ఆత్మహత్యాయత్నం చేసి ఒంగోలులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన పాలసేకరణదారుడు నరహరి నాగిరెడ్డి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు డెయిరీ నూతన పాలకవర్గం గజకర్ణ.. గోకర్ణ...టక్కు టమార విద్యలతో ముందుకు సాగుతోంది. అంతా అరచేతిలో చుక్కలు చూపిస్తూ ‘హిప్నటిజాన్ని’ తలపిస్తున్నారు. అవిగో పాల డబ్బులు...ఇవిగో ఉద్యోగుల వేతనాలు..అల్లవిగో పాల రవాణా వాహనాల పాల బకాయిలు అంటూ ఊహల పల్లకిలో తేలియాడే విదంగా డెయిరీ కార్యకలాపాల్లో చుట్టూ పెనవేసుకున్న వారికి చుక్కలు చూపిస్తున్నారు. రూ.35 కోట్లు వచ్చేశాయి ఇంకేముంది కష్టాలు తీరుతాయని భావించిన అటు పాడి రైతులకు, ఇటు ఉద్యోగులకు, పాలు రవాణా చేసిన వాహనదారుల ఆశలపై నీళ్లు చల్లారు. డెయిరీని నిలువునా ముంచిన అధికార తెలుగుదేశం పాలకమండలిని మించి పోతున్న ప్రస్తుత అధికారులతో కూడిన పాలకమండలి పరిపాలన కూడా పాత వారినే తలపిస్తుందనటంలో సందేహం లేదు. చివరకు పాడి రైతులు, పాలు సేకరించి సరఫరా చేసిన ఏజెంట్లు చివరకు ఆత్మహత్యా యత్నాలకు ఒడిగట్టాల్సిన పరిస్థితులను పాలకులు కల్పించటం అత్యంత దారుణంగా మారింది. కనిగిరికి చెందిన పాల రైతు నరహరి నాతిరెడ్డి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పూనుకున్నాడు.
ఒంగోలు డెయిరీ ఉమ్మడి రాష్ట్రాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. ఒంగోలు గిత్త, ఒంగోలు ఆవు ...ఒంగోలు డెయిరీ పాల రుచే వేరు. రాష్ట్రంలో ఏ జిల్లా పాలకు లేని అమృతమైన పాల రుచి ఒక్క ప్రకాశం జిల్లాకే సొంతం. అలాంటి డెయిరీని పాలకమండలి నిలువునా ముంచేసింది. చివరకు పాల రైతులు, ఉద్యోగులు, పాల రవాణా చేసిన వాహనదారులు, ప్రజా సంఘాల ఆందోళనలతో పాత పాలకమండలిని రద్దుచేసిన ప్రభుత్వం కంపెనీ చట్టంలో ఉన్న డెయిరీని మార్చి ఉద్యోగులతో కూడిన పాలక మండలిని ఏర్పాటుచేసింది. ఫెడరేషన్ నుంచి రూ.35 కోట్లు అప్పుగా కూడా ఇప్పించింది. ఇప్పించినట్లే ఇప్పించి సాక్షాత్తు ప్రభుత్వమే నూతన పాలకమండలితో సన్నాయి నొక్కులు నొక్కిస్తుందన్న అపవాదును మూటకట్టుకుంటుంది. జిల్లాకు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే మాత్రం డెయిరీ అధికారులు, పాలకమండలి డెయిరీని అభివృద్ధి చేస్తున్నాం.
పాల బకాయిలు చెల్లిస్తున్నాం, ఉద్యోగుల జీతాల బకాయీలు ఇచ్చేస్తున్నాం అని అటు అధికారులు, ఇటు పాలకమండలి ప్రకటనలు గుప్పిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం మాత్రమే పాకులాడుతున్నారన్నది నిత్యకృత్యమైంది. జిల్లాకు గత పది రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు సార్లు వస్తున్నాడు. మొదటిసారి జూలై 28వ తేదీన ఒంగోలు నగరంలో ధర్మ పోరాట దీక్షకు వచ్చారు. ఆ ముందు రోజు డెయిరీ చైర్మన్, ఏపీడీడీసీఎఫ్ ఎండీ జె.మురళి ఒంగోలు వచ్చి 25 పాల సొసైటీలకు సంబంధించిన పాల బకాయిలు రూ.36.30 లక్షలు చెల్లించాం అని చెప్పారు. మిగతా వారికి కూడా పాల బకాయీలు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. కాని 11 రోజులయింది ఇప్పటకీ ఏ ఒక్క పాడి రైతుకూ ఒక్క రూపాయి కూడా చెల్లింపులు జరుగలేదు.
మొత్తం జిల్లాలో ’12 కోట్ల వరకు పాల బకాయీలు ఉన్నాయి. ఇక పోతే మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పామూరు, చీరాల ప్రాంతాలకు వస్తున్నారు. దీంతో మళ్లీ మరో డ్రామాకు డెయిరీ అధికారులు, పాలక మండలి మరో డ్రామాకు తెరలేపారు. మరమ్మత్తులు పూర్తి కాకుండానే పాలపొడి ఫ్యాక్టరీని ట్రయల్ రన్ పేరిట ఫొటోలకు ఫోజులిచ్చి మరీ ప్రకటించుకునేందుకు పాకులాడుతున్నారు. ఇప్పటి వరకు కనీసం మరమ్మతుల కోసం కనీసం రూ.5 లక్షలు కూడా వెచ్చించలేదన్నది ప్రచారం జరుగుతోంది. పాలపొడి ఫ్యాక్టరీని రూ.30 లక్షలతో మరమ్మతులు చేయించి కర్ణాటక నుంచి పాలు తెప్పించి యథావిధిగా కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జిల్లాకు రాకముందు చైర్మన్ చెప్పిన మాట.
Comments
Please login to add a commentAdd a comment