రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు
బుధవారం ఉదయం 7.27 గంటలకు కంపించిన భూమి
దట్టమైన అటవీ ప్రాంతంలో 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం... రాష్ట్రవ్యాప్తంగా స్వల్ప ప్రకంపనలు
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కాస్త ఎక్కువ తీవ్రత
భూకంప కేంద్రానికి సమీపంలోనే సమ్మక్క, సారలమ్మ గద్దెలు
అక్కడ పూజలు జరుగుతున్న సమయంలో ప్రకంపనలు
ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం... 55 ఏళ్ల తర్వాత మళ్లీ కంపించిన భూమి
మన దగ్గర భారీ భూకంపాలు వచ్చే అవకాశాలు లేవంటున్న శాస్త్రవేత్తలు
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉంటుందని వెల్లడి
సాక్షి, హైదరాబాద్/ ములుగు/ ఏటూరునాగారం/ సాక్షి నెట్‌వర్క్: బుధవారం ఉదయం.. సమయం 7.27 గంటలు.. ములుగు జిల్లా మేడారంలోని దట్టమైన అటవీ ప్రాంతం.. ఉన్నట్టుండి ఏదో కలకలం.. ఒక్కసారిగా అంతా ఊగిపోవడం మొదలైంది.. నిమిషాల్లోనే ఇది వందల కిలోమీటర్ల దూరం వ్యాపించింది. ముఖ్యంగా గోదావరి నది పరీవాహక ప్రాంతమంతటా విస్తరించింది. తమ చుట్టూ ఉన్నవన్నీ ఊగిపోతున్నట్టుగా కనిపించడంతో జనం గందరగోళానికి గురయ్యారు.. మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం ఇది.
ఇక్కడ రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్టు జాతీయ భూకంప పరిశోధన కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ – ఎన్‌సీఎస్) ప్రకటించింది. ఇక్కడి దట్టమైన అటవీ ప్రాంతంలో సుమారు 40 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ఇంతకుముందు 1969లో భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో భూకంపం రాగా.. 55 ఏళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు అదేస్థాయిలో ప్రకంపనలు రావడం గమనార్హం. అయితే భూకంపాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉన్న జోన్–2, 3ల పరిధిలో తెలంగాణ ఉందని... ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ‘నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌జీఆర్‌ఐ)’శాస్త్రవేత్తలు తెలిపారు.
కంపించిన సమ్మక్క, సారలమ్మ గద్దెలు
భూకంప కేంద్రానికి అత్యంత సమీపంలో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం వద్ద ప్రభావం ఎక్కువగా కనిపించింది. సమ్మక్క–సారలమ్మ గద్దెలపై భక్తులు, పూజారులు ఉన్న సమయంలో వచ్చిన ప్రకంపనలతో.. అమ్మవార్ల హుండీలు, పల్లెం, ఇతర సామగ్రి కదలిపోయాయి. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి కూడా. బుధవారం మేడారం వచ్చి సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న ములుగు కలెక్టర్ దివాకర టీఎస్ మీడియాతో మాట్లాడారు. సెపె్టంబర్ 4న దట్టమైన అటవీ ప్రాంతంలో టోర్నడోలతో వేలాది చెట్లు నేలమట్టం కావడానికి.. ఇప్పుడు వచ్చిన భూకంపానికి ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అవాస్తవ ప్రచారాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
రెండు రాష్ట్రాల్లోనూ ప్రభావం
మేడారం కేంద్రంగా వచ్చిన భూకంపం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కనిపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు భూకంపం రాగా.. సుమారు రెండు, మూడు నిమిషాల తర్వాత దూర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. భూకంప కేంద్రం నుంచి చుట్టూ సుమారు 225 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించాయి. ఏపీలో ఎనీ్టఆర్ జిల్లా నుంచి విశాఖపట్నం జిల్లా వరకు స్వల్పంగా రెండు, మూడు సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్టు గుర్తించారు. వాటి తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3 పాయింట్లలోపే నమోదైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తెలంగాణతోపాటు పొరుగు రాష్ట్రాల్లో కలిపి వందకు పైగా ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) వెబ్‌సైట్, భూకంప్ మొబైల్‌యాప్ ద్వారా వెల్లడైంది.
ఇది రెండో పెద్ద భూకంపం...
గోదావరి నది పరీవాహక ప్రాంతం వెంబడి రిక్టర్ స్కేల్‌పై 2 నుంచి 4 తీవ్రత వరకు భూకంపాలు వచ్చినా.. ఇలా 5 పాయింట్లకు పైన తీవ్రత ఉండటం అరుదని నిపుణులు చెబుతున్నారు. 1969 జూలై 5న భద్రాచలం వద్ద 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే పెద్దది. 1983లో మేడ్చల్‌లో 4.8, 2021లో పులిచింతలలో 4.6 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు మేడారంలో వచ్చిన భూకంపం గత 55 ఏళ్లలో రెండో పెద్దదిగా రికార్డయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి చూస్తే... ఇది నాలుగో అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు.
సమ్మక్క, సారలమ్మ మహిమ అనుకున్నాం..
మేడారంలోని సారలమ్మ గద్దె వద్ద ఉదయం పూజలు చేస్తున్నాం. ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మవార్ల గద్దెలు, గ్రిల్స్ ఊగడం మొదలుపెట్టాయి. రెండు, మూడు సెకన్లు గద్దెలు కదిలాయి. భయాందోళనకు గురయ్యా. ఇది సమ్మక్క, సారలమ్మ తల్లుల మహిమ అనుకున్నా.. తర్వాత భూకంపం అని తెలిసింది.
– కాక కిరణ్, సారలమ్మ, పూజారి
దేశంలోనే సురక్షిత ప్రాంతం హైదరాబాద్
భూకంపాల విషయంలో దేశంలోనే అత్యంత సురక్షిత ప్రదేశం హైదరాబాద్. తెలంగాణలోని చాలా ప్రాంతాలు దక్కన్ పీఠభూమిపై ఉండటంతో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. సాధారణంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు ఒకింత సేఫ్‌జోన్‌లోనే ఉన్నాయి. అయితే గోదావరి నదికి దగ్గరిలోని పరీవాహక ప్రాంతాల్లో తీవ్రత కొంత ఎక్కువగా ఉంటుంది. వేల ఏళ్లుగా నది ప్రవాహం వల్ల భూగర్భంలో ఏర్పడే పగుళ్లు (ఫాల్ట్స్) దీనికి కారణం. 5 పాయింట్లలోపు వచ్చే భూకంపాలతో ప్రమాదమేమీ ఉండదు. భవనాలు ఊగడం, పగుళ్లురావడం వంటివి జరగొచ్చు. ఆరు, ఏడు పాయింట్లు దాటితేనే భవనాలు కూలిపోతాయి.
– పూర్ణచంద్రరావు, పూర్వ డైరెక్టర్, నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ
ఇక్కడ తరచూ ప్రకంపనలు సాధారణమే..
గోదావరి నది పరీవాహక ప్రాంతంలో తరచూ మనం గమనించలేనంత స్వల్ప స్థాయిలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. ఈ జోన్ పరిధిలో రిక్టర్ స్కేల్‌పై 6 పాయింట్ల వరకు భూకంపాలు వచ్చే వీలుంది. జియోలాజికల్, టెక్టానిక్ యాక్టివిటీని బట్టి తెలంగాణ జోన్–2, జోన్–3ల పరిధిలో ఉంది. హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలు జోన్–2లోకి వస్తాయి. ఇప్పుడు భూకంపం సంభవించిన ప్రాంతం జోన్–3లో ఉంది. ఏపీలోని ప్రకాశం, ఒంగోలు, అద్దంకి వంటివి కూడా జోన్–3లోనే ఉన్నాయి.
– ఎం.శేఖర్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్‌జీఆర్‌ఐ
భూమి పొరల్లో సర్దుబాటుతోనే..
భూమి లోపలి పొరల్లో అసమతౌల్యత ఉంటే సర్దుబాటు అయ్యే క్రమంలో భూకంపాలు వస్తాయి. మేడారం భూకంపం అలాంటిదే. నేల పొరల్లో సర్దుబాటు పూర్తయ్యే వరకు కంపనాలు వస్తూ ఉంటాయి. గతంలో సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు లినియమెంట్ ఉన్నట్టు తేలింది. అయితే భారీ వర్షాలు, పెనుగాలులకు భూకంపాలకు సంబంధం లేదు. వాటికి గ్లోబల్ వార్మింగ్ వంటి వాతావరణ మార్పులే కారణం. ఈ ఏడాది ఉత్తరార్ధ గోళంలో భీకర వర్షాలు కురిశాయి. దుబాయ్ వంటి ఎడారి దేశాల్లో వరదలు వచ్చాయి.
– చకిలం వేణుగోపాల్, రిటైర్డ్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సర్వే ఆఫ్ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment