సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని, కుట్రలతో ప్రభుత్వంపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలోనే ముఖ్యమంత్రుల పనితీరులో టాప్ ఫైవ్ లో సీఎం వైఎస్ జగన్ ఉన్నట్లు సర్వేలో వెల్లడైందన్నారు. టీడీపీ ప్రభుత్వం రైతుల కష్టాలను పట్టించుకోలేదని, ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా నీరుగార్చిందని నిప్పులు చెరిగారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీని ఇతర రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. (సీఎం వైఎస్ జగన్ ఏడాది పాలన భేష్)
పాత బకాయిలతో సహా చెల్లించాం..
‘‘గత టీడీపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే పాత బకాయిలతో సహా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది. ప్రతీ నెలా ఒకటో తేదీనే ఉదయం ఆరు గంటలకే పెన్షన్ అందిస్తున్న ఘనత మాది. మీరు అధికారంలో ఉన్నప్పుడు వెయ్యి రూపాయిల ఇచ్చిన పెన్షన్ ని మేము రెట్టింపు చేశాం. త్వరలో 2,500 రూపాయిలు కూడా చేయబోతున్నాం. ఈ ఏడాది జులై 7 న రాష్ట్ర వ్యాప్తంగా 27 లక్షల పైగా పేదలకి ఇళ్ల స్ధలాలు ఇవ్వబోతున్నాం. ఎన్నికల హామీలలో తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ ది. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా రాష్ట్రంలో దుకాణాలని 33 శాతం తగ్గించాం. రాష్ట్రంలో వైఎస్సార్ జలయజ్ఞ పేరుతో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టలు పూర్తి చేయడంపై దృష్టి సారించాం. ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని’’ అవంతి శ్రీనివాస్ తెలిపారు. (సంక్షేమ పాలనను చూడలేకే కుట్రలు)
లోకేష్ భ్రష్టు పట్టించారు..
చంద్రబాబు, లోకేష్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్‌కు సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. ‘‘గత ఐదేళ్లగా చంద్రబాబుని భ్రష్టు పట్టించింది లోకేష్ కాదా? గత ఐదేళ్లూ కూడా కుల జాడ్యం, అవినీతికి, అక్రమాలకి లోకేష్ కారణం కాదా? లోకేష్ నాయకత్వాన్ని మీ ఎమ్మెల్యేలలో ఒక్కరైనా ఒప్పుకుంటారా. లోకేష్ వల్లే టీడీపీ పూర్తిగా దెబ్బతిన్న మాట వాస్తవం కాదా? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత బాధితులని లోకేష్ ఎందుకు పరామర్శించలేదని’ మంత్రి ప్రశ్నించారు.
వారు ట్విటర్,జూమ్‌లకే పరిమితం అయ్యారు..
దురుద్దేశ్యంతో లోకేష్ చేస్తున్న విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు, లోకేష్ జూమ్, ట్విటర్‌కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ఓడిపోయారనే కారణాలతో కళా వెంకట్రావుని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని లోకేష్ కుట్రలు చేస్తున్నారని అవంతి ఆరోపించారు. అన్ని వనరులు ఉన్న విశాఖని గతంలోనే చంద్రబాబు రాజధానిగా చేసి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఎంతో అవకాశం ఉండేదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని మూడు రాజధానులు ప్రకటిస్తే.. కుట్రలతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. విశాఖ భవిష్యత్తులో అంతర్జాతీయ నగరంగా ఎదుగుతుందని అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment