
సాక్షి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలోని పలు గ్రామాల్లో సంభవించిన భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. చేజర్ల, ఆదూరుపల్లి, పుట్టుపల్లి, దాచూరు, కొల్లపనాయుడుపల్లిలలో భూప్రకంపనలు సంభవించినట్టు సమాచారం. గురువారం రాత్రి 10 గంటల సమయంలో పెద్ద శబ్దంతో భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు. తెల్లవారుజాము వరకు ప్రకంపనలు కొనసాగినట్టు పల్లెవాసులు వెల్లడించారు. దాదాపు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లల్లో పైన ఉన్న వస్తువులు, వంట పాత్రలు కిందపడిపోయినట్టు తెలిపారు. ప్రాణ భయంతో పిల్లాపాపలతో కలిసి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెప్పారు. మంచాల మీద పడుకున్న వారు కిందకు పడిపోయినట్టు స్థానికుడొకరు వెల్లడించారు.
సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామాల్లో పర్యటించారు. పెన్నా నది పరివాహక ప్రాంతం కావడంతో ఇలాంటివి సహజమని, ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసాయిచ్చారు. శాస్త్రవేత్తలతో భూకంపన తీవ్రతను అంచనా వేయిస్తామన్నారు. భవిష్యత్తులో భూకంపం వచ్చే ప్రమాదం ఉందా, లేదా అనే దానిపై సమగ్ర పరిశీలన జరుపుతామన్నారు. అయితే ప్రజలు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment