♦ ‘క్వారీ కోరల్లో పచ్చని పొలాలు
♦ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు
♦ పేలుళ్లకు బీటలువారుతున్న ఇళ్లు
♦ అనారోగ్యాల పాలవుతున్న జనం
ఒకప్పుడు పచ్చని పొలాలు...చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆ గ్రామాలు ఉండేవి. ఊట, కొండగెడ్డల నీటితో పంటలతో కళకళలాడే ఆ గ్రామాల్లో కొంతకాలంగా అలజడి మొదలైంది. క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. ఎప్పుడు ఏ రాయి నెత్తిన పడుతుందోనన్న భయం...ఊటనీరురాక ఏటా ఎండిపోతున్న పొలాలు...చివరికి గ్రామాలనే ఖాళీచేసి వెళ్లిపోదామనే దుస్థితి.
చోడవరం : వ్యవసాయమే ఆధారంగా ఉండే గ్రామాల్లో ఇప్పుడు మైనింగ్ మాఫియా కోరలు చాస్తోంది. కొండలు, గుట్టలు పేల్చి సొమ్ముచేసుకుంటున్న కొందరు పచ్చని పొలాలను బుగ్గిపాలు చేస్తున్నారు. బడాబాబులు, రాజకీయ నాయకుల అండదండలతో కొండలను ఆక్రమిస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా వరి,చెరకు, అపరాలు పండించే మాడుగుల, చోడవరం, అనకాపల్లి, రావికమతం, బుచ్చెయ్యపేట, కె.కోటపాడు, నర్సీపట్నం, మాకవరంపాలెం ప్రాంతాలు ఇప్పుడు క్వారీ పేలుళ్లతో దద్దరిల్లుతున్నాయి. మాడుగుల మండలం ఎం.కృష్ణాపురం,ఎరుకువాడ, చింతలూరు, విజెపురం, కె.కోటపాడు మండలం దాలివలస, పిండ్రంగి, రావికమతం మండలంలో మరుపాక, కొట్నాబిల్లి, అనకాపల్లి మండలంలో మార్టూరు, బవులవాడ, దర్జీనగర్, శంకరం, మామిడిపాలెం గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. క్వారీల వల్ల గ్రామాల్లో ప్రజలు వ్యవసాయం కోల్పోయి, ఊరులోకి ఎప్పుడు వచ్చి పడతాయో తెలియని బండరాళ్ల మధ్య, దుమ్ముదూళి మింగేస్తూ అనుక్షణం ఆందోళనతో జీవిస్తున్నారు.
ఒకప్పుడు ఈ గ్రామాలు నిత్యం పంటలతో కళకళలాడుతూ ఉండేవి. క్వారీలు పెరిగిపోవడంతో కొండ ఊటగెడ్డలన్నీ మూసుకుపోయాయి. ఇలా నీటి సౌకర్యం లేక ఈ ప్రాంతాల్లో 20శాతం సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. మాడుగుల మండలం కృష్ణాపురం కొండ నుంచి ఊటగెడ్డల్లో నిత్యం నీరు పారేది. పంటలు బాగా పండేవి. అటువంటి ఈ గ్రామం ఇప్పుడు పంటలు నాశనమై, క్షణక్షణం భయం గుప్పెట్లో బతకాల్సిన దుస్థితి. ఈ గ్రామం సమీప కొండలో నల్లరాయి ఉండటంతో ఒకే అనుమతితో ఇక్కడ పదుల సంఖ్యలో క్వారీలు నిర్వహిస్తున్నారు. ఈ గ్రామంలో రాజులకాలం నుంచి ఉన్న తాగునీటి కోనేరును సైతం క్వారీ యజమానులు కప్పేశారు.
కొండ నుంచి పంట కాలువలకు వచ్చే నాలుగు ఊటగెడ్డలనూ కప్పేయడంతో సుమారు 200ఎకరాలకు సాగునీరు అందక రైతులు నష్టపోతున్నారు. వీరవిల్లి అగ్రహారం శివారు ఎరుకువాడపై గ్రానైట్ క్వారీ ఉంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. ఆ సమయంలో పెద్దపెద్ద రాళ్లు పచ్చని పొలాల్లోకి పడి పంటలు నాశమైపోతున్నాయి. కె.కోటపాడులో క్వార్జ్ రాయి క్వారీలు, మరుపాక, కొట్నాబిల్లి గ్రామాల్లో నల్లరాయి మెటర్ క్వారీల్లో అక్రమ బ్లాస్టింగ్‌లు జరుగుతున్నాయి. గంధవరం సమీపంలో కొండపై అక్రమ బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. ఇక చోడవరం-అనకాపల్లి రోడ్డులో అయితే చెప్పనక్కరలేదు.
ఈ రోడ్డులో గంథవరం నుంచి తుమ్మపాల వెళ్లేవరకు దారిపొడవునా ధన్..ధన్ అంటూ కొండలు నిత్యం పేలుతూనే ఉంటాయి. నిత్యం రాయి క్రషింగ్‌తో బుగ్గి ఆయా గ్రామాలను, పంటలను ఆవరిస్తోంది. వాతావరణం పూర్తిగా కలుషితమై పంటలు నాశనమవుతున్నాయి. వరి,చెరకు, కంది, ఆపరాల పంటలతోపాటు మామిడి, జీడి తోటలు ఈ బూడిదపడి ఎర్రగా మారిపోయి దిగుబడి తగ్గిపోతోంది. క్రషర్‌బుగ్గితో చిన్నారులు, వృద్ధులు తరుచూ ఆనారోగ్యం బారిన పడుతున్నారు. ఎక్కువగా కిడ్నీల వ్యాధులకు గురవుతున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ఐదేళ్లలో సుమారు 100 మంది వరకు కిడ్నీల వ్యాధికి గురయ్యారంటే కమ్ముకున్న ఈ కాలుష్యం ప్రజాఆరోగ్యాన్ని ఎలా క బళిస్తోందో అర్ధమవుతుంది.
పేలుళ్ల శబ్ధాలకు ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. ఎం. కృష్ణాపురం, మార్టూరు, బవులవాడ గ్రామ ప్రజలైతే ఒక దశలో గ్రామాలనే వదిలిపోవాలా... అంటూ ఆందోళనలు సైతం చేపట్టిన సంఘటనలు ఉన్నాయి.అక్రమ బ్లాస్టింగ్‌లకు ఐదేళ్లల్లో 18మంది వరకు మృతిచెందారు. అనేక మంది శరీర అవయవాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో అక్రమ బ్లాస్టిం గ్‌లు నిరువరించడంతోపాటు క్రషర్ల నుంచి దు మ్ము బయటికి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ఉన్న క్వారీల లీజను రద్దుచేయడంతోపాటు కొత్తక్వారీలకు అనుమతి ఇవ్వకుండా చూడాలని అధికారులను, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బతుకులు బుగ్గి
Published Mon, Apr 13 2015 2:42 AM | Last Updated on Wed, Apr 3 2019 3:55 PM
Advertisement