పంట కాలువనూ పీల్చేశారు! | Mining mafia activities in krishna district | Sakshi
Sakshi News home page

పంట కాలువనూ పీల్చేశారు!

Published Mon, Jul 30 2018 3:32 AM | Last Updated on Mon, Jul 30 2018 3:32 AM

Mining mafia activities in krishna district - Sakshi

కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు దొనబండ మైనింగ్‌ క్వారీల మార్గంలో కాలువను ఆక్రమించి వేసిన రోడ్డు

రెండువేల ఎకరాలకు నీరందించే పంట కాలువ అది. రైతుల లోగిళ్లలో ధాన్యరాశులు కురిపించే వరదాయని అది. కానీ అదిప్పుడు మాయమైపోయింది. మైనింగ్‌ మాఫియా బారిన పడి రూపు కోల్పోయింది. క్వారీలను కొల్లగొట్టడంతోపాటు పంటలకు సాగు నీరందించే సాగర్‌ కాలువను సైతం మైనింగ్‌ మాఫియా మాయం చేసింది. తమ వాహనాలు తిరగడానికి వీలుగా కాలువను ఆక్రమించేయడమేగాక అడ్డంగా రహదారిని నిర్మించింది. అంతేకాదు కాలువ గట్టు మట్టిని సైతం కొల్లగొట్టి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంది. దీంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు పంట కాలువ కనిపించకుండా మాయమైంది.

సందట్లో సడేమియా అన్నట్టుగా కాలువ మరమ్మతు పనుల కాంట్రాక్టు పొందిన కాంట్రాక్టర్‌ ఎటువంటి మరమ్మతులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టించి రూ.కోట్లు దండుకున్నారు. ఫలితంగా కాలువ పూడుకుపోయి నీరు దిగువకు రాని దుస్థితి నెలకొంది. దీంతో రెండువేల ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారి రైతులు తల్లడిల్లిపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఇదంతా ఎక్కడో కాదు.. సాక్షాత్తూ సాగునీటి శాఖ మంత్రి ఇలాకాలోనే చోటు చేసుకుంది. అధికారపార్టీ అండతో చెలరేగుతున్న మైనింగ్‌ మాఫియా ఆగడాలకు ఇది మరో నిదర్శనం.


సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో నాగార్జునసాగర్‌ నుంచి సాగునీటిని తీసుకొచ్చే ఇబ్రహీంపట్నం మేజర్‌ కెనాల్‌ దాదాపు ఐదు కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉంది. గ్రామ శివారు సర్వే నంబర్‌ 801లో ఉన్న 1,204 ఎకరాల కొండపోరంబోకులోని దొనబండ క్వారీల పక్కనుంచి ఈ కాలువ ప్రవహిస్తుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు, పరిటాల చెరువుకు ఈ కాలువ ద్వారా నీరందుతుంది. గొట్టిముక్కల అబ్బరాజు చెరువు వరకు కాలువ బాగానే ఉంది.

నాగార్జునసాగర్‌ నుంచి నీళ్లు విడుదల చేస్తే చెరువుకు నీరు చేరుతుంది. ఆ తర్వాత.. మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతం నుంచి ఈ కాలువ సాగుతుంది. అయితే ఈ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్‌ చేస్తున్న మాఫియా.. అధికార పార్టీ అండతో చెలరేగిపోతోంది. క్వారీలను కొల్లగొట్టే క్రమంలో అడ్డూఅదుపు లేకుండా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో కంచికచర్ల మండలం పరిటాల దొనబండ క్వారీలు ఉన్న ప్రదేశంలో ఐదు కిలోమీటర్ల మేరకు ఉన్న పంట కాలువను క్వారీల నిర్వాహకులు తమ సొంత అవసరాలకోసం ఆక్రమించారు.

క్వారీల ప్రాంతంలోకి తమ వాహనాలు వెళ్లాల్సి ఉండడంతో కెనాల్‌పైనే రహదారులు నిర్మించారు. కార్మికులకు నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ పంట కాల్వ ద్వారా పరిటాల చెరువు కింద రెండువేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. మైనింగ్‌ మాఫియా కాలువను ఆక్రమించడమేగాక కాలువకు అడ్డంగా రోడ్లను సైతం నిర్మించడంతో సాగర్‌ నీరు వదిలినా ఈ కాలువలో నీళ్లు రావడానికి అవకాశం లేకుండా పోయింది.

మరమ్మతుల పేరుతో నిధులు స్వాహా..
గత వేసవిలో దుగ్గిరాలపాడు నుంచి దొనబండ వరకు ఉన్న సాగర్‌ కెనాల్‌ ఎర్త్‌ వర్క్‌కోసం నిధులు మంజారయ్యాయి. దాదాపు 24 కిలోమీటర్ల వరకు ఉన్న కాలువ మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.9.35 కోట్లు నిధులు మంజూరు చేసింది. పనులను అధికారపార్టీకి చెందిన కాంట్రాక్టర్‌కు అప్పగించారు. అయితే సదరు కాంట్రాక్టర్‌ మైనింగ్‌ జరుగుతున్న ప్రాంతంలో ఉన్న ఐదు కిలోమీటర్ల మేరకు కాలువ మరమ్మతులు చేపట్టకపోగా పనులు చేసినట్టుగా చూపించి బిల్లు తీసుకున్నారు. ఆ మేరకు రూ.2 కోట్ల నిధులు స్వాహా చేసినట్టు సమాచారం.

5 వేల ట్రాక్టర్ల మట్టి విక్రయం...
ఒకవైపు కాలువను ఆక్రమించి రోడ్లు వేసిన మైనింగ్‌ మాఫియా కాలువ గట్టుమీద ఉన్న మట్టిని కూడా వదల్లేదు. కాలువ గట్టుపై ఉన్న మట్టిని విక్రయించి సొమ్ము చేసుకుంది. దాదాపు ఐదువేల ట్రాక్టర్ల మట్టిని తవ్వేసి విక్రయించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో కాలువ మరింత కుంచించుకుపోయి ఆనవాళ్లను కోల్పోయింది.

బిల్లులు తీసుకున్నారు
గతంలో కెనాల్‌ రిపేర్ల పనులు జరిగినట్టు రికార్డుల్లో ఉంది. ఆ టైంలో నేను లేను. కానీ ఆ రికార్డులు మాత్రం బదిలీపై వెళ్లిన ఏఈ ఇవ్వలేదు. పనులు మాత్రం పూర్తిచేసి బిల్లులు తీసుకున్నట్టు నా దృష్టికి వచ్చింది. – రమేష్‌బాబు, ఇరిగేషన్‌ ఏఈ కంచికచర్ల

కాలువ లేకుండా చేశారు
గతంలో క్వారీలున్న ప్రాంతంలో ఉన్న సాగునీటి కాలువను ఆనవాళ్లు కూడా లేకుండా చేశారు. కొందరు క్వారీ యజమానులు వారి లారీలు పోయేందుకు కాలువను పూడ్చి రోడ్డు నిర్మించుకున్నారు. కాలువపైనే రహదారులు ఏర్పాటు చేసుకోవడంతో పూర్తిగా పూడిపోయింది. దీంతో సాగునీటి పారుదల ఆగిపోయింది. క్వారీల సమీపంలోనే నాకు 8 ఎకరాల భూమి ఉంది. నీరు రాక ప్రస్తుతం వర్షంపైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నాం.
– మాగంటి ప్రసాద్‌ రైతు, పరిటాల

గట్టు కూడా కన్పించడం లేదు
సాగర్‌ కెనాల్‌లో గతంలో సాగునీరు పుష్కలంగా ఉండేది. కొందరు క్వారీ యజమానులు వారి అవసరాలకోసం కాలువనే పూర్తిగా మాయం చేశారు. రైతుల అవసరాలకంటే వారి వ్యాపార ఆదాయంకోసం వాడుకోవటం బాధగా ఉంది. వారికి రాజకీయంగా పలుకుబడి ఉండడంతో అ«ధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కాలువ గట్టు మట్టిని కూడా వదలిపెట్టకుండా అమ్మేసుకున్నారు. దీంతో గట్టు కూడా కన్పించడం లేదు.
– పురమా సత్యనారాయణ రైతు, పరిటాల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement