పడుతున్నారు.
జిల్లాలో 6,612 మంది..
వివిధ పనుల నిమిత్తం జిల్లాకు వచ్చిన వలస కూలీలు 6,612 మంది ఉన్నారని యంత్రాంగం గుర్తించింది. కరోనా వైరస్ దృష్ట్యా ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలు కాలేదు. అయితే జిల్లాలోని వలస కూలీలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, ఫంక్షన్ హాళ్లలో, వసతి ఏర్పాటు చేసి భోజనం పెడుతున్నారు. ఇక స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో ఇంటిబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. అధికారులు కూడా కూలీల జాబితా తయారు చేస్తోంది. రాష్ట్రాల వారీగా తరలించేందుకు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో కుటీర పరిశ్రమలు, భవన నిర్మాణ పనులు, ఇటుక బట్టీలు, జిన్నింగ్ మిల్లుల్లో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికులే అధికంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. వీరిలో సగానికి పైగా సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతుండగా, సోమ లేదా మంగళవారాల్లో వారిని తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
అన్ని రకాలుగా సాయం..
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హైదరాబాద్‌కు చెందిన వలస కూలీలు జిల్లాలో అధికంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆదిలాబాద్‌లోని గాయత్రి గార్డెన్, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో షెల్టర్లను ఏర్పాటు చేసి వలస కార్మికులను ఉంచారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు నిత్యావసర సరుకులు అందజేసి, భోజన వసతి కల్పిస్తున్నారు.
వచ్చినా.. వెళ్లినా థర్మల్ స్క్రీనింగ్
తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వలస కూలీలకు అంతరాష్ట్ర సరిహద్దు వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్, మెడికల్, రెవెన్యూ అధికారులతో కూడిన బృందాలు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వచ్చిన వారిని, మన రాష్ట్రం మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి జైనథ్ మండలం డొలారా గ్రామం పెన్‌గంగా వద్ద అధికారులు స్క్రీనింగ్ చేస్తున్నారు. వచ్చిన వారి వివరాలు నమోదు చేసి, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండే విధంగా స్టాంపింగ్ చేస్తున్నారు. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. పెన్‌గంగా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును కలెక్టర్ ఆదివారం +పరిశీలించి, నిరంతర పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment