మేరా భారత్‌ మహాన్‌ కావాలంటే... | Boora Narsaiah Goud Article On Migrant Workers | Sakshi
Sakshi News home page

మేరా భారత్‌ మహాన్‌ కావాలంటే...

Published Wed, Jun 3 2020 12:54 AM | Last Updated on Wed, Jun 3 2020 12:54 AM

Boora Narsaiah Goud Article On Migrant Workers - Sakshi

ప్రపంచంలో ఐదవ అతి పెద్దఆర్థిక వ్యవస్థ అయిన భారతమాత గర్భంలో దాగివున్న అత్యంత దారు ణమైన పేదరికాన్ని కరోనా మహ మ్మారి ప్రపంచానికి బహిరంగ పరి చింది. దేశ విభజన సమయంలో చూసిన ఘోర దృశ్యాలను మళ్లా చూస్తున్నాం. వేల మైళ్లు కాలినడకన వెళ్లే కార్మికులు, వందల కిలోమీటర్లు గాయపడ్డ తండ్రిని సైకిల్‌ మీద తీసుకెళ్లిన సాహస బాలిక, కాలినడకతో వెళ్తూ ప్రసవించి, అప్పుడే జన్మించిన పసి గుడ్డుకు కొంగుకప్పి మళ్లీ కిలోమీటర్ల దూరం నడిచిన ఒక బీద భావి భారతమాత, ప్రాణం పోయినా సరే ఇంటికి చేరు కోవాలనే తపనతో ఏది దొరికితే దానిలో ప్రయాణించిన భారతదేశ ప్రగతి కారకులు, మన వలస కార్మికులు. దీనికితోడు వారిని తమ స్వస్థలానికి పంపే విషయంలో శ్రామిక్‌ రైళ్లు ఎవరు వేయాలి? ఖర్చు ఎవరు భరించాలన్న విషయంలో కూడా రాజకీయం. కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆర్భాటం లేకుండా లక్షలాదిమందిని రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పంపడం శుభపరిణామం.

వివిధ సర్వేల ప్రకారం దాదాపు 50 కోట్ల శ్రమశక్తి ఉంటే, అందులో 20 శాతం అంటే 10 కోట్ల మంది వలస శ్రామికులు. అంతర్‌ రాష్ట్రాల వలస శ్రామికులు దాదాపు 6.5 కోట్ల నుండి 7 కోట్లు ఉంటారు. అందులో 30 శాతం రోజువారీ కూలీలు, 30 శాతం వివిధ నెలవారీ ఉద్యోగులు, 30 శాతం వివిధ అనధికార ఉద్యోగాలు, వ్యాపారాలలో ఉంటారు. ఇక వీధి విక్రేతలు, చిరు వ్యాపారులు దాదాపు 1.6 – 1.8 కోట్ల మంది. గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం ఉంటే, పట్టణ ప్రాంతాల్లో 70 శాతం ఉంటారు. వలస శ్రామికుల ఎగుమతి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌ గఢ్, కొన్ని ఈశాన్య రాష్ట్రాలు. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుండి తెలం గాణకు, కొద్దిమంది తెలంగాణ నుండి ముఖ్యంగా స్కిల్డ్‌ వర్కర్లు ముంబై, గుజరాత్‌ వలస వెళ్తారు. రాష్ట్రాల వారీగా చూస్తే ఉత్తరప్రదేశ్‌ నుండి 25 శాతం, బిహార్‌ నుండి 14 శాతం, రాజస్తాన్‌ నుండి 6 శాతం, మధ్యప్రదేశ్‌ నుండి 5 శాతం ఉంటారు. నిశితంగా గమనిస్తే ఉత్తర, ఈశాన్య భారత దేశం నుండి దక్షిణ, పశ్చిమ రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజ రాత్‌కు ఎక్కువ వలస వెళ్తారు. అదే విధంగా ఢిల్లీ, పంజా బ్‌లకు వెళ్తారు. సగటు వలస శ్రామికుల నెల ఆదాయం 7,000–12,000 రూపాయలు. పేదరికం అనే రోగానికి వలస శ్రామికుల సమస్య ఒక లక్షణం మాత్రమే. 

231.85 లక్షల కోట్ల రూపాయల స్థూల దేశీయ ఉత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కానీ ఒక వ్యక్తి ఏడాది తలసరి ఆదాయం కేవలం 1,75,000 రూపాయలు మాత్రమే. అది కూడా అంబానీ నుండి హమాలీ వరకు ఉన్న ఆదాయం సగటు కలిపి చేస్తేనే. ప్రపంచంలో మన ర్యాంకు 140. ఇక అత్యధిక బిలియనీర్లు (102) ఉన్న దేశాలలో మాత్రం 4వ ర్యాంకు మనది. అమె రికా తలసరి ఆదాయం 50,57,025 రూపాయలతో 7వ స్థానంలో ఉంటే, చైనా 8,15,475 రూపాయలతో 70వ స్థానంలో ఉన్నది. భారతదేశ సంపద 2018 లెక్కల ప్రకారం సుమారు 900 లక్షల కోట్లు ఉంటే, అందులో 1 శాతం మంది దగ్గర 51.5 శాతం, 9 శాతం మంది దగ్గర 17.1 శాతం, 30 శాతం మంది దగ్గర 17.8 శాతం, 60 శాతం మంది దగ్గర 4.7 శాతం సంపద ఉంది. ప్రపంచీకరణ తరువాత సంపద పెరిగింది. కానీ ఆ సంపద టాప్‌ 10 శాతానికే దక్కింది. భారత్‌ ధనిక దేశం. కానీ అత్యధికమంది భారతీయులు పేద రికంలో ఉన్నారు. వలస శ్రామికులు కింద ఉన్న 60 శాతం లోని అతి పేదరిక వ్యాధిగ్రస్తులు. ఒక రాష్ట్ర ఆదాయం పెర గాలంటే ప్రకృతి సంపదతో పాటు సమర్థవంతమైన పాలన కూడా అవసరం. రాజకీయ వేధింపులు, అసమర్థ నాయ కత్వం వలన ప్రకృతి సంపద ఉన్న రాష్ట్రాలు  కూడా అభి వృద్ధిలో వెనుకబడ్డవి. ఒకప్పుడు బెంగాల్‌ ఇవ్వాళ ఏం ఆలో చిస్తదో, రేపు భారత్‌ ఆలోచిస్తది అనే నానుడి ఉండేది. దశా బ్దాలుగా హింసాయుత రాజకీయాల వలన ఈ రోజు వెనుకబడిపోయింది. 

వలస కార్మికుల సామాజిక పరిస్థితులు గమనిస్తే అత్యధిక మంది హిందువులు, అందులో ప్రధానంగా దళిత, ఆదివాసీ, బీసీ వర్గాలు కనిపిస్తాయి. కులం శ్రామిక, ఆర్థిక దోపిడీ పునాదుల మీద ఏర్పడ్డ ధార్మిక ఫ్యూడల్‌ వ్యవస్థ.  దాని ఫలితం ప్రపంచీకరణ తరువాత ఆర్థిక అసమానతలు అత్యంత వేగంగా పెరిగాయి. బహుజనులు ఆర్థిక ప్రగతి ఫలాలు అందుకునే అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అయినవి. ఇది వర్ణ వ్యవస్థ వలన వచ్చిన మానసిక రోగం. వర్ణ వ్యవస్థ ఇంకా సమాజంలో పూర్తిగా సంక్రమించని ప్రాచీనకాలం అయిన నంద, మౌర్య, దక్షిణ భారత్‌లో పాండ్య, చోళరాజ్యాలు ఉన్నప్పుడు ప్రపంచంలో భారతదేశ జీడీపీ వాటా 23 శాతం. కానీ నేడు కేవలం 3 శాతం. పావర్టీ నిల్, మిడిల్‌ క్లాస్‌ ఫుల్, రెస్పాన్సిబుల్‌ రిచ్‌. అంటే 70 శాతం మిడిల్‌ క్లాస్, 20 శాతం అప్పర్‌ మిడిల్‌ క్లాస్, 10 శాతం రిచ్‌ క్లాస్‌ ఉన్నప్పుడే ఆర్థిక వ్యవస్థ గుణాత్మకంగా పెరుగుతుంది. సంపద పెంచాలి – సంపద పంచాలి అనే నినాదం అమలు కావాలి. రాజకీయ అధికారం అన్ని సమస్యలకు పరిష్కారం అన్నారు అంబేడ్కర్‌. ఉదాహరణకు అభివృద్ధి చెందిన దేశాలలో వారసత్వ సంపద పన్ను ఉంటది. ఫ్రాన్స్‌లో 75 లక్షలు, ఇంగ్లండ్, జర్మనీ, బెల్జియంలో 3 కోట్లు, జపాన్‌లో 1.75 కోట్లు, అమెరికాలో 38 కోట్ల ఆస్తి దాటి, తమ వారసులకు, అయినవారికి ఆస్తి ఇవ్వాలంటే 30–48 శాతం దాకా ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అందువల్లే బిల్‌గేట్స్, వారెన్‌ బఫెట్‌ లాంటి కుబేరులు ప్రభుత్వానికి పన్ను కట్టే బదులు, లక్షల కోట్ల సంపద సామాజిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. కానీ మనదేశంలో లక్ష కోట్ల ఆస్తి కూడా తమ వారసులకు ఒక్క పైసా పన్ను లేకుండా బదలాయించవచ్చు.!

ప్రభుత్వాలు పేద, మధ్యతరగతికి ప్రధాన ఆర్థిక ఇబ్బం దులు కలిగించే విద్య, వైద్యం మీద ఎంతగా ఖర్చు పెడితే, అంతగా పేదరికాన్ని తగ్గించి, మధ్యతరగతిని పెంచవచ్చు. అంతిమంగా భారతదేశాన్ని 2050 నాటికి ప్రపంచంలో అత్యంత ఎక్కువ జీడీపీ ఉన్న దేశంగా తీర్చిదిద్దవచ్చు. కులమత వర్గరహిత సమతుల్య ఆర్థిక అభివృద్ధి, పరిశోధన రంగం బలోపేతం, పని సంస్కృతి, అవినీతి రహిత సమాజ నిర్మాణం, పరిపాలన సరళీకరణ, న్యాయ వ్యవస్థల బలో పేతం ద్వారా 2050 వరకు మేరా భారత్‌ను మహాన్‌గా ఆవిష్కరించవచ్చు. 

వ్యాసకర్త : డా. బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ, భువనగిరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement