
టెక్కలి: రాజకీయంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించే విధంగా తన పార్టీ నాయకులతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులను ప్రోత్సహించిన మంత్రి అచ్చెన్నాయుడును ఏ–1గా, ఆయన అనుచరుడు బోయిన రమేష్‌ను ఏ–2 ముద్దాయిలుగా చేర్చాలని వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు తమ్మినేని సీతారాం, పీఏసీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం పార్లమెంట్ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై గురువారం టీడీపీ నాయకులు దాడి చేయడంతో పాటు పార్టీ నాయకులు బోయిన నాగేశ్వరరావు, నేతింటి నగేష్, పిల్లల లక్ష్మణరావు, మెండ తాతయ్య, కాళ్ల ఆదినారాయణ, తోట రమణమూర్తి, కాళ్ల సంజీవరావు, అన్నెపు రామారావు, దుబ్బ వెంకట్రావు తదితరులపై మారణాయుధాలతో దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ శుక్రవారం కోటబొమ్మాళిలో శాంతియుత ర్యాలీతో పాటు బంద్ నిర్వహించారు.
పార్టీ కార్యాలయం నుంచి కోటబొమ్మాళి, కొత్తపేట వరకు బాధితులతో కలిసి కార్యకర్తలంతా భారీ ర్యాలీ చేశారు. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కొంత మంది కవ్వింపు చర్యలకు పాల్పడడంతో, ఇరువర్గాల మధ్య తగాదాకు దారితీసింది. శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ, బంద్‌ను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోటబొమ్మాళిలో రౌడీ రాజకీయాలకు ఊపిరి పోసేలా మంత్రి అచ్చెన్నాయుడు తన అనుచరులతో తోడేళ్ల మాదిరిగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేయడం అప్రజాస్వామికమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం ఓటమి భయంతోనే మంత్రి ఇటువంటి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న కోటబొమ్మాళిలో విధ్వంసాన్ని సృష్టిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తమ పార్టీ వారిపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో తమకు న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. బంద్‌కు వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారు. దుకాణాలు మూతపడ్డాయి. టెక్కలి, కోటబొమ్మాళి, నందిగాం, సంతబొమ్మాళి మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment