సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాకు చెందిన 17 ఏళ్ల అజిత్ కుమార్ రెండేళ్ల క్రితం గుజరాత్‌లోని సూరత్‌లో తన కజిన్ పని చేస్తోన్న ఎంబ్రాయిడరీ ఫ్యాక్టరీకి వెళ్లి పనిలో చేరారు. నెలకు పదివేల రూపాయలు జీతం వస్తుండగా, అందులో మూడున్నర వేల రూపాయలు ఇంటి అద్దెకు చెల్లిస్తూ ఉంటున్నారు. నెలకు రెండున్నర, మూడున్నర వేల రూపాయలు ఇంటికి పంపిస్తూ వచ్చారు. ఇంతలో లాక్‌డౌన్ వచ్చి పడింది. కంపెనీ నుంచి ఏప్రిల్ నెలకు డబ్బులు రాలేదు. ఇంటి అద్దె మూడున్నర వేల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. ఆ దశలో ‘అమ్మా! నేను ఇక ఇంటికి డబ్బులు పంపించలేను. అద్దె చెల్లించడమే కనా కష్టంగా ఉంది’ అంటూ ఫోన్‌చేసి చెప్పారు. అజిత్ కుమార్ తండ్రి దినసరి కూలీగా పని చేస్తారు. ఒకరోజు కూలి 300 రూపాయలు వస్తుంది. అయినా రెండు నెలల పాటు కుమారుడికి ఐదు వేల రూపాయల చొప్పున పంపించారు. ఇక లాభం లేదని, ఇంటికి వచ్చేయమని చెప్పారు.(మనసున్న ఆటో డ్రైవర్)
అజిత్ ఇంటికి వస్తున్న విషయం తెలిసి ఇరుగు పొరుగు వారు అజిత్ తల్లి ఉషాదేవీని కలిసి కొడుకును ఇంట్లోకి అనుమతించరాదని, 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉంచాలని హెచ్చరించారు. అలా ఊరికి వచ్చిన వారిని క్వారెంటైన్‌లో ఉంచేందుకు ఊరి పాఠశాలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు సర్పంచ్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఉషాదేవీ, అదే విషయాన్ని ఇరుగుపొరుగు వారికి చెప్పింది. చివరకు వాకబు చేయగా, పాఠశాలలో అలాంటి ఏర్పాట్లేమీ సర్పంచ్ చేయలేదు. కనీసం ఆ పాఠశాలలో మంచినీళ్లు కూడా లేవు. దాంతో ఉషాదేవి, ఆమె భర్త కలిసి ఇంటికి దూరంగా రేయింబవళ్లు కష్టపడి కొడుకు కోసం ఇటుకలతో చిన్న గుడిశె నిర్మించారు. ఇటుకలకు 13 వేల రూపాయలు, రెండు వందల రూపాయల చొప్పున వెదురు బొంగులు, 500 రూపాయలకు టార్పాలిన్ కొనుక్కొచ్చి గుడిశె నిర్మించినట్లు ఉషా దేవీ వివరించారు. గుడిశె నిర్మాణానికి 15వేల రూపాయలు ఖర్చయిందని, అదంతా అప్పుతెచ్చే కట్టామని చెప్పారు. అజిత్ కుమార్ మే 11వ తేదీన 48 గంటల ప్రయాణం అనంతరం గోరఖ్‌పూర్‌లో రైలు దిగారు. ఆయన రైలు టిక్కెట్ కోసం 1200 రూపాయలు చెల్లించారు. ఆయన్ని మరో 200 కిలోమీటర్లు రోడ్డు మార్గాన యూపీ అధికారులు పంపించారు. అజిత్ స్వగ్రామమైన మధుకర్ షాపూర్ గౌర్ గ్రామానికి సమీపంలో దించారు. అక్కడ ఆయనకు థర్మల్ స్క్రీనింగ్ చేసి ప్రస్తుతానికి జ్వరం ఏమీలేదని తేల్చి 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా ఆదేశించి పంపించారు. (విమానాలు లేక.. ఇంటికి రాలేక! )
అప్పటి నుంచి అజిత్‌ను తాము 14 రోజులపాటు కనీసం చూడలేదని పక్కింటి అర్జున్ బింద్ తెలిపారు. నిన్న, మొన్నటి వరకు ఉషాదేవీ కుటుంబం మొత్తాన్ని గ్రామస్థులు అంటరానివారిగా చూశారట. గ్రామీణ ఉపాధి హామీ గ్యారంటీ పథకం కిందా పని చేయడానికి కూడా అనుమతించలేదట. ఎందుకు అనుమతించరంటూ రెండు, మూడు రోజుల పంతం పట్టి గొడవ చేస్తే ఉపాధి హామీ పథకం కింద భార్యా, భర్తల్తో ఇద్దరి కాకుండా, ఒక్కర్నే అనుమతిస్తామని చెప్పారట. ఉపాధి హామీ కింద కుటుంబానికి ఒక్కటే కార్డు ఉంటుంది. వంద రోజులు పూర్తయ్యే వరకు ఇంట్లో ఎవరో ఒక్కరే కాకుండా, ఇంట్లోని వారంతా పనికి వెళ్లవచ్చు. మే 17వ తేదీతో గ్రామీణ ఉపాధి హామీ పనులు కూడా నలిచిపోయాయట. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులు ఇంత తిండి పెడితే ఏ పనైనా చేస్తామంటూ ఇళ్లిళ్లు తిరుగుతూ బతుకు ఈడుస్తున్నారట. లాక్‌డౌన్ కారణంగా ఇలాంటి కథలెన్నో!
Comments
Please login to add a commentAdd a comment